Shiva 4K: ‘శివ’ రీ రిలీజ్.. నాగ్ ఆ ఛాన్స్ మిస్ చేశారా?

ట్రెండ్ సెట్టర్ ‘శివ’ (నవంబర్ 14) రీ-రిలీజ్ ప్రమోషన్లు మొదలయ్యాయి, కానీ ఏదో పెద్ద వెలితి కనిపిస్తోంది. ఈ లెజెండరీ సినిమా ప్రమోషన్ అంటే కేవలం నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూలు మాత్రమేనా? ముఖ్యంగా ఆర్జీవీ, గత 30 ఏళ్లుగా అవే పాత కథలనే రిపీట్ చేస్తున్నారు. ఇది ఒక ఐకానిక్ సినిమాకు సరిపోయే ప్రమోషన్ కాదని, ఏదో మొక్కుబడిగా చేస్తున్నట్లుందని విమర్శలు వస్తున్నాయి.

Shiva 4K

‘శివ’ సినిమా అనగానే నాగార్జున తర్వాత అంతగా గుర్తొచ్చేది జేడీ చక్రవర్తి. ఆ సినిమా ఆయనకు బలమైన లాంచ్‌ప్యాడ్. అంతకంటే ముఖ్యంగా, ‘శివ’ను నడిపించిన “నానాజీ” పాత్రధారి తనికెళ్ల భరణి గారు లేకుండా ‘శివ’ ప్రమోషన్స్ ఎలా పూర్తి అవుతాయి? ఆయన ఇండస్ట్రీలో ఎంతో గౌరవమున్న నటుడు. కానీ వీరు ఎక్కడా కనిపించడం లేదు.

జేడీ, భరణి మాత్రమే కాదు, ‘శివ’ గ్యాంగ్‌లో భాగమైన సుభలేఖ సుధాకర్ (సుభాష్), చిన్నా, రామ్ జగన్ (“బోటనీ పాటం”) లాంటి వారు కూడా ఈ ప్రమోషన్లలో లేరు. వీరిలో చాలా మంది ఇప్పటికీ ఇండస్ట్రీలో, టీవీల్లో చురుగ్గా ఉన్నారు. ఇంత మంది అందుబాటులో ఉన్నా, అన్నపూర్ణ స్టూడియోస్ ఎందుకు ఆర్జీవీ రొటీన్ ఇంటర్వ్యూల మీదే ఆధారపడుతోందని ప్రశ్నిస్తున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ ఈ రీ-రిలీజ్‌ను గొప్పగా వాడుకునే అవకాశాన్ని మిస్ చేసుకుంది. నాగార్జున తలచుకుంటే, ’80s రీ-యూనియన్’ తరహాలో, ఒక గ్రాండ్ “శివ రీ-యూనియన్” పార్టీని హోస్ట్ చేసి ఉండాల్సింది. ఆ ఫోటోలను, వీడియోలను మీడియాకు వదిలితే.. అదే అతిపెద్ద పబ్లిసిటీ అయ్యేదని నెటిజన్లు చెబుతున్నారు. ఇక రీ రిలీజ్ రికార్డ్స్ లలో ఇప్పటివరకు నాగార్జున సినిమాలు టాప్ లో నిలబడేలా కలెక్షన్స్ తీసుకు రాలేదు. మరి ఈసారి శివ ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus