సినిమా ఫ్లాప్ అవుతుందని భయపడే సినిమావాళ్లను చూసుంటారు.. కానీ సినిమా ఎక్కడ బాయ్‌కాట్ చేస్తారో అని భయపడే సినిమా వాళ్లను చూశారా.. బాలీవుడ్ వెళ్తే అలాంటి వాళ్లు కనిపిస్తారు. అదేంటి బాలీవుడ్ జనాలు భమపడతారా? అంటే.. కచ్చితంగా భయపడతారు అనే చెప్పాలి. ‘బాయ్‌కాట్’ అంటూ.. ఏకంగా సినిమాల తలరాతల్నే మార్చేస్తున్నారు కొంతమంది మరి. అందుకేనేమో ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సినిమా ప్రచారానికే దూరమవుతున్నాడు. అయితే ఇక్కడ భయం అంటే.. తమ సినిమాను అనవసరంగా ఇబ్బందిపెడతారనే భయం.
గత కొన్ని రోజులుగా బాలీవుడ్ పరిస్థితి చూస్తే.. ఈ విషయం కచ్చితంగా అర్థమవుతుంది. ఏ సినిమా వచ్చినా సరే.. అందులో ఏదో ఒక పాయింట్ పట్టుకుని సినిమాను నానా మాటలు అంటున్నారు, సినిమా తీసిన వాళ్లు, చేసిన వాళ్లను దూషిస్తున్నారు. దీంతో సినిమా విడుదల అంటేనే టీమ్ భయపడే పరిస్థితి నెలకొంది. జనవరి 25న విడుదల కాబోతున్న ‘పఠాన్’ పరిస్థితి కూడా ఇంతే.సినిమాలోని ఓ పాటలో అందాల ప్రదర్శన నచ్చలేదని కొందరు, ఆ పాటలో దుస్తుల రంగు నచ్చలేదని ఇంకొందరు నిరసన వ్యక్తం చేశారు.
దీనిపై తీవ్ర చర్చ, రచ్చ అయ్యింది కూడా. అయితే ఇప్పుడు సెన్సార్ బోర్డు కొన్ని మార్పులు సూచించింది. అవన్నీ పూర్తి చేసి సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీమ్ దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. దీంతో షారుఖ్ ఖాన్ దేశంలో సుడిగాలి పర్యటన చేస్తాడేమో అనుకున్నారంతా. కానీ సినిమాకు ఇంకా ఐదు రోజులే ఉంది. ఇంకా ప్రచారం మొదలవ్వలేదు. దీంతో ఏమైందబ్బా అని ఆలోచిస్తే..
ఈసారి సినిమా ప్రచారం కోసం బయటకు రాకూడదని షారుఖ్ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రచారం కోసం బయటకు వచ్చి ఏదైనా మాట్లాడితే తిరిగి ఇబ్బందులు వస్తాయి. లేనిపోని అపోహలు ఏర్పడి ఎక్కడ బాయ్‌కాట్ బ్యాచ్ మళ్లీ యాక్టివేట్ అవుతారేమో అని ముందు జాగ్రత్తగా షారుఖ్ బయటకు రాకూడదని అనుకున్నారట. అయితే ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ సినిమాల విషయంలో ఇబ్బందులు పెట్టొద్దు అని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో మనోభావాల బ్యాచ్, బాయ్‌కాట్ బ్యాచ్ ఏమన్నా వెనక్కి తగ్గుతారేమో చూడాలి.