సరైనోడు

కథానాయకుడి స్టామినాను తనదైన శైలిలో ఆకశమంత ఎత్తుకు తీసుకెళ్లగలిగే సత్తా ఉన్న దర్శకుడు బోయపాటి శ్రీను. ఎంతటి పవర్ ఫుల్ క్యారెక్టర్ అయినా.. తనదైన స్టైల్ మరియు మేనరిజమ్స్ తో క్లాస్, మాస్ అన్న బేధం లేకుండా అందర్నీ మెప్పించగల కథానాయకుడు అల్లు అర్జున్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం “సరైనోడు”. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రంలో బన్నీ సరసన రకుల్, కేథరీన్ లు కథానాయికలుగా నటించగా.. తమిళ యువ కథానాయకుడు ఆది పెనిశెట్టి ప్రతినాయకుడిగా నటించాడు. మరి “సరైనోడు” ప్రేక్షకులను ఏమేరకు మెప్పించగలిగాడు? బోయపాటి మాస్ కి అల్లు అర్జున్ క్లాస్ ఇమేజ్ కి ఎంతవరకూ సింక్ అయ్యింది అనే విషయాలు వెండితెరపై “సరైనోడ్ని” చూసి తెలుసుకోవాల్సిందే..!!

కథ:
వైరం ధనుష్ (ఆది పెనిశెట్టి) రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక్కగానొక్క కొడుకు. దాంతో తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అడ్డమైన పనులూ చేస్తుంటాడు. పొగరు, పొలిటికల్ పవర్ తోపాటు కండబలం కూడా సమపాళ్లలో ఉన్నవాడు. గణ (అల్లు అర్జున్) ఆర్మీలో అత్యుత్తమ స్థానంలో విధులు నిర్వర్తిస్తూ.. బోర్డర్ లో కంటే బయట ప్రపంచంలోనే తప్పులు ఎక్కువగా ఉన్నాయని భావించి.. ఉద్యోగం వదిలేసి హైదరాబాద్ వచ్చేస్తాడు. ఒకానొక సందర్భంలో.. ఈ ఇద్దరూ తలపడాల్సి వస్తుంది. పొలిటికల్ పవర్ తోపాటు జనబలం కూడా దండిగా ఉన్న ధనుష్ ను గణ ఎలా ఎదుర్కొన్నాడు? చివరికి ఎవరు విజయం సాధించారు? అనేది “సరైనోడు” సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు:
గణ పాత్రలో అల్లు అర్జున్ “టీజర్”లో చెప్పినట్లుగా “మాస్.. ఊర మాస్” అనే స్థాయిలోనే కనిపించాడు. యాక్షన్స్ సీన్స్ లో అతడి మేనరిజమ్స్ మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకొంటాయి. తనను తండ్రిలా పెంచిన బాబాయ్ ను కాపాడుకొనే పతాక సన్నివేశంలో అల్లు అర్జున్ హావభావాలు అద్భుతంగా పలికించాడు. అయితే.. ఎప్పుడూ డ్యాన్సుల పరంగా తన అభిమానులను విశేషంగా అలరించే అల్లు అర్జున్.. ఈ సినిమాలో మాత్రం డ్యాన్స్ పరంగా ఆకట్టుకోలేకపోయాడు. వైరం ధనుష్ అనే శక్తివంతమైన ప్రతినాయకు పాత్రను ఆది పోషించిన తీరు ప్రశంసనీయం. కంటి చూపు మొదలుకొని నిల్చోనే విధానం వరకూ ప్రతి విషయంలోనూ విలనిజాన్ని వీరలెవల్లో పండించాడు. అల్లు అర్జున్ బాబాయ్ గా, ఒక సాధారణ లాయర్ గా శ్రీకాంత్ తనదైన శైలిలో చక్కగా నటించాడు. అయితే.. శ్రీకాంత్ లాంటి ఒక సీనియర్ హీరో మరియు అద్భుతమైన నటుడ్ని కేవలం హీరో పక్కన నిల్చోబెట్టి సినిమా మొత్తానికి నాలుగైదు డైలాగులు మాత్రమే ఇవ్వడం బాధాకరం.

ఇక హీరోయిన్లుగా నటించిన రకుల్ మరియు కేథరీన్ లలో.. సెకండ్ హీరోయిన్ అయిన కేథరీన్ కే “ఎమ్మెల్యే”గా నిడివి ఎక్కువ ఉన్న పాత్ర లభించడం గమనార్హం. ఇక రకుల్ కేవలం మూడు పాటలకు, మూడు సీన్లకు మాత్రమే పరిమితమైంది. సాయికుమార్, జయప్రకాష్ వంటి సీనియర్ ఆర్టిస్టులు దొరికిన అతికొద్ది సన్నివేశాల్లోనూ తమదైన శైలిలో పాత్రకు ప్రాణం పోసారు.

సాంకేతికవర్గం పనితీరు:
తమన్ అందించిన పాటలు ఓ మోస్తరుగా ఆకట్టుకొన్నప్పటికీ.. నేపధ్య సంగీతం మాత్రం సన్నివేశంలో ప్రేక్షకుడు లీనమయ్యేలా చేయలేకపోయింది. ఎమోషనల్ సీన్ కు కూడా రెట్రో మిక్స్, ఫ్యూజన్ మిక్స్ తో బ్యాగ్రౌండ్ స్కోర్ అందించి తమన్ చేసిన ప్రయోగం బెడిసిగొట్టిందనే చెప్పాలి. రిషి పంజాబీ కెమెరా పనితనం ఫైట్స్ సీన్స్ వరకూ బాగానే ఉంది. ముఖ్యంగా స్లోమోషన్ షాట్స్ ఆడియన్స్ ను థ్రిల్ చేస్తాయి.
అయితే.. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి.. దాదాపు 50 గంటలు ప్రయాణం చేసి ఉత్తర అమెరికాలోని “బొలివియా” అనే సుదూర సుందర ప్రాంతంలో చిత్రీకరించిన యుగళ గీతంలో.. బొలివియా లోని అందాల్ని చూపించడం మానేసి.. హీరోహీరోయిన్ల క్లోజప్ షాట్స్ షూట్ చేయడంలో అర్ధం ఏంటో.. దర్శకనిర్మాతలకే తెలియాలి.

బోయపాటి ఆస్థాన మాటల రచయిత అయిన ఎం.రత్నం “సరైనోడు” సినిమాకి అందించిన సంభాషణలు.. ఆయన మునుపటి సినిమాలంత శక్తివంతంగా లేవు. గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్ లోనూ అగుపిస్తాయి. ఏ ఒక్క సన్నివేశంలోనూ రాజీపడకుండా క్వాలిటీ పిక్చర్ ను ఆడియన్స్ కు అందివ్వడంలో నిర్మాత అల్లు అరవింద్ వందశాతం విజయం సాధించారు.

కథ-కథనం-దర్శకత్వం:
హీరోను అత్యంత శక్తివంతంగా చూపించాలి, అందుకోసం విలన్ ను మరింత పవర్ ఫుల్ గా ప్రొజెక్ట్ చేయాలన్న దర్శకుడు బోయపాటి తపన ప్రతి సన్నివేశంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. కానీ.. కథానాయకుడు-ప్రతినాయకుడు ఎంత బలవంతులైనా కథలో పస లేకపోతే వారి మధ్య వైరం ప్రేక్షకుల్ని అలరించలేదన్న చిన్న లాజిక్ ను “లెజెండ్” లాంటి సూపర్ హిట్ తర్వాత బోయపాటి మరవడం ఆడియన్స్ ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎప్పట్లాగే.. “సరైనోడు” సినిమాలోనూ కామెడీ పండించడంలో విఫలమయ్యాడు బోయపాటి. యాక్షన్స్ సీన్స్ ను బాగా ప్లాన్ చేసుకొన్నప్పటికీ.. యాక్షన్ సీన్స్ కు ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఎమోషన్ ను క్రియేట్ చేయడంలోనూ సత్తా చాటలేకపోయాడు. బోయపాటి మొదటి సినిమా “భద్ర” మొదలుకొని.. ఆయన ఇప్పటివరకూ తీసిన చాలా సినిమాల్లోని సీన్లు “సరైనోడు” సినిమాలో అక్కడక్కడా కనిపిస్తుంటాయి.

ఎనాలిసిస్:
బోయపాటి ఊర మాస్ దర్శకుడు, అల్లు అర్జున్ యమ స్టైలిష్ కథానాయకుడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే అందరూ “సరైనోడు” మంచి స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని భావిస్తారు. విడుదలైన టీజర్ మరియు ట్రైలర్ కూడా ఆడియన్స్ కు అదే అనుభూతిని కలిగించాయి. కానీ.. సినిమా మాత్రం బోయపాటి పంధాలోనే సాగుతుంది. అయితే.. బోయపాటి శైలి ఎమోషన్స్ ఉండవు. అలాగని బన్నీ శైలి స్టైల్ కూడా ఉండదు. ఆ కారణంగా.. “సరైనోడు” కేవలం మాస్ ఆడియన్స్ కు మాత్రమే పరిమితమైంది. కథలో క్లారిటీ లేకపోవడం, పాత్రలు, పాత్రధారులు శక్తివంతంగా ఉన్నప్పటికీ.. సన్నివేశంలో సరైన ఎమోషన్ లేకపోవడం వంటి కారణాల రిత్యా “సరైనోడు” బ్లాక్ బస్టర్ హిట్ సాధించే సదవకాశాన్ని చేజార్చుకోవాల్సి వచ్చింది.

మొత్తానికి…
ఆశించిన స్థాయిలో అలరించలేని “సరైనోడు”

రేటింగ్ : 3/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus