Shaakuntalam Review In Telugu: శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!

  • April 14, 2023 / 09:29 AM IST

Cast & Crew

  • దేవ్ మోహన్ (Hero)
  • సమంత (Heroine)
  • సచిన్ కేడ్కర్, మోహన్ బాబు తదితరులు.. (Cast)
  • గుణశేఖర్ (Director)
  • నీలిమ గుణ (Producer)
  • మణిశర్మ (Music)
  • శేఖర్ వి.జోసెఫ్ (Cinematography)

సమంత టైటిల్ పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” (Shaakuntalam). మొట్టమొదటి మానవ గాంధర్వ వివాహానికి తార్కాణమైన దుష్యంతుడు-శకుంతల దేవీల కథను చిత్రరూపంగా అందించిన ఈ చిత్రం మీద ఎందుకో టీజర్ విడుదల సమయం నుంచి పెద్దగా అంచనాలు లేవు. సమంత పుణ్యమా అని వచ్చిన కాస్తంత ఆసక్తిని.. విడుదలైన మొదటి ట్రైలర్ నీళ్ళపాలు చేసింది. మరి ఈ చిత్రం పాన్ ఇండియన్ ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగిందా? ఒకప్పటి అగ్రదర్శకుడైన గుణశేఖర్ మళ్ళీ ఆ లీగ్ లోకి రాగలిగాడా? అనేది చూద్దాం..!!

కథ: అప్సరస మేనకకు, ముని విశ్వామిత్రునకు పుట్టిన సంతానం శకుంతల (సమంత). చిన్నప్పుడే ఆమెకు ప్రకృతి చెంత విడిచి మేనక స్వర్గమేగగా.. కణ్వ మహర్షి (కృష్ణం రాజు/సచిన్ కేడ్కర్) ఆమెను కుమార్తెగా స్వీకరించి, ఆయన ఆశ్రమంలోనే పెంచి పెద్ద చేస్తాడు.

అసలే మేనక కుమార్తె కావడంతో.. అప్సరసలకు ఏమాత్రం తీసిపోని అందగత్తెగా పెరుగుతుంది శకుంతల. అందుకే మొదటిచూపులోనే ఆమె అందానికి ముగ్ధుడై.. ఆమెను గాంధర్వ వివాహమాడి, శారీరికంగానూ దగ్గరై.. ఆమెను 6 నెలల్లో రాజ్యానికి తీసుకొని వెళ్తాను అని మాట మరియు తన ఉంగరమిచ్చి వెళతాడు దుష్యంతుడు (దేవ్ మోహన్).

అయితే.. దుష్యంతుడి కోసం వేచి చూడడంలో నిమగ్నమైన శకుంతల, ఆశ్రమానికి వచ్చిన దూర్వాసుడు (మోహన్ బాబు)ను పట్టించుకోకపోవడంతో.. ఆమె ఎవరికోసమైతే ఎదురుచూస్తుందో.. వారి మనసులో ఆమె గురుతులు ఉండవని, పూర్తిగా మర్చిపోతాడని శపిస్తాడు.

ఆ శాపం కారణంగా శకుంతల పడిన కష్టాలు ఏమిటి? శకుంతల-దుష్యంతుల కథ కంచికి ఎలా చేరింది? వంటి ప్రశ్నలకు సమాధానమే “శాకుంతలం” చిత్రం.

నటీనటుల పనితీరు: సమంత ఆహార్యం పరంగా శకుంతల పాత్రకు కొంతమేరకు సరిపోయింది. కానీ.. నటిగా మాత్రం ఆ పాత్రలో మెప్పించలేకపోయింది. ముఖ్యంగా పొరపాటున నేషనల్ అవార్డ్ లేదా స్టేట్ అవార్డ్ రాదనుకుందేమో, తన పాత్రకు తానే బలవంతంగా, కష్టపడి చెప్పుకున్న డబ్బింగ్ పెద్ద మైనస్ గా మారింది. మామూలు తెలుగే పూర్తిస్థాయిలో పలకలేని సమంత.. ఇలా స్వచ్చమైన, రాజుల కాలం నాటి తెలుగు మాట్లాడడానికి, డబ్బింగ్ చెప్పడానికి ఎంత కష్టపడిందో.. అది వినడానికి ప్రేక్షకులు అంతే కష్టపడ్డారు.




దుష్యంతుడిగా దేవ్ మోహన్ మాత్రం భలే సరిపోయాడు. అతడిలో మంచి స్పార్క్ ఉంది. మలయాళ నటుడైనప్పటికీ.. తెలుగు సంభాషణలకు చక్కని లిప్ సింక్ ఇచ్చాడు.

“అరువి” లాంటి సెన్సేషనల్ సినిమాతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసిన అదితిబాలన్ ను ప్రియంవద పాత్రలో చాలా చిన్నపాటి పాత్రకు పరిమితం చేయడం బాధాకరం. అలాగే.. గౌతమి, జీషు సేన్ గుప్తా, సచిన్ కేడ్కర్, మధు, హరీష్ ఉత్తమన్, సుబ్బరాజు, మోహన్ బాబుల పాత్రలు చిన్నవే అయినా.. వాటి ఇంపాక్ట్ బాగుంది.




వీళ్ళందరికంటే.. ఎక్కువ మార్కులు కొట్టేసింది మాత్రం అల్లు అర్హ. భరత పాత్రలో ఆమె స్క్రీన్ ప్రెజన్స్ & డైలాగ్ డెలివరీ తో ఆకట్టుకుంది. ఈ వయసులో అంత ధైర్యంగా కెమెరా ముందు నిల్చోవడం అనేది మెచ్చుకోదగ్గ విషయం. ఆమెకు మంచి భవిష్యత్ ఉందని ఈ చిత్రంతోనే తెలిసిపోయింది.

సాంకేతికవర్గం పనితీరు: ఎంత మైథాలజీ సినిమా అయినప్పటికీ.. దాని టేకింగ్ 80ల కాలం నాటి తరహాలో ఉంటే ఈ తరం ఆడియన్స్ ఆస్వాదించలేరనే అంశాన్ని ఒకప్పటి బెస్ట్ టెక్నికల్ డైరెక్టర్ గుణశేఖర్ ఎందుకు గుర్తించలేదో అర్ధం కాని అంశం. అలాగే.. అసలు ఈ సాధారణ కథను త్రీడీలో ఎందుకు చూపించాలనుకున్నారు అనేది కూడా అర్ధం కాదు. ఫస్టాఫ్ లో బాణాలు, సెకండాఫ్ లో రాళ్ళు తప్ప త్రీడీ ఎఫెక్ట్ లో ఆస్వాదించదగ్గ సన్నివేశం ఏమీ లేకపోవడం గమనార్హం. దుష్యంతుడి రాజ్యాన్ని చూపించేప్పుడు కూడా చాలా పేలవంగా ఉంది గ్రాఫిక్స్ & ఎడిటింగ్ వర్క్. ముఖ్యంగా అడవి & ఆశ్రమం సెట్స్ ఈటీవీ సీరియల్ సెట్స్ లా ఉండడం గమనార్హం. కథకుడిగా ఓ మోస్తరుగా ఆకట్టుకున్న గుణశేఖర్.. టెక్నీషియన్ గా మాత్రం ఫెయిల్ అయ్యాడు.




సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ & గ్రాఫిక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మచిది.

మణిశర్మ అందించిన బాణీల్లో “మల్లిక” ఒకటి ఆకట్టుకోగా.. నేపధ్య సంగీతం విషయంలో ఆయనకి ఇంకాస్త టైమ్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది.




విశ్లేషణ: కాళిదాసు రచించిన “అభిజ్ణానశాకుంతలం” నాటకాన్ని “శాకుంతలం” అనే సినిమాగా నేటి తరానికి మన చరిత్ర మరియు పురాణాల గొప్పదనాన్ని రుచి చూపించాలనుకున్న ప్రయత్నం గొప్పదే కానీ.. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టే పద్ధతి చాలా ముఖ్యం. అది లోపించడంతో దృశ్యకావ్యంలా చిత్రించాలనుకున్న సినిమా కాస్తా 80ల కాలం నాటి వీధి నాటకాన్ని త్రీడీ గ్లాసుల్లో తెరపై చూస్తున్న అనుభూతిని కలిగించింది.




సమంత మీద విపరీతమైన అభిమానం ఉన్నవాళ్ళు, టెక్నికాలిటీస్ మీద ఎలాంటి అవగాహన లేదా ఇష్టం లేని వాళ్ళు “శాకుంతలం” చిత్రాన్ని చూడొచ్చు.




రేటింగ్: 2.5/5

Click Here To Read in ENGLISH

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus