‘దండోరా’ సినిమా ఈవెంట్లో సీనియర్ నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి మాట్లాడిన మాటలు ఇంటర్నెట్ లో పెద్ద దుమారమే రేపాయి. దీనిపై సినీ ఇండస్ట్రీలో మహిళల నుంచి నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో, శివాజీ వెంటనే స్పందించారు. అసలు తన మనసులో ఏముంది, ఎందుకు ఆ మాటలు అనాల్సి వచ్చింది అనే విషయంపై క్లారిటీ ఇస్తూ ఒక సెల్ఫీ వీడియోను బయటకు వదిలారు.
శివాజీ ఏమన్నారంటే.. ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ పబ్లిక్ లోకి వచ్చినప్పుడు, లేదా ఈవెంట్స్ లో పాల్గొన్నప్పుడు కొంతమంది వల్ల ఇబ్బంది పడటం తనను బాధించిందని అన్నారు. ఆడవాళ్లను తక్కువ చేసి చూసే ఈ సమాజానికి మనం అవకాశం ఇవ్వకూడదు అనే ఉద్దేశంతోనే, బట్టలు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పాలనుకున్నానని అన్నారు. అంతేకానీ ఎవరినీ అవమానించాలని కాదని క్లియర్ కట్ గా చెప్పారు.
అయితే ఆ మంచి చెప్పే ప్రయత్నంలో, ఒక పల్లెటూరి ఫ్లోలో రెండు అన్ పార్లమెంటరీ పదాలు దొర్లాయని ఆయన అంగీకరించారు. ఆ పదాలు వాడటం కచ్చితంగా తన తప్పేనని, అది ఊరి భాషలో వచ్చిన ప్రవాహమే తప్ప వేరే ఉద్దేశం కాదని వివరణ ఇచ్చారు. స్త్రీని తానెప్పుడూ అమ్మవారిలా, మహాశక్తిలా చూస్తానని, అలాంటి వారి మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించడం తన నైజం కాదని అన్నారు.
కేవలం ఆ రెండు పదాల వల్లే మొత్తం అర్థం మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన పొరపాటుకు బేషరతుగా ఇండస్ట్రీ మహిళలకు, బయట వారికి శివాజీ సిన్సియర్ గా క్షమాపణలు చెప్పారు. తన ఆవేదనలో నుంచి వచ్చిన మాటలే తప్ప, కించపరచాలనే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. ఇంటెన్షన్ మంచిదైనా, వాడిన పదాలు రాంగ్ అని రియలైజ్ అయ్యి ఆయన సారీ చెప్పడంతో ఈ వివాదం సద్దుమణుగుతుందని భావిస్తున్నారు.
