బాలీవుడ్ కథల విషయంలో హీందీ ప్రేక్షకులు సంతృప్తిగా లేరు. సౌత్ కథల పట్ల మక్కువ చూపిస్తున్నారు అంటూ గత కొన్ని రోజులుగా పరిశీలకులు చెబుతూ వస్తున్నారు. అదేదో బాలీవుడ్ ప్రేక్షకులు వాళ్లకు చెప్పినట్లుగా. అయితే మన కథలకు అక్కడ ఎంతవరకు విజయాలు దక్కుతున్నాయి అంటే సరైన విజయం దక్కడం లేదనే చెప్పాలి. దానికి రీసెంట్ ఉదాహరణ ‘విక్రమ్ వేద’. తమిళంలో మంచి హిట్ అయిన ఈ సినిమాకు బాలీవుడ్‌లో సరైన స్పందన లేదు. దీంతో మరో డిజాస్టర్ బాలీవుడ్ ఖాతాలో పడింది.
విజయ్ సేతుపతి, మాధవన్ ప్రధాన పాత్రధారులుగా 2017లో విడుదలైన తమిళ చిత్రం ‘విక్రమ్ వేద’. సుమారు రూ.11 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దాదాపు రూ.70 కోట్లు వసూలు చేసింది. పుష్కర్ – గాయత్రి దర్శకత్వంలో ఈ సినిమాను బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ – సైఫ్ అలీ ఖాన్ చేశారు. సుమారు రూ.175 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా మీద అంచనాలు భారీగానే పెరిగాయి. కానీ వసూళ్లు అలా లేవు.
‘విక్రమ్ వేద’ సినిమా విడుదలైన వెంటనే బాలీవుడ్ మీడియా పీపుల్, సెలబ్రిటీలు సినిమాను తెగ పొగిడేశారు. నాలుగేసి రేటింగ్‌లు ఇచ్చుకుంటూ వెళ్లిపోయారు. దీంతో బాలీవుడ్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న హిట్ సినిమా వచ్చేసింది అంటూ ఆనందపడిపోయారు. కానీ తీరా చూస్తే.. బాక్సాఫీసు దగ్గర నిరాశజనకమైన ఫలితాలు వస్తున్నాయి. తొలి నాలుగు రోజుల్లో సినిమాకు రూ.42 కోట్లు మాత్రమే వచ్చిందట. ఫుల్ రన్‌లో కనీసం రూ. 250 కోట్లు వస్తేగానీ కుదరని పరిస్థితిలో తొలి వీకెండ్‌లో అంత తక్కువ అంటే కష్టమే.
సోమవారం నాటికి ‘విక్రమ్ వేద’ రూ.42 కోట్లు మాత్రమే రాబట్టిందట. ఈ సినిమాకు రూ.250 కోట్ల బిజినెస్ జరిగింది. ఇంకో వారం రోజులు థియేటర్లలో ఉన్నా రూ.70 కోట్లు వసూలు చేయొచ్చు. అంతేకానీ బిజినెస్ జరిగిన లెక్కకు దరిదాపులకు కూడా సినిమా వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఈ సినిమా కూడా డిజాస్టర్ లిస్ట్‌లోకి చేరినట్లే.