భారతదేశం గర్వించదగ్గ సినిమాటోగ్రాఫర్స్ లో ఒకరైన రాజీవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూడో చిత్రం “సర్వం తాళమయం”. జీవి ప్రకాష్ కుమార్, నెడిముడి వేణు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సంగీత ప్రధాన చిత్రం తమిళంలో విడుదలై ఓ మోస్తరు టాక్ సొంతం చేసుకోగా.. ఇప్పుడు తెలుగు అనువాద చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సంగీత భరిత చిత్రాన్ని మన తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారో చూద్దాం..!!
కథ: పీటర్ (జీవి ప్రకాష్ కుమార్) జంతు చర్మంతో మృదంగాలు తయారు చేసే కుటుంబానికి చెందినవాడు. చిన్నప్పటినుంచి సంగీతం అంటే పిచ్చి ఉన్నప్పటికీ.. వెంబు అయ్యర్ (నెడిముడి వేణు) ఓ సభలో కర్ణాటక సంగీతాన్ని తన మృదంగంతో మ్రోగించిన విధానం చూసి తాను కూడా కర్ణాటక సంగీతంలో మృదంగ విద్వాంసుడవ్వాలనుకుంటాడు. తొలుత తన కులం అందుకు అడ్డొచ్చినా.. వెంబు అయ్యర్ సహకారంతో నేర్చుకోవడం మొదలెడతాడు కానీ.. అనంతరం కారణాంతరాల వలన తన గురువు చేత ఇంటి నుండి బయటకు గెంటబడతాడు.
పీటర్ ను అతడి గురువు ఎందుకని గెంటేశాడు? పీటర్ తన కలలుగన్న కళను సొంతం చేసుకోగలిగాడా? లేదా? అందుకోసం అతడు పడిన తపన ఏంటీ? అనేది “సర్వం తాళమయం” కథాంశం.
నటీనటుల పనితీరు: మృదంగ విద్వాంసుడు కావాలనుకొనే యువకుడిగా జీవి ప్రకాష్ కుమార్ నటన బాగుంది. అసలే మ్యూజిక్ డైరెక్టర్ కావడం, కర్ణాటక సంగీతంపై పట్టు ఉండడంతో సినిమాలో ఎక్కడా నటిస్తున్నాడు అనే భావన కలగదు.. చాలా నేచురల్ గా ఉంటుంది పెర్ఫార్మెన్స్. “భారతీయుడు” ఫేమ్ నెడిముడి వేణు నిష్టగల సంగీత విధ్వాంసుడిగా పాత్రకు పెద్దరికం తీసుకురావడమే కాక ప్రాణం పోశారు.
అపర్ణ బాలమురళి హీరోయిన్ లా కాక ఒక నటిగా కనిపించింది. ఆమె పాత్ర స్వభావం, నటన అన్నీ సహజంగా ఉన్నాయి. తండ్రి పాత్రలో కుమార్ వేల్, నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ లో “ప్రేమదేశం” ఫేమ్ వినీత్ ఇలా ప్రతి ఒక్కరూ సినిమాకి ప్రాణం పెట్టారు.
సాంకేతికవర్గం పనితీరు: రెహమాన్ సంగీతం ఈ చిత్రానికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. కనీసం కర్ణాటక సంగీతంతో పరిచయం లేనివారు కూడా ఆ బాణీలకు తాళం కొడుతుంటారు. చాలా సన్నివేశాల్లో ఎమోషన్స్ సరిగా పండకపోయినా రెహమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం వేరే లెవల్లో ఉంటుంది. రవి యాదవ్ సినిమాటోగ్రఫీ మనల్ని సంగీత ప్రపంచలో ఓలలాడిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే టైటిల్ సాంగ్ చూస్తున్నంతసేపూ ప్రకృతి అందాన్ని వెండితెర మీదే మనం కూడా ఆస్వాదిస్తున్నట్లు ఉంటుంది. అదే రవి యాదవ్ చేసిన మ్యాజిక్.
సాధారణంగా రాజీవ్ మీనన్ సినిమాల్లో నటీనటుల క్యారెక్టరైజేషన్స్ చాలా లోతుగా ఉంటాయి. కానీ ఈ సినిమాలో అది మిస్ అయ్యింది. సినిమా ఫస్టాఫ్ చూస్తున్నప్పుడు ఎంత గొప్పగా ఉంది అనుకుంటాం. కానీ సెకండాఫ్ కి వచ్చేసరికి సరైన స్క్రీన్ ప్లే లేకపోవడంతో ఢీలాపడిపోతుంది సినిమా. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం సెకండాఫ్ లో యాడ్ చేసిన రియాలిటీ షో ఎపిసోడ్స్ అప్పటివరకూ సహజంగా సాగుతున్న కథనానికి ఆర్టిఫీషియల్ నెస్ ను యాడ్ చేస్తుంది. రాజీవ్ మీనన్ ఆ కమర్షియల్ జస్టీఫికేషన్ కోసం ప్రాకులాడకుండా ఉండి ఉంటే.. ఈ సినిమా మరో “శంకరాభరణం” అయ్యుండేది. కానీ.. ఇప్పుడు ఓ మోస్తరు సినిమాగా మిగిలిపోయింది.
విశ్లేషణ: సంగీతాన్ని అభిమానించే ప్రేక్షకులు తప్పకుండా చూడదగ్గ చిత్రం “సర్వం తాళమయం”. సెకండాఫ్ కూడా బాగుండి ఉంటే నేషనల్ అవార్డ్ వచ్చి ఉండేది.
రేటింగ్: 2.5/5