సంక్రాంతి సీజన్‌లో ఎన్ని సినిమాలొచ్చినా.. వసూళ్లు ఉంటాయి. ఆ సినిమాలు కాస్త అటు ఇటు ఉన్నా ఫర్వాలేదు.. జనాలు చూసేస్తారు అని అంటుంటారు. ఈ విషయంలో కొద్దిగా డౌట్ ఉన్నవారు కూడా.. ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌ని చూశాక మనుసు మార్చేసుకున్నారు. టాక్ పెద్దగా బాలేకపోయినా కొన్ని సినిమాలు గట్టెక్కేశాయి. ఈ సీజన్ ఇచ్చిన ధైర్యమో ఏమో.. వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్‌కి చాలా సినిమాలు రెడీ అయిపోతున్నాయి. ఈ క్రమంలో కన్‌ఫ్యూజ్ కూడా చేస్తున్నాయి.
సంక్రాంతి సీజన్‌లో బెర్తుల కోసం అప్పుడే సినిమాలు కర్చీఫ్‌లు వేసేస్తున్నాయి. ఇప్పటికే సంక్రాంతికి వస్తాం అని ప్రకటించిన సినిమాలు కాకుండా వేరే సినిమాలు వచ్చి మా సినిమా రిలీజ్ డేట్ ఇదిగో అని చెప్పేస్తున్నాయి. దీంతో కన్‌ఫ్యూజన్ కాస్తా ఫుల్ కన్‌ఫ్యూజన్ అయి కూర్చుంది. మొన్నీ మధ్య శర్వానంద్ తన కొత్త సినిమా ‘జార్జ్ క్రిష్’ ఓపెనింగ్ రోజే జనవరి 14 అని డేట్ చెప్పగా.. ఎప్పటి నుండో షూటింగ్ జరుపుకుంటున్న సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల యేటి గట్టు’ టీమ్ జనవరి 12 అని డేట్ చెప్పింది.
ఇక సంక్రాంతి అనే లైన్ పట్టుకుని కచ్చితంగా సంక్రాంతికే వస్తాం అని సినిమాలు తీసే అనిల్ రావిపూడి ఇప్పడు వెంకటేశ్ – కల్యాణ్ రామ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. దీన్ని సంక్రాంతికే అని చెప్పేశారు. డేట్ ఇంకా చెప్పలేదు అంతే. మరోవైపు దిల్ రాజు కూడా పొంగల్ ఫైట్‌కి రెడీ అయిపోయారు. రవితేజ – శ్రీవిష్ణుతో హసిత్ గోలి ఓ సినిమా చేస్తారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాను ముక్కల పండగని టార్గెట్ చేసి తెరకెక్కిస్తారట.
నాగార్జున తన వందో సినిమాను సంక్రాంతికే తీసుకొస్తారని సమాచారం. డిసెంబరులో అనుకున్నా ఆ డేట్‌ని కొడుక్కి (వృషకర్మ)కి వదిలేసి.. సంక్రాంతికి వద్దాం అనుకుంటున్నారట. త్వరలో క్లారిటీ వస్తుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి కన్‌ఫ్యూజన్‌గా మారింది అని చెప్పొచ్చు. అదేంటి చిరంజీవి – బాబి సినిమా వదిలేశారు అనుకుంటున్నారా? మేనమామ సినిమా ఉందని తెలిసినా సాయి తేజ్ తన సినిమా రిలీజ్ సంక్రాంతికి పెట్టుకున్నారు అంటే.. ఆ మామ రావడంలేదనేగా అర్థం. దీనిపై క్లారిటీ ఆగస్టు 22న వస్తుంది.