జూలై 24న విడుదలైన “హరిహర వీరమల్లు”కి ఎక్కువ నెగిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా సెకండాఫ్ చూసిన ప్రేక్షకులు చాలా నిరాశకు గురయ్యారు. అన్నిటికంటే సీజీ వర్క్ అనేది బిగ్గెస్ట్ మైనస్ గా మారింది. అయితే.. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా సక్సెస్ మీట్ లో ప్రస్తావిస్తూ, గ్రాఫిక్స్ బాగోలేవు అని తెలిసింది, సెకండ్ పార్ట్ కి ఆ తప్పులు జరగకుండా జాగ్రత్తపడతాం అని చెప్పుకొచ్చాడు. అయితే.. ఆ విషయాన్ని టీమ్ కాస్త సీరియస్ గా తీసుకున్నారు. అందుకే ఏమాత్రం లేట్ చేయకుండా ఆదివారం రాత్రి షోకే సినిమాకి నెగిటివ్ గా మారిన చాలా సీన్స్ ను కట్ చేశారు.
ఆ సన్నివేశాలు ఏమిటి అనేది చూస్తే..
1) గుడిపై జెండా ఎగరేసే సన్నివేశంలో పవన్ కళ్యాణ్ డూప్ చేసిన సీన్ కి, పవన్ కళ్యాణ్ ముఖాన్ని అతికించిన విజువల్ కట్ చేశారు.
2) క్లైమాక్స్ లో అత్యధికంగా ట్రోల్ అయిన తుఫాను సీక్వెన్స్ మొత్తాన్ని కట్ చేసేశారు. బాబీ డియోల్ పాత్ర “ఆంధీ వచ్చేసింది” అన్న తర్వాత ట్రైలర్లో చూపించిన పవన్ కళ్యాణ్ విజువల్ తో సినిమాని ఎండ్ చేసి, పార్ట్ 2 టైటిల్ కార్ వేశారు.
3) వరుణ యాగం సీక్వెన్స్ లో వచ్చే బాణాల సన్నివేశాన్ని కత్తిరించారు.
4) పవన్ కళ్యాణ్ & గ్యాంగ్ గుర్రపు స్వారీ చేసే సన్నివేశాల్ని స్పీడప్ చేశారు.
5) గోల్కొండ ఫైట్ ను ఇంకాస్త వేగవంతం చేశారు.
ఓవరాల్ గా దాదాపు 13 నిమిషాల సన్నివేశాలను కట్ చేసి, సీజీ వర్క్ బెటర్మెంట్ చేసిన సన్నివేశాలతో “హరిహర వీరమల్లు” కొత్త వెర్షన్ ఇప్పుడు థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అందులోనూ.. 10 రోజులకు తీసుకున్న టికెట్ హైక్ పర్మిషన్ ను ఇప్పుడు 4 రోజులకే పరిమితం చేసి, నేటి నుండి ఒరిజినల్ టికెట్ రేట్లతో సినిమా లభ్యం కానుంది. మరి ఈ కొత్త వెర్షన్ కు రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇకపోతే.. నైజాం కంటే ఆంధ్రాలో ఈ చిత్రం మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తుండడం గమనార్హం.