అసలే కరోనా వచ్చి సినీ పరిశ్రమని కుదిపేస్తే.. మరోవైపు ఈ ఏడాది ఎంతోమంది సినీ ప్రముఖులు కన్నుమూసి చిత్ర పరిశ్రమని విషాదంలో ముంచింది. ముఖ్యంగా మన తెలుగు చిత్ర పరిశ్రమ కూడా 2020లో పలువురిని కోల్పోయింది. కరోనా కారణంగా దేశం గర్వించదగ్గ గాయకుడు, ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి చెందడంతో యావత్ భారతదేశం కన్నీటి పర్యంతమైంది. ఇక తాజా మ్యాటర్ ఏంటంటే.. దక్షిణాది భాషలు అన్నింటిని కలిపి దాదాపు 200 చిత్రాల్లో నటించిన సీనియర్ నటి జయచిత్ర భర్త గణేశ్ తమిళనాడులోని తిరుచ్చిలో మరణించారు.
గణేష్(62) గుండెపోటుతో ఈ రోజు ఉదయం మరణించారని తెలిపిన కుటుంబీకులు విషాదంలో మునిగిపోయారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన జయచిత్ర, 70, 80 దశకాల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది అప్పట్టో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగారు. తమిళంలో బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన అరంగేట్రం చిత్రంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన జయచిత్ర.. శివాజీ గణేషన్, జై శంకర్, శివకుమార్, రజినీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖ నటులతో నటించింది. తెలుగులో అయితే ఆమె సోగ్గాడు, మా దైవం, ఆత్మీయుడు, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి పులి.. ఇలా తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు వంటి అగ్ర నటుల సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు జయచిత్ర.
ఇక ఆ తర్వార క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన జయచిత్ర, తల్లిగా, అత్తగా పలు కీలకపాత్రల్లో మెప్పించింది. ఈ క్రమంలో తెలుగులో టాప్ హీరోలు అయిన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ చిత్రాల్లో నటించింది మెప్పించారు. ఆమె భర్త గణేశ్ ఓ చిత్రంలో నటించడం విశేషం. ఇక జయచిత్ర భర్త మృతిపట్లు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. గణేష్ భౌతికకాయాన్ని చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లోని వారి నివాసగృహంలో ఉంచగా, ఆయన మృత దేహాన్ని కడసారి చూసేందుకు జయచిత్ర అభిమానులు భారీగా తరలివస్తున్నారు. గణేష్ అంత్యక్రియలు ఈరోజు జరుగుతాయని కుటుంబీకులు తెలిపారు.