Saripodhaa Sanivaaram Review in Telugu: సరిపోదా శనివారం సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • నాని (Hero)
  • ప్రియాంక అరుల్ మోహన్ (Heroine)
  • ఎస్.జె.సూర్య , అదితి బాలన్ , సాయి కుమార్, శుభలేఖ సుధాకర్ , అజయ్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్ (Cast)
  • వివేక్ ఆత్రేయ (Director)
  • డి.వి.వి.దానయ్య - కళ్యాణ్ దాసరి (Producer)
  • జేక్స్ బిజోయ్ (Music)
  • మురళి.జి (Cinematography)
  • Release Date : ఆగస్టు 29, 2024

థియేటర్లలో సరిగా ఆడకపోయినా.. సోషల్ మీడియాలో బ్లాక్ బస్టర్ అయిన చిత్రం “అంటే సుందరానికి” (Ante Sundaraniki). ఆ సినిమాతో నానికి (Nani) కమర్షియల్ హిట్ ఇవ్వలేకపోయాననే వెలితిని తీర్చుకొనేందుకు వివేక్ ఆత్రేయ (Vivek Athreya) తన పంథాకు భిన్నంగా తెరకెక్కించిన మాస్ యాక్షన్ డ్రామా “సరిపోదా శనివారం” (Saripodhaa Sanivaaram) . ఎస్.జె.సూర్య (SJ Suryah) ప్రతినాయక పాత్రలో నటించిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. మరి వివేక్-నాని కాంబినేషన్ రెండో ప్రయత్నంలోనైనా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగలిగారో లేదో చూద్దాం ..!!

Saripodhaa Sanivaaram Review

కథ: సూర్య (నాని) కోపమొస్తే భగభగ మండుతూ.. కోపాగ్నితో లేనిపోనీ సమస్యలు ఇంటి దాకా తీసుకొస్తుంటాడు. అయితే.. తల్లి (అమ్మ అభిరామి (Abhirami) మాట మేరకు శనివారం మాత్రమే కోపం ప్రదర్శిస్తుంటాడు. అలా సూర్య శనివారం రోజున సి.ఐ దయానంద (ఎస్.జె.సూర్య) మీద కోపం తీర్చుకోవడం అనేది సోకులపాలెం వాసులకి ఒక విధంగా వరం, మరో విధంగా శాపంగా మారుతుంది.

అసలు సోకులపాలెం మీద దయానంద్ కి ఎందుకంత కోపం, దయానంద్ భయం నుండి సోకులపాలెం వాసులు ఎలా బయటపడ్డారు. అందుకు సూర్య కోపం సోకులపాలెం వాసులకు ఏ విధంగా ధైర్యాన్నిచ్చింది? అనేది తెలియాలంటే “సరిపోదా శనివారం” చూడాల్సిందే.

నటీనటుల పనితీరు: ఈ సినిమాలో ఎస్.జె.సూర్య విలన్ రోల్ ప్లే ఎంత కీలకం అంటే.. ఒకవేళ సూర్య ఆ స్థాయిలో విలనిజం పండించకపోయి ఉంటే సినిమాలో ఎమోషన్ అస్సలు వర్కవుటయ్యేది కాదు. నరకాసరుడి స్థాయి రాక్షసుడిగా ఎస్.జె.సూర్య వీర లెవల్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. సెకండాఫ్ లో వచ్చే సూర్య-నాని కాంబినేషన్ సీన్స్ లో నానీని ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే సూర్య డైలాగ్స్, హావభావాలు ప్రేక్షకులు ఆయన నుండి ముఖం తిప్పుకోనివ్వకుండా చేశాయి.

నాని ఈ సినిమాలో ఒకరకంగా అండర్ ప్లే చేశాడు. రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న యువకుడిగా నాని నటన సహజంగా ఉంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో నాని మరోసారి అద్భుతంగా అలరించాడు. సూర్య ముందు కొన్ని సన్నివేశాల్లో తేలిపోయినా.. కొన్ని సన్నివేశాల్లో మాత్రం తన బిరుదుకు న్యాయం చేశాడు.

సాయికుమార్ (Sai Kumar)కి చాన్నాళ్ల తర్వాత ఒక మంచి పాత్ర లభించింది. హీరో పాత్రకి ఎక్కడికక్కడ ఎలివేషన్ ఇస్తూనే, ఓ సగటు తండ్రిగా ఒదిగిపోయాడు. అదితి బాలన్ కి (Aditi Balan) ఎక్కువగా డైలాగ్స్ లేకపోయినా ఆమె స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచింది. ప్రియాంక మోహన్ ఎప్పట్లానే నటించడానికి ప్రయత్నించి.. క్యూట్ లుక్స్ తో కవర్ చేసింది. మురళీశర్మ (Murali Sharma ) , అజయ్ ఘోష్ (Ajay Ghosh) , అజయ్ (Ajay) తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ (Jakes Bejoy) ఈ సినిమాకి మెయిన్ హీరో. సన్నివేశంలోని ఎమోషన్ ను అత్యద్భుతంగా ఎలివేట్ చేశాడు. ముఖ్యంగా హీరో & విలన్ తలపడే సన్నివేశాలకు జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం వేరే లెవల్లో ఉంది. ఈ సినిమా తర్వాత జేక్స్ బిజోయ్ తెలుగులో యమ బిజీ అయిపోతాడు. మురళీ.జి (Murali G) సినిమాటోగ్రఫీ సినిమాకి మరో ఎస్సెట్. హీరో మూడ్ కి తగ్గట్లుగా కోపంగా ఉన్నప్పుడు రెడ్ లైటింగ్ & మిగతా సమయంలో సింపుల్ లైటింగ్ తో వేరియేషన్ చూపించి, ఆడియన్స్ ను మొదటి నుండి బాగా ప్రిపేర్ చేశాడు. యాక్షన్ బ్లాక్స్ ను పిక్చరైజ్ చేసిన విధానం కూడా బాగుంది. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ విషయంలో నిర్మాణ సంస్థ ఎక్కడా రాజీపడలేదు.

క్లాస్ సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరించలేదన్న కసి వల్లనో లేక తాను మాస్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఆడియన్స్ కూ రుచి చూపించడం కోసం తెలియదు కానీ.. వివేక్ ఆత్రేయ తన మార్క్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించిన “సరిపోదా శనివారం”తో తన సత్తాను ఘనంగానే చాటుకున్నాడు. ఒక దర్శకుడిగా కంటే రచయితగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడని చెప్పాలి. ముఖ్యంగా వివేక్ ఆత్రేయకు తెలుగు భాష మీద ఉండే అభిమానం గురించి మాట్లాడుకోవాలి, సినిమా టైటిల్స్ మొదలుకొని సినిమాలో అధ్యాయాలుగా పేర్కొనే సందర్భాలను కూడా “మొదలు, మలుపు, పీటముడి, ఆటవిడుపు, ముగింపు” అంటూ స్పష్టమైన, స్వచ్ఛమైన తెలుగులో టైటిల్ కార్డ్స్ పడుతుంటే చూడ్డానికి ఎంత హాయిగా ఉంటుందో.

అలాగే.. నాని-ఎస్.జె.సూర్య కాంబినేషన్ సీన్స్ ను చాలా తెలివిగా రాసుకున్నాడు. అయితే.. అప్పటివరకు చాలా బిగుతుగా రాసుకున్న చిక్కుముడులను పేలవంగా విప్పేసిన విధానం మాత్రం అలరించలేకపోయింది. ఎస్.జె.సూర్య & సోకులపాలెం కనెక్షన్ ను ఎస్టాబ్లిష్ చేయడం కోసం రాసుకున్న సన్నివేశాలు ట్రిమ్ చేసి.. ఆ చిక్కుముడులు వీడే సన్నివేశాన్ని ఇంకాస్త డీటెయిల్డ్ గా రాసుకొని ఉంటే బాగుండేది. ఇక తన రాత మీద విపరీతమైన అభిమానంతో మునుపటిలానే.. నిడివి పెంచుకుంటూ వెళ్లిపోయాడు వివేక్ ఆత్రేయ. పెద్దగా లేయర్స్ లేని ఒక మాస్ సినిమాకు నిజానికి ఇంత లెంగ్త్ అవసరం లేదు. ఆ లెంగ్త్ కారణంగా ఆసక్తికరంగా సాగాల్సిన సినిమా బాగా సాగింది. మరీ ముఖ్యంగా.. “ముగింపు” అనే అధ్యాయాన్ని సాయికుమార్ క్యారెక్టర్ తో సాగదీసిన విధానం మాత్రం ఓపికను పరీక్షిస్తుంది.

ఈ నిడివి & పేలవమైన ముగింపును పక్కన పెడితే.. వివేక్ ఆత్రేయ స్థాయి స్క్రీన్ ప్లే & రేటింగ్ తో మ్యాజిక్ చేశాడనే చెప్పాలి. అయితే.. ముందు చెప్పినట్లుగా వివేక్ ఆత్రేయ దర్శకుడిగా కంటే రచయితగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు.

విశ్లేషణ: “అంటే సుందరానికి”తో వివేక్ ఆత్రేయ హిట్ కొట్టలేకపోయాడని ఆయనకంటే ఎక్కువగా బాధపడిన అతడి అభిమానుల కోరికను “సరిపోదా శనివారం”తో నెరవేర్చాడు. కాకపోతే.. తన వీక్ పాయింట్ అయిన లాంగ్ లెంగ్త్ తో మాత్రం కాస్త ఇబ్బందిపెట్టాడు. ఎస్.జె.సూర్య పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్, జేక్స్ బిజోయ్ పవర్ పంపింగ్ బీజియం, నాని నేచురల్ యాక్టింగ్ & వివేక్ ఆత్రేయ రైటింగ్ కోసం ఈ చిత్రాన్ని కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిందే.

ఫోకస్ పాయింట్: హిట్టు కొట్టితివయ్యా వివేక్ ఆత్రేయ!

రేటింగ్: 3/5

Click Here to Read in ENGLISH

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus