కొన్ని పుకార్లను మనం ఇట్టే నమ్మేయొచ్చు.. నమ్మేస్తుంటాం కూడా. ఎందుకంటే ఆ పుకారు నిజమవ్వాలని మనం కోరుకుంటాం కాబట్టి. కానీ కొన్ని పుకార్లను మనం అస్సలు నమ్మలేం. ఆ మాటకొస్తే.. ఆ రూమర్ విన్నాక ‘ఇదేం రూమర్రా బాబూ..’ అని కూడా అంటాం. ఒక్కోసారి అలాంటి పుకార్లు కూడా నిజమవుతూ ఉంటాయి అనుకోండి. అవి అయితే చాలా హ్యాపీ కూడా మనకు. అలాంటి ఓ నిజమవ్వాలనుకునే పుకారు ఇప్పుడు టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. ఇదంతా రాజమౌళి – మహేష్‌బాబు సినిమా గురించే.
ఏ ముహూర్తాన మహేష్ బాబుతో రాజమౌళి సినిమా ఓకే చేశారో కానీ.. అప్పటి నుండి ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది. సినిమా కథ అదని, ఇదని, ఇలా ఉంటుందని, అలా ఉంటుందని, పేరు ఇదిగో అని, అదిగో అని చెబుతూనే ఉన్నారు. ఇందులో నిజా నిజాలు తెలియలేదు. కథ పూర్తయిందని కొందరు అంటుంటే, ఇంకొందరేమో కథ ఇంకా పూర్తవ్వలేదు అని చెబుతున్నారు. మరికొందరైతే కథ రెడీ అయ్యిందని, సినిమా రెండు పార్టులు ఉంటుందని చెబుతున్నారు.
రాజమౌళి – మహేష్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయంలో క్లారిటీ అయితే లేదు. అక్టోబరు అని కొందరు అంటుంటే… కాదు కాదు ఆగస్టులోనే ఉంటుందని కొందరు అంటున్నారు. అయితే ఇప్పుడు రాజమౌళి దేశంలో లేరు. విదేశాల్లో ఫ్యామిలీ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ బాబు అయితే ‘గుంటూరు కారం’ దంచే పనిలో బిజీగా ఉన్నారు. ఇదిలా సాగుతుండగా.. రాజమౌళి సినిమా రెండు భాగాలు అంటూ ఓ పుకారు మొదలైంది. రాజమౌళి సినిమా కదా.. ఉండొచ్చు అని అనుకున్నారు ఫ్యాన్స్.
అయితే ఇప్పుడు ఆ రూమర్‌కి మరింత మసాలా యాడ్ చేశారు. అదే తొలి భాగంలో మహేష్ హీరో అయితే, రెండో భాగంలో తారక్ హీరో అంటున్నారు. ఇదెంతవరకు సాధ్యం.. దీన్ని ఆ సినిమాకు రెండు భాగాలు అని ఎలా అంటారు అనేది తెలియడం లేదు. దీంతో రెండు భాగాలు అనే రూమర్ కరెక్టా కాదా అనేది తెలియాల్సి ఉంది. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తారని ఇప్పటికే అనౌన్స్ చేశారు.