శంకర్‌కు భారీ చిత్రాల దర్శకుడు అని పేరు. ఆయన తీసిన సినిమాల స్థాయి, వసూళ్లు అలా ఉంటాయి మరి. అయితే అపజయం ఎరుగని వీరుడు అయితే కాదు అనే విషయం తెలిసిందే. ఆయన కెరీర్లో వరుస విజయాలు వస్తున్న సమయంలో ‘నన్బన్’ (తెలుగులో స్నేహితుడు) పేరుతో విడుదల చేశారు. ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాం అనుకుంటున్నారా? ఇప్పుడు శంకర్ మరోసారి రీమేక్‌కు మొగ్గుచూపుతున్న నేపథ్యంలో ‘స్నేహితుడు’ ఫలితాన్ని కొంతమంది ప్రస్తావిస్తున్నారు.
హిందీలో ‘త్రీ ఇడియట్స్’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా బాగా నచ్చడంతో దానిని రీమేక్ చేయాలని శంకర్ భావించారు. ‘నన్బన్’ పేరుతో విజయ్ కీలక పాత్రలో తమిళంలోకి తీసుకొచ్చారు. ఆ సినిమాకు తమిళ వుడ్లో మంచి స్పందనే వచ్చింది. అయితే తెలుగులోకి ‘స్నేహితుడు’ పేరుతో వచ్చి అనుకున్న మ్యాజిక్ చేయలేకపోయింది. అప్పటికే చాలామంది ‘త్రీ ఇడియట్స్’ను చూసేయడమే దానికి కారణం అని పరిశీలకులు చెప్పేవారు. ఇదంతా తొమ్మిదేళ్ల క్రితం మాట.
అలా రీమేక్‌తో అంతగా మార్కు వేయలేకపోయిన శంకర్ ఇప్పుడు మరో రీమేక్‌కి సిద్ధమవ్వడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రణ్వీర్ సింగ్ హీరోగా ‘అపరిచితుడు’ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ శంకర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటే… కొత్త కథ సిద్ధం చేసుకోవడం పెద్ద విశేషం కాదు. కానీ రీమేక్కే మొగ్గుచూపించాడు ఎందుకో మరి. అయితే ‘అపరిచితుడు’ను మక్కీకి మక్కీ దించడం లేదనేది ఇక్కడ విషయం. ఏదైనా 9 ఏళ్ల క్రితం రీమేక్ ఇచ్చిన మిక్స్డ్ రెస్పాన్స్ చూసి కూడా, రీమేక్‌ను ఎంచుకోవడం ఏంటో మరి.