షారుఖ్ ఖాన్‌ను అందరూ కింగ్ ఖాన్, కింగ్ ఆఫ్ రొమాన్స్ అంటూ రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు. ఆయన రొమాంటిక్ సినిమాలు మిగిలిన వాళ్లకు భిన్నంగా ఉంటాయనే విషయం తెలిసిందే. ఆయనకు అలాంటి పేరు వచ్చింది అంటే.. అందులో ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ పాత్ర ఎంతో ఉందని చెప్పాలి. ఆ సినిమా బాలీవుడ్‌కి రావడం వెనుక ఎందరో కృషి ఉంది. అయితే ఆ పాత్రను షారుక్ కాకుండా ఇంకెవరు చేసి ఉన్నా ఇంత పండేది కాదు అని అంటారు. అయితే ఆ పాత్రను షారుక్ అంత ఈజీగా ఓకే చేయలేదట.
‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ సినిమాలో నటించడానికి షారుక్ మొదట్లో ఒప్పుకోలేదని ఆ చిత్ర దర్శకుడు ఆదిత్య చోప్రానే చెప్పారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ సినిమాల నేపథ్యంలో రూపొందించిన ఓ షోలో ఈ విషయం చెప్పారు. ‘‘షారుక్ ఖాన్‌ని ఇప్పుడు అంతా కింగ్ ఆఫ్ రొమాన్స్ అంటున్నారు. కానీ ఆయకి మొదట్లో రొమాంటిక్ హీరో కావాలనే కోరిక లేదు’’ అని చెప్పారు ఆదిత్య చోప్రా. షారుక్‌కి అమితాబ్ బచ్చన్‌లా యాక్షన్ స్టార్ కావాలని ఉండేదట. ఆ సమయంలో ఆదిత్య చోప్రా షారుక్‌కి ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’ కథ వినిపించారట.
షారుక్ ఆ కథ విని బాగుంది అని చెప్పేవాడు కానీ.. పూర్తిగా ఓకే చెప్పేవాడు కాదట. దీంతో ఆదిత్య… షారుక్ ఇతర సినిమా షూటింగులకు వెళ్లి ఈ సినిమా గురించి అడిగేవారట. ఏదీ తేల్చకపోవడంతో ఒకానొక సమయంలో విసుగొచ్చిందట. ఇక వదిలేద్దాం అని ఆదిత్యఅనుకుంటున్న సమయంలో నటిస్తున్న ‘త్రిమూర్తి’ సినిమా సెట్‌లో ఓ సంఘటన జరిగిందట.
అదే షారుక్ ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’ సినిమా చేసేలా చేసిందట. షారుక్‌తో మాట్లాడటానికి 80 ఏళ్ల వృద్ధురాలు వచ్చారట. ‘మీ సినిమాంటే నాకు ఇష్టం. అయితే ఆ సినిమాల్లో మీరు చనిపోవడం, రక్తంతో ఉండటం నచ్చడం లేదు’’ అని అన్నారట. దాంతో వెంటనే షారుక్ ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’కి ఓకే చెప్పాడని ఆదిత్య తెలిపారు.