Shivarajkumar: కమల్‌తో మాట్లాడుతుంటే మా నాన్నతో మాట్లాడినట్లే అనిపించింది: శివన్న!
- May 26, 2025 / 05:50 PM ISTByFilmy Focus Desk
సినిమా హీరోలకు సినిమా హీరోల్లో కూడా అభిమానులు ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు ఆ విషయాలను చెబుతూ ఉంటారు. అలా మనం సీనియర్ స్టార్ హీరోల గురించి కుర్ర హీరోలు చెబుతుంటే వింటూ ఉంటాం. అయితే సూపర్ సీనియర్ స్టార్ హీరో గురించి, మరో సీనియర్ స్టార్ చెబితే ఎలా ఉంటుంది చెప్పండి. అదే జరిగింది ‘థగ్ లైఫ్’ (Thug Life) సినిమా ప్రచార కార్యక్రమంలో. కమల్ హాసన్ (Kamal Haasan) ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా ఆడియో ఈవెంట్‌కి శివరాజ్ కుమార్ వచ్చారు.
Shivarajkumar

అప్పుడు ఆయనే ఈ విషయం చెప్పుకొచ్చారు. తమ అభిమాన కథానాయకులను చూస్తే ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతారు. వాళ్లను కలిసినపుడు, మాట్లాడినప్పుడు, హగ్ చేసుకున్నప్పడు, షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఏదో తెలియని అనుభూతికి లోనవుతారు. అలా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ (Shiva Rajkumar) కూడా ఓ సందర్భంలో ఫీల్ అయ్యారట. దానికి కారణం లోకనాయకుడు కమల్ హాసన్.

శివరాజ్‌కుమార్ (Shivarajkumar) చిన్నతనంలో కమల్ హాసన్ ఒకసారి శివన్న తండ్రి రాజ్ కుమార్‌ను కలవడానికి వచ్చారట. ఆ సందర్భంలో శివన్నను హత్తుకున్నారట. దాంతో ఆయన ఏకంగా మూడు రోజులు స్నానం చేయలేదట. నా చిన్నపుడు ఒకసారి నాన్నను కలవడానికి కమల్ మా ఇంటికి వచ్చారు. అక్కడే ఉన్న నా గురించి కమల్ ఆరా తీశారు. దాంతో నాన్న నన్ను ఆయనకు పరిచయం చేశారు. వెంటనే నేను ఆయన్ని ప్రేమగా హత్తుకున్నా. ఆ అనుభూతి కొంతకాలం చెదిరిపోకూడదని మూడు రోజుల పాటు స్నానం కూడా చేయలేదు.

ఆయనంటే నాకు అంత ఇష్టం అని శివరాజ్ కుమార్ చెప్పుకొచ్చారు. ఇక తాను క్యాన్సర్ బారిన పడినపుడు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా కమల్ నుండి ఫోన్ వచ్చిందని, ఆయన మాట్లాడుతుంటే ఎంతో ధైర్యంగా అనిపించిందని చెప్పారు. ‘శివన్నా నీతో మాట్లాడుతుంటే నాకెందుకో కన్నీళ్లు వస్తున్నాయని’ అని కాల్‌లో శివరాజ్ కుమార్‌తో కమల్ అన్నారట. దాంతో తన తండ్రితో మాట్లాడుతున్నట్లే అనిపించింది శివ రాజ్‌కుమార్ ఎమోషనల్ అయ్యారు.












