ఒకప్పుడు టెలివిజన్ ఛానళ్లలో కొత్త సినిమాల ప్రీమియర్లకు విపరీతమైన ఆదరణ ఉండేది. కుటుంబమంతా కలిసి సినిమా చూడడాన్ని ప్రత్యేక అనుభూతిగా భావించేవారు. టిఆర్పి రేటింగ్స్ ద్వారా ఛానల్స్‌కు, హక్కుల రూపంలో నిర్మాతలకు గణనీయమైన ఆదాయం వచ్చేది. కానీ ఓటీటీ రాకతో ఈ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు చాలా సినిమాలు టీవీ ప్రసారం కన్నా ముందే ఓటీటీలో విడుదలవుతున్నాయి. ఈ పరిస్థితిని ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా మళ్లీ మార్చేలా ఉంది.
ఈ సినిమా శాటిలైట్, ఓటీటీ హక్కులను జీ సంస్థ సొంతం చేసుకుంది. కానీ ఆశ్చర్యకరంగా ముందుగా జీ తెలుగు ఛానల్‌లో ప్రీమియర్ చేసి, ఆ తర్వాత జీ5 లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇది చాలా సంవత్సరాల తర్వాత ఓటీటీ కంటే ముందు టెలివిజన్ ప్రీమియర్ ఇస్తున్న భారీ సినిమా. 300 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ మూవీ బుల్లితెరపై వస్తుందనే వార్త ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. థియేటర్లలో భారీ హిట్ సాధించిన సినిమా టీవీలో ప్రసారం అవుతుందంటే ప్రేక్షకులు ఊరికే వదులుకుంటారా?
కుటుంబమంతా కలిసి చూసేలా ఈ ప్రీమియర్ ఒక ఫెస్టివల్‌గా మారే అవకాశముంది. సంక్రాంతికి వస్తున్నాం థియేటర్లలో ఇప్పటికీ డీసెంట్ హోల్డ్‌తో కొనసాగుతుండటంతో, దాని స్మార్ట్ ప్రీమియర్ డేట్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి మూడో వారం లేదా మహాశివరాత్రి సందర్భంగా ప్రసారం చేసే అవకాశముంది. అయితే, ఈ ప్రయోగం మిగిలిన సినిమాలకూ వర్తిస్తుందా? అన్నది మాత్రం సందేహమే.
అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లాంటి డిజిటల్ కంపెనీలకు తమ స్వంత టెలికాస్ట్ ఛానల్స్ లేవు. కాబట్టి ఈ విధానం అన్ని సినిమాలకు సాధ్యమయ్యే అవకాశాలు తక్కువే. కానీ జీ సంస్థ ఈ మోడల్‌ను సక్సెస్ చేస్తే, టీవీ ఛానల్స్ మళ్లీ శాటిలైట్ హక్కులపై దృష్టి పెట్టేలా అవుతాయి. మరి ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఏ మేరకు విజయవంతం అవుతుందో చూడాలి.