దండోరా సినిమా ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై నటుడు శివాజీ మరోసారి స్పందించారు. ఈ వ్యవహారం మహిళా కమిషన్ వరకు వెళ్లడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ, తాను చేసిన తప్పుకు ఎలాంటి శిక్షనైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తనకు మరణశిక్ష వేసినా తీసుకుంటానని, అంతకంటే తాను ఏం చేయగలనని ఆయన ఎమోషనల్ అయ్యారు.
Shivaji
వేదికపై తన నోటి నుంచి ఆ మాటలు వచ్చిన వెంటనే, అక్కడే ఉన్న ప్యానెల్ సభ్యుల్లో ఎవరైనా తనను వారించి ఉంటే బాగుండేదని శివాజీ అభిప్రాయపడ్డారు. “ఏంటన్నా ఇది” అని ఒక్క మాట అడిగి ఉంటే, అక్కడికక్కడే సారీ చెప్పేవాడినని, అప్పుడు ఈ గొడవ ఇంత దూరం వచ్చేది కాదని అన్నారు. తనకు తెలిసిన వాళ్ళే తనను ప్రశ్నించకపోవడం బాధ కలిగించిందని చెప్పారు.
ఇక మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయడంపై స్పందిస్తూ, సెలబ్రిటీల నుంచి ఇలాంటి మాటలు వచ్చినప్పుడు వ్యవస్థలు స్పందించడం సహజమేనని అన్నారు. తప్పు తన వైపు ఉంది కాబట్టి ఇప్పుడు ఏం జరిగినా భరించక తప్పదని, కమిషన్ ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తనకు ఎవరిపైనా ద్వేషం గానీ, చెడు ఉద్దేశాలు గానీ లేవని శివాజీ మరోసారి క్లారిటీ ఇచ్చారు. కేవలం ఆవేశంలో దొర్లిన ఆ రెండు పదాల విషయంలోనే తాను తప్పు చేశానని, దానికి బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.
ఎవరైనా తనను ఈ విషయంపై నిలదీస్తే, తప్పు జరిగిందని ఒప్పుకోవడానికి తనకు ఎలాంటి ఇగో లేదని తెలిపారు. బయట ఉన్నప్పుడు అందరూ ఎలా ఉంటారో, కెమెరా ముందుకు రాగానే ఎలా మారుతారో అందరికీ తెలుసు అని వ్యాఖ్యానించారు. మనుషులమన్న తర్వాత తప్పులు జరగడం సహజం అని, దాన్ని ఇంత పెద్దది చేయకుండా తన క్షమాపణను స్వీకరించాలని కోరారు. మొత్తానికి శివాజీ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.