క్యాసినో వ్యవహారంలో ఈడీ దాడులు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో సంచలనం అయ్యాయనే సంగతి తెలిసింది. ఈడీ విచారణలో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు సినీ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. క్యాసినోకు వచ్చే కస్టమర్లను అలరించడానికి టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు చీకోటి ప్రవీణ్ భారీ మొత్తంలో పారితోషికాలు ఇచ్చారని తెలుస్తోంది. ఈ భారీ పారితోషికాల విషయంలో ఈడీ నోటీసులను సిద్ధం చేస్తోందని సమాచారం అందుతోంది. టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు నేపాల్ లో నిర్వహించిన క్యాసినోకు ప్రచారకర్తలుగా వ్యవహరించారని తెలుస్తోంది.
చీకోటి ప్రవీణ్ బాలీవుడ్ హీరోయిన్ మల్లికా షెరావత్ కు కోటి రూపాయలు, అమీషా పటేల్ కు 80 లక్షల రూపాయలు, గోవిందకు 50 లక్షల రూపాయలు, ఈషా రెబ్బాకు 40 లక్షల రూపాయలు, డింపుల్ హయతీకీ 40 లక్షల రూపాయలు, గణేష్ ఆచార్యకు 20 లక్షల రూపాయలు, ముమైత్ ఖాన్ కు 15 లక్షల రూపాయలు ఇచ్చారని సమాచారం. చీకోటికి మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీబీ ఛైర్మన్లతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈడీ సేకరిస్తున్న ఆధారాలలో నేపాల్ కు వెళ్లిన వాళ్లలో 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని వెల్లడైంది.
చీకోటి ప్రవీణ్ ల్యాప్ టాప్ లో చెల్లింపులకు సంబంధించిన వివరాలతో పాటు వీఐపీల వివరాలు కూడా ఉన్నాయని సమాచారం అందుతోంది. ప్రముఖ బంగారం వ్యాపారికి చీకోటి ప్రవీణ్ హవాలా ఏజెంట్ గా పని చేశారని తెలుస్తోంది.చీకోటి ప్రవీణ్ ఈవెంట్ల నిర్వహణ కోసం కస్టమర్లు ఒక్కొక్కరి నుంచి 5 లక్షల రూపాయల చొప్పున ఎంట్రీ ఫీజును వసూలు చేస్తున్నారని సమాచారం అందుతోంది. ప్రవీణ్ రెగ్యులర్ కస్టమర్లు 200 మంది అని బోగట్టా. చీకోటి ప్రవీణ్ కేసులో వెలుగులోకి వస్తున్న విషయాలు ఈడీ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.