‘రివ్యూలు నేను కూడా చదువుతాను.. సినిమా బాగుంటే బాగా రాస్తారు.. బాగోకపోతే బాగా రాయరు.. మంచి రేటింగ్ ఇవ్వరు’.. ఇవి గతంలో మహేష్ బాబు ‘స్పైడర్’ ప్రెస్ మీట్లో చెప్పిన మాటలు. రివ్యూలను తాను కూడా అంగీకరిస్తానని చెప్పకనే చెప్పారు. ఆ చిత్రం డిజాస్టర్ అయినప్పటికీ రివ్యూలు రాసే వారి పై ఎటువంటి కామెంట్లు చేయలేదు. అలాగే మన టాలీవుడ్ స్టార్ హీరోలెవరూ పెద్దగా ఫిలిం విశ్లేషకుల పై ఎటువంటి కామెంట్లు చేయలేదు. కానీ బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మాత్రం ఫైర్ అయ్యాడు.
ఇటీవల ముంబైలో జరిగిన క్రిటిక్స్ ఫిలిం ఛాయిస్ అవార్డ్స్ కార్యక్రమంలో షారుఖ్ మాట్లాడుతూ… “నాలాంటి నటులు ఫిలిమ్ మేకర్స్ విభిన్న ఆలోచనలకు మాత్రమే ప్రాముఖ్యతనిస్తారు, ప్రతిభ కోసం ఆరాట పడుతుంటారు.. ప్రేక్షకులకు చెప్పాలనుకునే కథలో నిజాయితీ ఉండేలా చూసుకుంటారు. కాబట్టి సినీ విశ్లేషకులు, విమర్శకులకు నా సలహా ఒక్కటే.. స్టార్ సిస్టమ్స్ కి అలవాటు పడకండి. మీరు ఇచ్చే స్టార్ రేటింగ్స్ ను బట్టి మా ‘స్టార్ డం’ ఆధారపడి ఉండదు. ఒక సినిమాకు 3 స్టార్స్, 3.5 స్టార్స్ అంటూ ఇచ్చుకుంటూ పోవడానికి ఇది హోటల్ కాదు.. దయచేసి ఇలాంటి రేటింగ్ ఇచ్చి.. స్టార్ డం కోల్పోయామని చెప్పకండి” అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరలవుతుంది.