“ప్రేమమ్” లాంటి డీసెంట్ హిట్ అనంతరం నాగచైతన్య-చందు మొండేటిల కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం “సవ్యసాచి”. “ట్విన్ వానిషింగ్ సిండ్రోమ్ & ఏలియన్ హ్యాండ్ సిండ్రోమ్” అనే రెండు సిండ్రోమ్ లను కథాంశంగా ఎంచుకొని తెరకెక్కిన ఈ మాస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కొన్నాళ్లుగా విడుదలకు ఇబ్బందిపడి.. ఎట్టకేలకు ఇవాళ విడుదలైంది. చైతూ సరసన బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం..!!
కథ : విక్రమాదిత్య అలియాస్ విక్రమ్ & ఆదిత్య ఉరఫ్ విక్కీ (నాగచైతన్య) మానందరిలాగే ఒక సాధారణ యువకుడు. కానీ.. తల్లి గర్భంలో ఉండగా కవలలుగా పుట్టాల్సిన పిల్లలు “ట్విన్ వానిషింగ్ సిండ్రోమ్” కారణంగా ఇద్దరు కాస్తా ఒక్కడిగా పుడతాడు. దాంతో “ఏలియన్ హ్యాండ్ సిండ్రోమ్” అనే మరో కొత్త లోపం లాంటి బలంతో తనకు తెలియకుండానే హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు.
అలాంటి విక్రమాదిత్య జీవితంలోకి ప్రవేశిస్తాడు అరుణ్ రాజ్ (మాధవన్). తన అక్క (భూమిక), అక్క కూతురే ప్రపంచంగా బ్రతుకుతున్న విక్రమాదిత్యకు వారిద్దరినీ దూరం చేసి.. అతడి చుట్టూ ఓ పద్మవ్యూహాన్ని అల్లుతాడు అరుణ్. ఆ పద్మవ్యూహం నుంచి విక్రమాదిత్య భారతంలో అర్జునుడిలా బయటకొచ్చి “సవ్యసాచి” అనే టైటిల్ కి జస్టీఫికేషన్ చేశాడా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోండి.
నటీనటుల పనితీరు : డీసెంట్ ఎమోషన్స్ పలికించడంలో సిద్ధహస్తుడైన నాగచైతన్య మాస్ సినిమాల్లో మాత్రం ముందు నుంచీ తేలిపోతూనే ఉన్నాడు. ఈ సినిమాలోనూ అలాగే తేలిపోయాడు చైతూ. అందులోనూ సినిమాకు ప్రధానాంశమైన “ఏలియన్ హ్యాండ్ సిండ్రోమ్” కారణంగా ఒక సగటు వ్యక్తి శరీరంలో కనబడాల్సిన రిఫ్లెక్సెస్ బూతద్ధం పెట్టి వెతికినా కూడా కనిపించవు. కామెడీ కాస్త పర్వాలేదనిపించుకొన్నాడు కానీ.. నటుడిగా మాత్రం తేలిపోయాడు.
నిధి అగర్వాల్ కాస్త ఆ కళ్ళజోడు పెట్టుకొన్నప్పుడు కాలేజ్ ఎపిసోడ్స్ లోనే బాగుందనిపించింది. ఇక ఇద్దరికీ కెమిస్ట్రీ క్రియేట్ చేయడం కోసం రాసుకొన్న అమెరికా షెడ్యూల్ మొత్తం వేస్ట్ అనిపించింది. పైగా.. నిధి అగర్వాల్ ముఖంగా ఎక్స్ ప్రెషన్స్ కనిపించకపోవడంతో ఆ పాత్ర పెద్దగా ఎలివేట్ అవ్వలేదు. హీరోగా కెరీర్ మొదలెట్టిన తర్వాత మాధవన్ నటించిన మొట్టమొదటి సినిమా “సవ్యసాచి”. ఈ సినిమాలో ఆయన పోషించింది నెగిటివ్ రోలే అయినప్పటికీ.. ఆ పాత్రను చందు మొండేటి ఒక ఫారిన్ లాంగ్వేజ్ కాన్సెప్ట్ ఫిలిమ్ నుంచి కాపీ కొట్టడం, సరైన క్యారెక్టరైజేషన్ రాసుకోకపోవడంతో, ఆ క్యారెక్టర్ ను క్లారిటీ లేకుండా ఎస్టాబ్లిష్ చేయడంతో మాధవన్ తెలుగు డెబ్యూ వేస్ట్ అయిపోయింది. ఆయన పాత్రకు హేమచంద్ర చేత చెప్పించిన డబ్బింగ్ కూడా దారుణంగా ఉండడంతో.. ఆయన పాత్ర విలనిజాన్ని ఎలివేట్ చేయడం పక్కన పెడితే కామెడీ అయిపోయింది.
భూమిక సపోర్టింగ్ రోల్ లో పర్వాలేదనిపించుకొంది. వెన్నెల కిషోర్, సత్యలు కాస్త నవ్వించారు, కనిపించిన రెండు మూడు సన్నివేశాల్లోనూ షకలక శంకర్ నవ్వులు పూయించాడు. తాగుబోతు రమేష్ డీసెంట్ రోల్లో డీసెంట్ పెర్ఫార్మెన్స్ తో క్యారెక్టర్ కు న్యాయం చేశాడు.
సాంకేతికవర్గం పనితీరు : కీరవాణిగారు చేయను వదిలేయండి అంటే బలవంతంగా చేయించినట్లున్నారు ఈ సినిమాకి సంగీతం. అందుకే ఆయన ఏదో అయ్యింది అనిపించాడు. మధ్యమధ్యలో వచ్చే “సవ్యసాచి” టైటిల్ సాంగ్ తప్ప మరో పాట కానీ.. నేపధ్య సంగీతం కానీ ఆకట్టుకోలేదు కదా కనీసం సినిమాకి ప్లస్ కూడా అవ్వలేదు. ఇక “నిన్ను రోడ్డు మీద చూసినాది లగ్గాయిత్తు” అయితే.. పాత పాటే బెటర్ అనిపించింది.
యువరాజ్ మార్క్ సినిమాటోగ్రఫీ కొన్ని ఫ్రేమ్స్ లో కనిపించింది కానీ.. కథ-కథనం పెద్దగా బాగోకపోవడంతో కార్తీక్ పనితనాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. నిర్మాతలు బ్యానర్ వేల్యూ బట్టి కాకుండా కథను బట్టి ఖర్చు చేయడం అలవాటు చేసుకోవాలి. అసలు అమెరికా షెడ్యూల్ కానీ.. సెకండాఫ్ లో వచ్చే సుభద్ర పరిణయం కానీ ఎందుకొచ్చాయో ఎవరికీ అర్ధం కాదు.
“కార్తికేయ, ప్రేమమ్” లాంటి సినిమాలతో సెన్సిబుల్ ఫిలిమ్ మేకర్ అనిపించుకొన్న చందు మొండేటి కమర్షియల్ అంశాలను సినిమాలోకి ఇరికించడం కోసం కాస్త ఎక్కువగా పరితపించడం వల్ల అవుట్ పుట్ ఇలా వచ్చిందో లేక మరీ ఎక్కువ టైమ్ తీసుకోవడంతో ఇలా అయ్యిందో తెలియదు కానీ ‘సవ్యసాచి” చూశాక ఈ డైరెక్టరేనా “కార్తికేయ” తీసింది? అని డౌట్ పడేలా తీశాడు సినిమాను. అసలు కథ ఏమిటి? దాని బ్యాక్ డ్రాప్ ఏమిటి? కథా గమనం ఏమిటి? వంటి విషయాలను చందు అస్సలు పట్టించుకోలేదు. ఆ కారణంగా ‘సవ్యసాచి” అతుకుల బొంతలా తయారయ్యింది. సినిమా కథ, కథనం, నాగచైతన్యను నటుడిగా సరిగా వినియోగించుకోలేకపోవడం కంటే ఎక్కువగా.. మాధవన్ చేత అలాంటి క్యారెక్టర్ లెస్ క్యారెక్టర్ చేయించడం అనేది మాత్రం అతడి కెరీర్ లో ఎప్పటికీ ఒక మచ్చలా నిలిచిపోతుంది.
విశ్లేషణ : ఈ తరహా కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిమ్స్ కి కావాల్సింది మంచి స్క్రీన్ ప్లే మరియు సరికొత్త సన్నివేశాలు. సినిమా మొత్తంలో ఎక్కడా అవి కనిపించవు. సో, చైతన్యకి మరీ వీరాభిమానులైతే తప్ప “సవ్యసాచి”ని థియేటర్లో కూర్చొని 150 నిమిషాల పాటు చూడడం అనేది కాస్త కష్టమే.