పావని గంగిరెడ్డి, జోర్దార్ సుజాత, దేవయాని శర్మ (Heroine)
NA (Cast)
అరుణ్ కొత్తపల్లి (Director)
మహి వి.రాఘవ-చిన్న వాసుదేవ్ రెడ్డి (Producer)
అజయ్ అరసాడ (Music)
ఎస్.వి.విశ్వేశ్వర్ (Cinematography)
Release Date : మార్చి 15, 2024
తెలుగు ఓటీటీ ప్రపంచం మొత్తం అవసరం లేని శృంగారం, అత్యంత నీచమైన బూతులతో నిండిపోతున్న తరుణంలో.. ఆరోగ్యకరమైన హాస్యంతో తెలుగులో వచ్చిన వెబ్ సిరీస్ “సేవ్ ది టైగర్స్”. ప్రియదర్శి(Priyadarshi) , కృష్ణచైతన్య (Krishna Chaitanya), అభినవ్ (Abhinav Gomatam) టైటిల్ పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మహి వి.రాఘవ్ (Mahi V Raghav) నిర్మాణ సారధ్యమే కాక రచన కూడా చేసిన ఈ సిరీస్ సెకండ్ సీజన్ నేడు (మార్చి 15) విడుదలయింది. మరి మొదటి సీజన్ స్థాయిలో సెకండ్ సీజన్ ఆకట్టుకుందో లేదో చూద్దాం..!!
కథ: మొదటి సీజన్ లో హీరోయిన్ హంసలేఖ (సీరత్ కపూర్) కిడ్నాప్ కేసులో ఇరుక్కున్న విక్రమ్ (కృష్ణ చైతన్య), రాహుల్ (అభినవ్), గంటా రవి (ప్రియదర్శి)లను పోలీస్ స్టేషన్ లో కుళ్ళబొడిచే సన్నివేశంతో మొదలవుతుంది ఈ సెకండ్ సీజన్.
ఆ కేసు నుండి బయటపడ్డ టైగర్స్.. అనంతరం తమ జీవితాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొంటారు.
విక్రమ్ ఉద్యోగం మానేసి సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటాడు, రాహుల్ సీరియస్ గా సినిమాకి కథ రాయాలనుకుంటాడు, గంటా రవి కార్పొరేటర్ గా ఎలక్షన్స్ లో నిలబడాలనుకుంటాడు. ఈ ముగ్గురు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళ జీవితాలను ఎలా మార్చింది? ఈ నిర్ణయాల విషయంలో వారి భార్యలు ఎలా సహకరించారు? వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సీజన్ 2.
నటీనటుల పనితీరు: మొదటి సీజన్ లో అభినవ్ తన కామెడీ టైమింగ్ తో ఎక్కువ మార్కులు కొట్టేయగా.. సెకండ్ సీజన్ కి వచ్చేసరికి ప్రియదర్శి తన సత్తాను చాటుకున్నాడు. బాధ్యతగల తండ్రిగా, కాస్తంత తుత్తర ఉన్న మధ్య వయస్కుడిగా ప్రియదర్శి నటన సిరీస్ కి మెయిన్ హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా కూతురుతో మేడపై కూర్చుని మాట్లాడే సందర్భంలో ప్రియదర్శి చూపిన పరిణితిని మెచ్చుకోవాలి. అలాగే.. మెచ్యూర్డ్ హస్బెండ్ పాత్రలో కృష్ణ చైతన్య కూడా అలరించాడు. అభినవ్ మరోమారు తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు.
పావని గంగిరెడ్డి (Pavani Gangireddy) , దేవయాని శర్మ తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే.. జోర్దార్ సుజాత మాత్రం తన కామెడీ టైమింగ్ తో మిగతా లేడీ ఆర్టిస్టులను డామినేట్ చేసింది. సీరత్ కపూర్ (Seerat Kapoor) గ్లామర్ యాడ్ చేయడానికి ప్రయత్నించింది.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు అరుణ్ కొత్తపల్లి మొదటి సీజన్ కు ఏమాత్రం తగ్గని విధంగా సెకండ్ సీజన్ ను తెరకెక్కించాడనే చెప్పాలి. అయితే.. ఆదిమానవుల ఎపిసోడ్ మాత్రం అనవసరంగా సాగదీశారు. ఆ ఎపిసోడ్ మొత్తం ట్రిమ్ చేసేసినా పెద్ద నష్టం లేదు. అయితే.. మొదటి సీజన్ తో పోల్చితే సెకండ్ సీజన్ లో ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఉండడం ప్లస్ అయ్యింది.
మహి వి.రాఘవ్ & ప్రదీప్ అద్వైతం (Pradeep Advaitham) కలిసి రాసుకున్న కథనం & సన్నివేశాలు రియాలిటీకి దగ్గరగా ఉండడం, చాలా మంది జంటలు రిలేట్ అయ్యేలా ఉండడం సిరీస్ కి మరో ప్లస్ పాయింట్. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ డీసెంట్ గా ఉన్నాయి. అజయ్ సంగీతం (Ajay Arasada) & విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ వర్క్ సిరీస్ లోని కంటెంట్ ను చక్కగా ఎలివేట్ చేశాయి.
విశ్లేషణ: అసలే థియేటర్లలో సరైన సినిమాలు లేక విసిగిపోయిన ప్రేక్షకులు మరియు ఫ్యామిలీ ఆడియన్స్ కు మంచి టైం పాస్ ఇచ్చే సిరీస్ “సేవ్ ది టైగర్స్: సీజన్ 2”. ప్రియదర్శి పెర్ఫార్మెన్స్, అభినవ్ కామెడీ టైమింగ్ & రిలేటబుల్ సీన్స్ కోసం ఈ సిరీస్ ను కచ్చితంగా కుటుంబంతో కలిసి చూడొచ్చు!
ఫోకస్ పాయింట్: బోర్ డమ్ నుండి ఆడియన్స్ ను సేవ్ చేసిన “సేవ్ ది టైగర్స్”