శంభో శంకర

“జబర్డస్త్” కామెడీ షోతో కెరీర్ మొదలెట్టి అనంతరం సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని స్టార్ కమెడియన్ గా మారిన షకలక శంకర్ హీరోగా పరిచయమవుతూ నటించిన చిత్రం “శంభో శంకర”. సినిమాలో కంటెంట్ కంటే ప్రెస్ మీట్స్ & ఇంటర్వ్యూస్ లో షకలక శంకర్ మాటలు ఎక్కువ వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. మరి శంకర్ అంతగా ఎగిరెగిరి పడ్డాడంటే సినిమాలో కాస్తో కూస్తో కంటెంట్ ఉంటుందని నమ్మి థియేటర్లకి వచ్చిన ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేశాడా లేదా అనేది సమీక్ష చదివి తెలుసుకోండి..!!


కథ:
ఆంకాళమ్మ పల్లిలో తాను ఖాళీగా తిరుగుతూ అందరికీ పని చేయమని హితబోధ చేసే శంకర (షకలక శంకర్) ఆ ఊరి సర్పంచ్ చేసే అన్యాయాలకు అడ్డుగా నిలుస్తూ, ఊళ్ళో హడావుడి చేస్తూ టైమ్ పాస్ చేస్తుంటాడు. అదే ఊర్లో ఉండే పార్వతి (కారుణ్య)ను ప్రేమిస్తుంటాడు మధ్యలో. సినిమాలో ఎక్కడో ఒక చోట కాన్ఫ్లిక్ట్ అనేది రైజ్ అవ్వాలి కాబట్టి.. ప్రెసిడెంట్ కొడుకు తాగిన మైకంలో, కామం-క్రోధం కంబైన్డ్ గా తొణికిసలాడుతున్న తరుణంలో శంకర్ చెల్లెల్ని మానంభంగం చేసి చంపేస్తాడు. ఆ కోపంతో.. చచ్చిన తన చెల్లెలు శవానికి, ప్రెసిడెంట్ కొడుక్కి పెళ్లి చేసి.. అనంతరం అతడ్ని కూడా చంపేసి, ఇద్దరినీ కలిపి ఒకే సమాధిలో పూడ్చి పెడతాడు. 50 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రెసిడెంట్ (అజయ్ ఘోష్) తన కొడుకుని చంపాడన్న కోపంతో.. ఆ ఊరి ఎస్సైతో కలిసి శంకర్ ను చంపాలని పన్నాగం పన్నగా.. ఓ పోలీస్ ఉన్నతాధికారి (నాగినీడు) పుణ్యమా అని ఆ ఘోరం ఆగిపోతుంది. ఆ తర్వాత నుంచి ప్రెసిడెంట్ మీద పగబట్టిన శంకర్.. అతడ్ని నాశనం చేయడం కోసం ఒక టీం ఫామ్ చేసుకొని ఒక జీపేసుకొని తిరుగుతూ ఉంటాడు. కట్ చేస్తే.. మెయిన్ విలన్ తాను అనుకొంటున్నటుగా ప్రెసిడెంట్ కాదని, వేరే ఉన్నాడని గ్రహిస్తాడు శంకర్. ఇంతకీ ఆ విలన్ ఎవరు? శంకర్ ఆ హిడెన్ విలన్ అరాచకాల్ని అడ్డుకోగలిగాడా? చివరికి తన ఆశయమైన పోలీస్ ఉద్యోగం సంపాదించాడా? వంటి ప్రశ్నలకు సమాధానంగా తెరకెక్కిన చిత్రం “శంభో శంకర”.


నటీనటుల పనితీరు:
తనని తాను కొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేసుకోవాలన్న ఆత్రమో లేక తనలోని నటుడ్ని ప్రూవ్ చేసుకోవాలన్న పిచ్చో తెలియదు కానీ.. శంకర్ భీకరంగా ఊగిపోయాడు, ఎగిరాడు, అరిచాడు, గెంతాడు, పది నిమిషాలకోసారి మీసాలు ఎక్కడ ఉడిపోతాయో అని ప్రేక్షకుడు భయపడే రేంజ్ లో తిప్పాడు. ఇన్ని చేశాడు కానీ నటించడం మర్చిపోయాడు. అదే ప్రేక్షకుల పాలిట శాపంలా మారింది. శంకర్ అతిని భరించలేక కోర్ట్ లో జడ్జి సుత్తితో బల్ల గుడ్డినట్లుగా.. ఖుర్చీకి ఇరువైపులా ఉన్న హ్యాండిల్స్ ను కొడుతూ తన చిరాకును వెళ్లగక్కడం తప్ప వేరే మార్గం లేక కోపంతోనే కూర్చుండిపోతాడు ప్రేక్షకుడు. నిన్నమొన్నటివరకూ చాలా సినిమాల్లో ఫ్రెండ్ లేదా సిస్టర్ రోల్స్ లో కనిపించిన కారుణ్య చౌదరి “సీత రాముని” కోసం సినిమాలో పర్వాలేదనిపించే స్థాయిలో నటించి ప్రశంసలు అందుకొంది. కానీ.. ఈ చిత్రంలో పార్వతి పాత్రలో అందంతో అలరించలేకపోయింది, అభినయంతో ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా శంకర్ తో కెమిస్ట్రీ అస్సలు వర్కవుట్ అవ్వలేదు. చూడ్డానికి కూడా రసవత్తరంగా లేదు. “రంగస్థలం”తో మంచి నటుడిగా ప్రూవ్ చేసుకొన్న అజయ్ ఘోష్ పాపం ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడుతూ కనిపించాడు సినిమా మొత్తం. నాగినీడు ఈ చిత్రంలో పోషించిన పాత్ర ఆయన ఈరోజు థియేటర్లో చూడకపోయిన ఏదో ఒకరోజు టీవి లేదా యూట్యూబ్ లో చూసుకొని నవ్వుకోవడం ఖాయం.


సాంకేతికవర్గం పనితీరు:
సాయికార్తీక్ పాపం చాలా కష్టపడి ఇచ్చిన ట్యూన్స్ సరిగా తెరకెక్కించకపోవడం వల్ల వృధా అయ్యాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ అయితే ఓ పెద్ద సినిమాకి పనికొచ్చే స్థాయిలో ఉంది.
కెమెరామెన్ రాజశేఖర్ తనకు కుదిరినంతలో సినిమాని బాగా తీయడానికి ప్రయత్నించాడు. ఆల్మోస్ట్ అన్నీ ఫ్రేమ్స్ లోనూ శంకర్ ఓవర్ యాక్షన్ తప్ప ఇంకేమీ కనిపించకపోవడంతో ఆయన కూడా ఢీలాపడి ఉంటాడు.
ఇక ఎడిటర్ కష్టం ప్రతి ప్రేక్షకుడికీ అర్ధమవుతుంది. ఆయన ఎడిట్ చేయగా మిగిలిన సినిమా చూడడానికే ప్రేక్షకుడు ఇంతలా బాధపడుతుంటే.. ఆయన మొత్తం ఫుటేజ్ చూసి ఎలా ఉండి ఉంటాడో అని జాలి కూడా పడతారు.

దర్శకుడు శ్రీధర్ కొత్తగా ఆలోచించాను అనుకొన్నాడో లేక 80ల కాలం నాటి ఫిలిమ్ మేకింగ్ దగ్గరే ఆగిపోయాడో తెలియదు కానీ.. ఒక పది సినిమాల రిఫరెన్సులతో ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించాడు. ఆ సన్నివేశాల అల్లిక ఏంటో, నటీనటుల అతి ఏంటో, సందర్భాలేమిటో ఎంత అర్ధం చేసుకొందామని ప్రయత్నించినా అర్ధం కాదు. ఇక ఇప్పటివరకూ చాలా సినిమాల్లో పవన్ కళ్యాణ్ ను వాడుకోవడం చూసే ఉంటాం.. కానీ ఈ సినిమాలో వాడకం ఏ స్థాయిలో ఉందంటే.. పొరపాటున ఈ సినిమాను పవన్ కళ్యాణ్ చూస్తే “గబ్బర్ సింగ్” ఆడియో ఫంక్షన్ లో బండ్ల గణేష్ స్పీచ్ విని నవ్వినదానికంటే ఎక్కువగా నవ్వి.. ఆ వాడకాన్ని భరించలేక థియేటర్ నుంచి పారిపోతాడు కూడా.

విశ్లేషణ:
షకలక శంకర్ ఓవర్ కాన్ఫిడెన్స్ కి ప్రతీకలాంటి సినిమా “శంభో శంకర’. ఈవారం విడుదలైన 9 సినిమాల ప్రవాహంలో ఈ సినిమా కూడా కొట్టుకుపోవడం ఖాయం.


రేటింగ్: 0.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus