ఇప్పుడు స్టార్లుగా సినీ పరిశ్రమలో వెలుగొందుతున్న వారికి ఈ స్టార్ డమ్ ఒక్కరోజులో వచ్చింది కాదు. దీని వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ, అవమానాలు, చీత్కారాలు వున్నాయి. ఒకపూట తిని, మరోపూట తినక పస్తులున్న వారే. కానీ అనుకున్న రంగంలో ఏదో ఒకటి సాధించాలన్న తపన వారిని ఈ స్థాయికి తీసుకొచ్చింది. అలాంటి వారిలో ఒకరు దర్శకుడు పరశురామ్ . సూపర్ స్టార్ మహేశ్ సరసన సర్కార్ వారి పాట వంటి సినిమాను తెరకెక్కించి మంచి హిట్ కొట్టిన ఆయన పేరు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో మారుమోగుతోంది.
పరశురామ్‌తో సినిమా చేసేందుకు పలువురు స్టార్లు ఎదురుచూస్తున్నారు. కానీ ఆయన ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టముంది. పరశురామ్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వున్నాయి. ఆయన తండ్రి ఓ కో ఆపరేటివ్ బ్యాంకులో పనిచేసేవారు. వాళ్లకున్న చిన్న పౌల్ట్రీ ఫామ్‌ను పరశురామ్ తల్లి చూసుకునేవారు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు అన్నట్లు ఓసారి పౌల్ట్రీ ఫామ్‌కి వైరస్ సోకి కోళ్లన్ని చనిపోయాయి. దీంతో వారు పెట్టిన పెట్టుబడి మొత్తం పోయింది. పిల్లల్ని మంచి చదువులు చదివించాలనుకున్న పరశురామ్ వాళ్ల అమ్మ గారి ఆశలు అడియాశలయ్యాయి.
కానీ వైరస్ కారణంగా మొత్తం తలక్రిందులైంది. అయినప్పటికీ డీలా పడకుండా ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకుంటూనే పార్ట్ టైమ్ జాబ్ చేసేవారు పరశురామ్. కాలం అలా గడుస్తుండగా వాళ్ల కుటుంబానికి అనుకోని షాక్ తగిలింది. పరశురామ్ అమ్మగారికి తీవ్ర అస్వస్థత కలిగింది. పరీక్షలు చేయిస్తే ఎక్యూట్ బ్లడ్ క్యాన్సర్ అని తేలింది. అంతే.. ఆ మాటకు పరశురామ్‌కు షాక్‌తో మాట రాలేదు. అక్కకు తేలిస్తే తట్టుకుంటుందా.. నాన్న పరిస్ధితి ఏంటనే ఆలోచనతో ఎవరికీ ఏం చెప్పలేదు. నటుడు జోగినాయుడు, యాంకర్ ఝూన్సీలు అన్నా వదినలు కావడంతో వారిద్దరూ హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రుల్లో చూపించినా ఫలితం దక్కలేదు.
చివరికి ఆరు నెలల పాటు పోరాడి పరశురామ్ వాళ్లమ్మ చనిపోయారు. పుట్టెడు దు:ఖంలో వున్నప్పటికీ.. ఉన్న ఆస్తిని అమ్మేసి పరశురామ్ అక్కకి పెళ్లి చేశారు. ఈ ఘటనతో వాళ్ల నాన్న డిప్రెషెన్‌లోకి వెళ్లిపోయారు. చివరికి కుటుంబం కోసం హైదరాబాద్‌లో ఏదైనా ఉద్యోగం వెతుక్కుందామని బయల్దేరాడు. సినిమాలపై ఆసక్తితో పూరి జగన్నాథ్, దశరథ్, వీరు పోట్ల, భాస్కర్ వంటి దర్శకుల వద్ద రైటర్‌గా.. అసిస్టెంట్‌గా పనిచేశాడు. దర్శకుడిగా నిఖిల్‌తో యువత మూవీని తెరకెక్కించాడు. ఆ వెంటనే ఆంజనేయులు, సోలో, సారొచ్చారు. శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం వంటి మూవీలు చేశారు.