సౌత్ దర్శకులు బాలీవుడ్ వెళ్లి విజయాలు సాధిస్తుంటే… భారీ వసూళ్లు అందుకుంటున్నారు అక్కడి హీరోలు, నిర్మాతలు. ‘జవాన్’, ‘యానిమల్’ సాధించిన విజయాలు, అందుకున్న వసూళ్లు మీరు చూసే ఉంటారు. అయితే ఏమైందో ఏమో ఒక్కసారిగా ‘యానిమల్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మీద బాలీవుడ్లో వరుస విమర్శలు వస్తున్నాయి. ఆ సినిమాలో హింస, వాడిన భాష ఇబ్బందికరంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు బాలీవుడ్ పెద్దలు. అయితే వాటికి సందీప్ ఇస్తున్న రిప్లైకి మాత్రం వాళ్ల దగ్గర సమాధానలు లేవు.
ప్రముఖ బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ కొద్ది రోజుల క్రితం ‘యానిమల్’ సినిమాలోని సన్నివేశాల్ని పరోక్షంగా విమర్శించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఇలాంటి చిత్రాలు ప్రమాదకరం అంటూ ఘాటైన విమర్శలు చేశారు. దీనిపై సందీప్ తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. ‘మీర్జాపుర్’ సిరీస్లో అభ్యంతరకరమైన పదాలు ఎన్ని ఉన్నాయో అందరికీ తెలుసు. మరి ఆ సిరీస్ను నిర్మించిన ఫరాన్ అక్తర్… జావేద్ కుమారుడే. కాబట్టి ఇలాంటి సలహాలు కొడుక్కే ఇవ్వాలి అని అన్నారు.
ప్రపంచంలో ఉన్న అసభ్య పదాలన్నీ ఆ సిరీస్లో ఉన్నాయి. నేను ఆ సిరీస్ను పూర్తిగా చూడలేదు. ప్రోమోలు, టీజర్లో వచ్చిన సీన్స్ చూస్తేనే చూసే వాంతి వచ్చిన ఫీలింగ్ కలిగింది. మరి అలాంటి సిరీస్ను నిర్మించిన వారిపై జావేద్ మాట్లాడాలి అని సందీప్ కామెంట్ చేశారు. దీంతో సరైన సమాధానం ఇది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ‘యానిమల్’ సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇచ్చిన కంగనా రనౌత్కి కూడా సందీప్ వ్యంగ్య సమాధానం చెప్పారు. ‘నా సినిమాలో ఆమెకు పాత్ర ఉంటే ఇస్తా’ అని అన్నారు. అయితే ఆమె దానిని తిరస్కరించారు.
మరోవైపు సందీప్ వంగా (Sandeep Reddy Vanga) తనపై చేసిన కామెంట్ల గురించి ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ కూడా స్పందించారు. ‘నేను సందీప్ చిత్రాల గురించే మాట్లాడలేదని, కొన్ని సినిమాల్లో స్త్రీలను కించపరిచేలా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని మాత్రమే అన్నానని కవర్ చేశారు. నేను ఆయన సినిమాల గురించే మాట్లాడుతున్నానని ఎందుకు అనుకున్నారో నాకు తెలియదు అన్నారామె. ‘‘ఆమిర్ ఖాన్ నటించిన ‘దిల్’ సినిమాలో ఒక నటిపై దారుణ సన్నివేశాలు ఉంటాయి. అత్యాచారం చేయాలని చూసిన వ్యక్తితోనే ప్రేమలో పడినట్లు చూపించారు. మరి వాటి సంగతేంటి?’ అని సందీప్ కిరణ్రావును అడిగిన విషయం తెలిసిందే.