సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

  • February 7, 2020 / 08:44 PM IST

నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నందు కథానాయకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకొనే ప్రయత్నంలో నటించిన తాజా చిత్రం “సవారి”. “బంధం రేగెడ్” అనే షార్ట్ ఫిలిమ్ ద్వారా మంచి పేరు సంపాదించుకున్న సాహిత్ దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. మరి సినిమా ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: హైద్రాబాద్ మహానగరంలో సాధారణ జీవితాన్ని సాగిస్తూ.. వంశపారంపర్య వృత్తి అయిన గుర్రపు సవారిని జీవనాధారంగా బ్రతుకుతుంటాడు రాజు (నందు). తన జీవన ఉపాధి మాత్రమే తాను సొంత తమ్ముడిలా చూసుకునే గుర్రం బాద్షాకు ఆపరేషన్ కోసం తాను తినకుండా సైతం డబ్బులు దాస్తుంటాడు. తన గుర్రంతోపాటు భాగీ (ప్రియాంక)ని కూడా ప్రాణంగా ప్రేమిస్తాడు.

కట్ చేస్తే.. బాద్షా కనిపించకుండాపోతుంది & భాగీతో పెళ్లి సమస్యల్లో పడుతుంది. అందుకు కారణం ఏమిటి? చివరికి రాజుకి దొరికిన సమాధానం ఏమిటి? అనేది “సవారి” కథాంశం.

నటీనటుల పనితీరు: నందు కెరీర్ లో ఇప్పటికి చాలా సినిమాల్లో నటించాడు, చాలా డిఫరెంట్ రోల్స్ ప్లే చేశాడు. కానీ.. “సవారి” చిత్రంలో పోషించిన సగటు తెలంగాణ యువకుడి పాత్ర నందు కెరీర్ లో ఓ చెరగని గుర్తుగా నిలిచిపోతుంది. బోల్డ్ & సెన్సిబుల్ రోల్లో నందు నటన సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. నందు చెప్పే కొన్ని మాటలు, నవజీవన విధానం గురించి ప్రతిఒక్కరూ ఆలోచించేలా చేస్తాయి.

భాగీ పాత్రలో ప్రియాంక సహజంగా కనిపించింది. తెలుగమ్మాయి కావడంతో సంభాషణాల్లో క్లారిటీతోపాటు.. క్యారెక్టరైజేషన్ జనాలకి కనెక్ట్ అవుతుంది. నవతరం అమ్మాయిలు ఆమె పాత్రకు బాగా కనెక్ట్ అవుతారు. శ్రీకాంత్ రెడ్డి, శివకుమార్ లు నటనతో ఆకట్టుకున్నారు. వీళ్ళు పండించే కామెడీ ప్రేక్షకుల్ని అలరిస్తుంది.

సాంకేతికవర్గం పనితీరు: శేఖర్ చంద్ర సంగీతం ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. “నీ కన్నుల, ఉండిపోవా” పాటలు వినడానికి.. చూడడానికి కూడా బాగున్నాయి. మొనీష్ సినిమాటోగ్రఫీ వర్క్ సోసోగా ఉంది. సినిమాటిక్ ఫీల్ తీసుకురాలేకపోయాడు. సాహిత్ మోత్కూరి రాసుకున్న కథ, స్క్రీన్ ప్లే బాగుంది. అయితే.. ఎమోషన్స్ ను మాత్రం సరిగా పండించలేకపోయాడు. ఆ మైనస్ పాయింట్ ను కామెడీతో కవర్ చేశాడు. ముఖ్యంగా గుర్రం క్యారెక్టర్ కు రాహుల్ రామకృష్ణతో వాయిస్ ఓవర్ చెప్పించి ఆడియన్స్ గుర్రం పాత్రతో కూడా ఇన్వాల్వ్ అయ్యేలా జాగ్రత్త తీసుకున్నాడు. నందు, ప్రియాంక పాత్రలను డిజైన్ చేసిన విధానం కూడా బాగుంది. సీరియస్ సీన్స్ లో కూడా సెన్సిబిలిటీస్ తో కూడిన కామెడీ పండించడం దర్శకుడి ప్రతిభను ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది. సాహిత్ కి దర్శకుడిగా మంచి భవిష్యత్ ఉంది. అయితే.. దర్శకుడిగా కథ-కథనంతోపాటు కథలోని పాత్రలు మరియు సందర్భాలు ప్రేక్షకులకి ఎంతవరకూ కనెక్ట్ అవుతాయి, వాళ్ళు ఎంతవరకు రిలేట్ అవ్వగలరు వంటి విషయాల్లో కూడా సాహిత్ జాగ్రత్త పడితే ఉజ్వలమైన భవిష్యత్ అతడి సొంతం.

విశ్లేషణ: సెన్సిబిలిటీస్ కి సహజత్వం జోడించి.. సందర్భాల్లో ఆరోగ్యకరమైన హాస్యం జొప్పించి.. నటీనటుల నుండి సహజమైన నటన రాబట్టిన “సవారి” కచ్చితంగా ఒకసారి థియేటర్లో చూడాల్సిన చిత్రం. హీరోగా విజయాన్ని అందుకోవాలనే నందు ప్రయత్నం మొత్తానికి ఫలించిందనే చెప్పాలి.

రేటింగ్: 2.75/5

Click Here To Read English Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus