“96” సినిమాతో యావత్ సినిమా అభిమానుల్ని కట్టిపడేసిన సి.ప్రేమ్ కుమార్ (C. Prem Kumar) ఆరేళ్ల విరామం అనంతరం తెరకెక్కించిన చిత్రం “మెయ్యళగన్” . కార్తి (Karthi) -అరవిందస్వామి (Arvind Swamy) కీలకపాత్రధారులుగా రూపొందిన ఈ చిత్రానికి సూర్య (Suriya) -జ్యోతిక (Jyothika) నిర్మాతలు. సినిమా టీజర్ & ట్రైలర్ సినిమా మీద మంచి అంచనాలు రేకెత్తించాయి. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం..!!
కథ: తన తండ్రివైపు బంధువుల మధ్య వచ్చిన ఆస్తి తగాదాల కారణంగా పుట్టిపెరిగిన ఇల్లు వదులుకోవాల్సి వచ్చి సిటీకి వెళ్లిపోతాడు సత్యం (అరవిందస్వామి). బాబాయ్ కూతురు పెళ్లి కోసం చాలా ఏళ్ల తర్వాత ఊరికి వస్తాడు. అక్కడ పరిచయమవుతాడు దూరపు బంధువు (కార్తీ) . చాలా సరదాగా కలిసిపోయి బోలెడన్ని కబుర్లు చెబుతూ సత్యం ఎక్కాల్సిన బస్ మిస్ చేయించి మరీ ఇంటికి తీసుకుని వెళ్తాడు.
ఊరు నుండి మళ్లీ సిటీకి వచ్చేసిన సత్యంకి, ఆ బంధువు ఎవరు? అనే ప్రశ్న మాత్రం మనసులోనే మిగిలిపోతుంది. అసలు సత్యంకి ఈ బంధువు ఎలాంటి చట్టం? అతని పేరేమిటి? అతడి ద్వారా సత్యం తెలుసుకున్న జీవిత సత్యం ఏమిటి? వంటి ప్రశ్నలకు హృద్యంగా చెప్పిన సమాధానమే “సత్యం సుందరం” (Sathyam Sundaram) చిత్రం.
నటీనటుల పనితీరు: నటుడిగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అరవిందస్వామికి అందరూ ఎక్కువగా విలన్ రోల్స్ ఆఫర్ చేశారు కానీ.. ఒక నటుడిగా అతడి పొటెన్షియల్ అర్థం చేసుకొని అతడితో సత్యం అనే పాత్రను పోషింపజేసినందుకు దర్శకుడు సి.ప్రేమ్ కుమార్ ను మెచ్చుకోవాలి. సత్యం అనే పాత్రలో అరవిందస్వామి ఎంత చక్కగా ఇమిడిపోయారంటే.. ఆ పాత్ర భావంతో మనమూ ట్రావెల్ చేస్తాం. ఆ పాత్ర పడే బాధ, యాతన, ఇబ్బంది వంటి అన్ని ఫీలింగ్స్ ను మనం కూడా అనుభవిస్తాం.
కార్తీ తన అమాయకత్వంతో మరోసారి కట్టిపడేశాడు. నిజానికి కార్తీ ఈ తరహా పాత్రలు ఇదివరకు కూడా చేశాడు. అయితే.. ఈ సినిమాలో ఓ వ్యక్తిపై అపరిమితమైన ప్రేమను చూపించే సగటు పల్లెటూరి యువకుడిగా కార్తీ నటించిన విధానం ప్రశంసనీయం. కార్తీ కెరీర్ లో ఈ పాత్ర కచ్చితంగా ఓ మైలురాయిలా నిలుస్తుంది.
తమిళ నటి దేవదర్శినిని మనం ఇప్పటివరకు కామెడీ రోల్స్ లేదా సపోర్టింగ్ రోల్స్ లో చూసి ఉంటాం. ఈ సినిమాలో అరవిందస్వామి భార్య పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు చూస్తే ఒక మంచి టాలెంట్ కు సరైన అవకాశాలు ఇవ్వకుండా మొనాటనీ వచ్చేలా చేస్తున్నామని దర్శకులకు అర్థమవుతుంది. అదే విధంగా శ్రీదివ్య (Sri Divya) , రాజ్ కిరణ్, జయప్రకాశ్ ల పాత్రలు చిన్నవే అయినా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు సి.ప్రేమ్ కుమార్ సినిమాల్లో సహజత్వం తొణికిసలాడుతుంది. అతడు రాసుకొనే సన్నివేశాల్లో, ఆ సన్నివేశాలను కంపోజ్ చేసే తీరులో ప్రేక్షకులు లీనమైపోతారు. ఈ సినిమాలో చాన్నాళ్ల తర్వాత చెల్లెల్ని రిసెప్షన్ ఫంక్షన్ లో కలిసిన అన్న స్వయంగా ఆమె కాలికి పట్టీలు పెట్టే సీన్ చూస్తుంటే తెలియకుండానే కళ్ళు చెమ్మగిల్లాయి. ఈ తరహా సన్నివేశాలు, సంభాషణలు సినిమాలో ఎన్నెన్నో.
మనిషి సుఖంగా బ్రతకడానికి డబ్బు, పేరుతోపాటు మన మంచి కోరుకునే ఒక మనిషి అవసరం ఎంత ఉంది అనేది “సత్యం సుందరం” (Sathyam Sundaram) మెయిన్ థీమ్ అని చెప్పొచ్చు. ఆ విషయాన్ని ఎంతో అందంగా పెరుగు మీద మీగడను వేరు చేసినంత సుతారంగా వివరించిన విధానానికి ఎవ్వరైనా జోహార్లు చెప్పాల్సిందే. సినిమా చూస్తున్న ప్రేక్షకులు తమ మనసు పొరల్లో ఏర్పడ్డ చిన్న సంతృప్తానందంతో థియేటర్లు వీడడం ఖాయం.
తెలుగు సంభాషణలు రాసిన రాకేందుమౌళిని ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. ఓ స్వచ్ఛమైన తమిళ సినిమాను.. అంతే స్వచ్ఛమైన తెలుగు సినిమాగా మార్చడంలో అతడి సంభాషణలు కీలకపాత్ర పోషించాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మహేందిరన్ జయరాజు (Mahendran Jayaraju) సినిమాటోగ్రఫీ వర్క్ ఒక సినిమా చూస్తున్న భావన కాకుండా ఓక లైవ్ డాక్యుమెంటరీ చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. ముఖ్యంగా ప్రకృతిని ఆయన తన కెమెరాలో బంధించిన విధానం భలే ముచ్చటుగా ఉంది.
గోవింద్ వసంత ఈ సినిమాకి సెకండ్ హీరో అని చెప్పాలి. ఒక సన్నివేశంలోని ఎమోషన్ ను అర్థం చేసుకొని దానికి తగ్గ స్థాయి సంగీతాన్ని సమకూర్చి ప్రేక్షకుడ్ని సదరు సన్నివేశంలో, ఎమోషన్ లో ఇన్వాల్వ్ చేయడం గోవింద్ వసంత స్పెషాలిటీ.ఆ పాటలు వినిపిస్తున్నప్పుడల్లా మనసు ఒక్కోసారి బరువెక్కుతుంది, కొన్నిసార్లు తేలికపడుతుంది. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ సినిమాకు ఆడియన్స్ కనెక్ట్ అవ్వడంలో కీలకపాత్ర పోషించాయి. ముఖ్యంగా 90ల నాటి సైకిల్, స్కూటీ, ఇళ్లను తెరపై చక్కగా చూపించారు.
విశ్లేషణ: కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు మానసిక అలసట దూరమవుతుంది. జీవితంలో మర్చిపోకపోయినా గుర్తురాని అనుభవాల్ని, మనసు లోతుల్లో పాతుకుపోయిన అనుభూతుల్ని తవ్వి తీసిన సినిమా “సత్యం సుందరం”. అరెరే అప్పుడే అయిపోయిందా, ఇంకొంచెంసేపు అలానే తెరపై అరవిందస్వామి-కార్తీల సంభాషణలు కొనసాగితే బాగుండు కదా అనిపిస్తుంది. ఒక మంచి సినిమా చూసామన్న సంతృప్తితో థియేటర్ నుండి ప్రేక్షకులు మనసంతా ఆనందాన్ని నింపుకొని ఇంటికెళతారు.
అయితే.. తమిళంలో సింక్ సౌండ్ తో తెరకెక్కించిన ఈ చిత్రానికి తెలుగు డబ్బింగ్ లోనూ సింక్ సౌండ్ ఎఫెక్ట్ కంటిన్యూ చేద్దామని చేసిన ప్రయత్నం కాస్త బెడిసికొట్టింది. కార్తీ డబ్బింగ్ ఒక్కో సన్నివేశంలో ఒక్కోలా ఉంటుంది. ఈ చిన్నపాటి మైనస్ తప్పితే “సత్యం సుందరం” (Sathyam Sundaram) ఒక శ్రావ్యమైన సినిమా చూసిన అనుభూతిని మిగుల్చుతుంది. మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఈ సినిమాను కచ్చితంగా థియేటర్లలో చూడండి.