Seetimaarr Review: సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • September 10, 2021 / 04:01 PM IST

గోపీచంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “సీటీమార్”. ఉమెన్ కబడ్డీ నేపధ్యంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం వినాయక చవితి కానుకగా నేడు థియేటర్లలో విడుదలైంది. చాన్నాళ్లుగా హిట్ కి నోచుకోక ఇబ్బందిపడుతున్న గోపీచంద్ కి “సిటీమార్” అయినా హిట్ తెచ్చిపెట్టిందో లేదో చూద్దాం..!!

కథ: రాజమండ్రిలోని ఓ సాధారణ బ్యాంక్ ఎంప్లాయి కార్తీ (గోపీచంద్). బ్యాంక్ ఉద్యోగం వృత్తైతే.. కబడ్డీ కోచింగ్ తన ప్యాషన్. ఉమెన్ టీం కోచ్ గా మన్ననలు మాత్రమే కాక బోలెడన్ని అవార్డ్స్, మెడల్స్ సొంతం చేసుకొంటాడు. ఒకే ఊరి నుండి 8 మంది కబడ్డీ ప్లేయర్స్ ను తయారు చేసి స్టేట్ లెవల్లో గెలిపించడమే కాక నేషనల్ లెవల్ కి తీసుకెళ్తాడు.

ఆంధ్రా టీమ్ కోచ్ గా కార్తీ, తెలంగాణ టీం కోచ్ గా జ్వాలా రెడ్డి (తమన్నా) తమ టీమ్స్ ను గెలిపించడానికి నానా ఇబ్బందులుపడుతున్న తరుణంలో మకన్ సింగ్ (తరుణ్ అరోరా) ఎంటరవుతాడు.

అసలు కార్తీతో మకన్ సింగ్ కి ఉన్న గొడవ ఏమిటి? అది ఆంధ్రా కబడ్డీ టీం నేషనల్ విన్నింగ్ కి అడ్డంకిగా ఎలా మారింది? చివరికి ఏం జరిగింది? అనేది “సీటీమార్” కథాంశం.

నటీనటుల పనితీరు: నటుడిగా గోపీచంద్ తాను పోషించే ప్రతి పాత్రకు న్యాయం చేస్తూనే వచ్చాడు. ఈ సినిమాలో ఇంకాస్త ఎనర్జీతో అలరించాడు. కార్తీ క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి. వాటన్నిట్నీ బాగా బ్యాలెన్స్ చేశాడు గోపీచంద్. యాక్షన్ & సెంటిమెంట్ ను పండించడంలో గోపీ రేంజ్ ఏమిటనేది అందరికీ తెలిసిందే అయినప్పటికీ.. మరోసారి ఈ సినిమాతో స్పష్టం చేశాడు.

తమన్నా పాత్ర చిన్నదే అయినప్పటికీ.. తన స్క్రీన్ ప్రెజన్స్, గ్లామర్ & ఓన్ డబ్బింగ్ తో ఆకట్టుకుంది. మరో హీరోయిన్ గా దిగంగనా సూర్యవంశీ ఆకట్టుకుంది.

ప్రత్యేక పాత్రల్లో భూమిక, రెహమాన్ అలరించగా.. విలన్ గా తరుణ్ ఆరోరా సినిమాకి మంచి అగ్రెసివ్ నెస్ యాడ్ చేశాడు. రావు రమేష్, పోసాని, తనికెళ్ళ భరణి వంటి సీజన్డ్ ఆర్టిస్ట్స్ తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: మణిశర్మ సంగీతం సినిమాకి మెయిన్ ఎస్సెట్. మాస్ సీన్స్ లో ఆయన ఇచ్చిన ఎలివేషన్స్, యాడ్ చేసిన ఎమోషన్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పాలి. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ బ్లాక్స్ ను కాస్త కొత్తగా ప్రెజంట్ చేశాడు. అందువల్ల స్క్రీన్ ప్లే కాస్త సాగినా.. ప్రెజంటేషన్ బాగుండడంతో ఆడియన్స్ ఎక్కడా బోర్ ఫీలవ్వరు.

సంపత్ నంది సినిమా తీసిన విధానం కంటే.. సినిమాను ప్రమోట్ చేసిన తీరు బాగుంది. స్పోర్ట్స్ డ్రామా అని ప్రమోషన్ మొదలెట్టి, యాక్షన్ కూడా ఉంటుందని హింట్ ఇచ్చి. థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ కి సెంటిమెంట్ తో షాక్ ఇచ్చాడు. అందువల్ల సినిమాలో కబడ్డీకి పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా.. ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు. ప్రతి సెక్షన్ ఆడియన్స్ కి కావాల్సిన అంశాలు సినిమాలో ఉండేలా చూసుకున్నాడు సంపత్ నంది. దర్శకుడిగా సంపత్ నంది నుంచి దాదాపు నాలుగేళ్ల విరామం అనంతరం విడుదలైన సినిమా ఇది.

తన మునుపటి చిత్రం “గౌతమ్ నంద” కాన్సెప్ట్ వైజ్ బాగున్నప్పటికీ.. ఎగ్జిక్యూషన్ లో పట్టాలు తప్పి కమర్షియల్ ఫ్లాప్ గా నిలిచింది. అందుకే “సీటీమార్” విషయంలో ఆ తప్పు చేయలేదు సంపత్.. కథ పరంగా అనవసరమైన వైవిధ్యాలకు పోకుండా.. మాస్ అంశాలతో ఆకట్టుకున్నాడు. ఫైట్ సీక్వెన్స్ ను కంపోజ్ చేయించుకున్న విధానం మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ అనే చెప్పాలి.

విశ్లేషణ: జోనర్, లాజిక్ లాంటివి పట్టించుకోకుండా మాస్ ఆడియన్స్ ఫుల్లుగా ఎంజాయ్ చేసే సినిమా “సీటీమార్”. గోపీచంద్ కి ఎట్టకేలకు హిట్ పడింది. ఎలాగూ వేరే సినిమాల పోటీ లేదు, పైగా లాంగ్ వీకెండ్. సో, కమర్షియల్ గా “సీటీమార్” బ్లాక్ బస్టర్ అని డిక్లేర్ చేసేయొచ్చు.

రేటింగ్: 2.5/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus