ఏ.కె.ఎస్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఆకాష్ కుమార్ ను హీరోగా పరిచయం చేస్తూ ఎన్.నరసింహారావు తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ థ్రిల్లర్ “శరభ”. అశ్వని కుమార్ సహదేవ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో “చిన్నదాన నీకోసం” ఫేమ్ మిస్తీ చక్రవర్తి కథానాయికగా నటిస్తుండగా.. సీనియర్ నటీమణి జయప్రద, నెపోలియన్, నాజర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. భారీ స్థాయిలో సీజీ వర్క్ మరియు వందల మంది జూనియర్ ఆర్టిస్ట్స్, ఫైటర్స్ తో తెరకెక్కించబడిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. జనవరిలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఆశ్వనికుమార్ సహదేవ్ మాట్లాడుతూ.. “అత్యద్భుతమైన కథ-కథానాలతో వి.నరసింహారావు “శరభ” చిత్రాన్ని తెరకెక్కించారు. ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలతోపాటు.. హాలీవుడ్ టెక్నీషియన్స్ చేసిన ప్రోస్తెటిక్ మేకప్, సీజీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. చిరంజీవిగారు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు దిల్ రాజు రిలీజ్ చేసిన టీజర్ కి భారీ స్పందన లభించింది. సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. జనవరిలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం. సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. కోటి గారు సమకూర్చిన బాణీలు, బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంటాయి. అలాగే రమణ సాల్వ కెమెరా వర్క్ ఆడియన్స్ ను విస్మయానికి గురి చేస్తుంది. ఇలా టాప్ టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేసిన “శరభ” చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతినిచ్చే విధంగా ఉండబోతోంది. అలాగే.. ఒక డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించగా ఓ డెబ్యూ హీరో నటించిన “శరభ” హిందీ శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోవడం విశేషం” అన్నారు.