రాఘవ లారెన్స్ నటించిన తాజా హారర్ ఎంటర్ టైనర్ “శివలింగ”. కన్నడలో తెరకెక్కిన “శివలింగ”కు రీమేక్ అయిన ఈ చిత్రానికి కన్నడ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన పి.వాసు తెరకెక్కించడం విశేషం. మరి ఈ హారర్ ఎంటర్ టైనర్ ఏమేరకు ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం..!!
కథ : శివలింగేశ్వర్ (రాఘవ లారెన్స్) సి.ఐ.డిలో పనిచేసే సీక్రెట్ పోలీస్ ఆఫీసర్. ట్రైన్ లో నుంచి తోసి చంపబడ్డ రహీమ్ అనే వ్యక్తి హత్య వెనుక గల కారణం తెలుసుకొని, దాని వెనుక ఉన్న మనుషుల్ని పట్టుకోవాలనే బాధ్యత అప్పగిస్తుంది. అయితే.. కేసు డీల్ చేయడానికంటే ముందు తల్లి కోరిక మేరకు సత్యభామ (రీతికా సింగ్)ను పెళ్లాడి.. ఆమెను తీసుకొని వరంగల్ వెళ్ళి కేస్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు.
ఇన్వెస్టిగేషన్ సమయంలో శివలింగేశ్వర్ కు ఓ పావురం సహాయపడుతుంటుంది, అదే సమయంలో సత్య ముస్లిం పద్ధతిలో బిర్యానీ వండడం, నమాజ్ చేయడం లాంటి విపరీత చేష్టలు చేస్తుంటుంది.
చివరికి శివలింగేశ్వర్ కేస్ ను ఛేదించగలిగాడా? రహీమ్ ను చంపింది ఎవరు? ఎందుకు చంపారు? వంటి ప్రశ్నలకు ఆసక్తికరంగా చెప్పిన సమాధానాల సమాహారమే “శివలింగ” చిత్రం.
నటీనటుల పనితీరు : తనకి బాగా అలవాటైన హారర్ జోనర్ లో లారెన్స్ మరోమారు తన సత్తా చాటాడు. ఇక డ్యాన్స్ మూమెంట్స్ తో మనోడు చేసిన హంగామా మాస్ ఆడియన్స్ ను విశేషంగా అలరించడం ఖాయం. అలాగే ఫైట్స్ తోనూ బి,సి సెంటర్ ఆడియన్స్ ను సంతుష్టులను చేశాడు. రీతికా సింగ్ మామూలు సన్నివేశాల్లో పెద్దగా పరిణితి ప్రదర్శించలేదు కానీ.. దెయ్యంగా మారే సన్నివేశాల్లో మాత్రం అదరగొట్టేసింది. అలాగే లారెన్స్ తోపాటు డ్యాన్స్ లోనూ మాస్ మూమెంట్స్ తో మత్తెక్కించింది. వడివేలు, ఊర్వశీల కామెడీ ఎపిసోడ్స్ ఒకట్రెండు మినహా పెద్దగా నవ్వించ్చిందేమీ లేదు. రహీమ్ పాత్రలో నటించిన శక్తి పెర్ఫార్మర్ గా పర్వాలేదనిపించుకొన్నాడు. మిగతా పాత్రధారులందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు : తమన్ సమకూర్చిన పాటల్లో “రంగు రకర” పాట మినహా ఏదీ ఆకట్టుకొనే స్థాయిలో లేదు. బీజీయమ్ కూడా హీరో ఇంట్రడక్షన్ తప్ప మిగతాదంతా పాత సినిమాల్లోవే కావడం గమనార్హం. సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. ఫైట్ సీక్వెన్స్ లు తెరకెక్కించిన విధానం, స్లోమోషన్ షాట్స్ లో హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన విధానం బాగుంది. సీజీ వర్క్, ఎడిటింగ్ బాగుంది. లారెన్స్ ను కాస్త తెల్లగా చూపడం కోసం డి.ఐలో బ్రైట్ నెస్ మరీ ఎక్కువగా పెంచడం వల్ల బ్యాగ్రౌండ్ కాస్త బర్న్ అయ్యింది.
దర్శకుడు పి.వాసు కథ-కథనాలను కమర్షియల్ ఫార్మాట్ లో రాసుకొన్న విధానం మాస్ ఆడియన్స్ వరకూ పర్లేదు కానీ.. మల్టీప్లెక్స్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడం కాస్త కష్టం. అయితే.. సినిమా టార్గెట్ మాస్ ఆడియన్సే కాబట్టి.. టార్గెట్ రీచ్ అయినట్లే లెక్క. కాకపోతే.. ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్ కోసం కథను బాగా నెమ్మదించడం ఒక్కటే మైనస్. ఆ ల్యాగ్ మినహా సినిమా మంచి టైమ్ పాస్ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు.
విశ్లేషణ : కొన్ని రొటీన్ హారర్ సీన్స్, రొడ్డ కామెడీ మినహాయిస్తే “శివలింగ” మాస్ ఆడియన్స్ ను ఓ మోస్తరుగా అలరించే చిత్రం. అసలే స్ట్రయిట్ సినిమా “మిస్టర్” దారుణమైన పరాజయం పొందడంతో.. తెలుగు సినిమా అభిమానులందరికీ ఈ వారానికి చూడదగ్గ ఏకైక సినిమా “శివలింగ”.
రేటింగ్ : 2/5