ప్రస్తుతం కరోనా ధాటికి ప్రపంచం మొత్తం లాక్‌డౌన్ అయిపోయింది. దేశాలకు దేశాలే తమ పౌరులను ఎక్కడికక్కడ కట్టడి చేయడంతో పాటు ట్రాన్స్‌ఫోర్ట్ ఫెసిలిటీలు నిలిపివేశాయి. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. షూటింగ్‌లు, టూర్లు లేకపోవడంతో కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు. మొన్నామధ్య కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన మేనల్లుడితో ఫాం హౌస్‌లో ఆడుకుంటున్న వీడియోను షేర్ చేశాడు. ఫ్యామిలీలతో టైం స్పెండ్ చేస్తూనే, కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ నటి విద్యాబాలన్ చేసిన ఓ ట్వీట్ బీ టౌన్‌లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. కరోనాతో ప్రపంచం మొత్తం అల్లాడుతుంటే ఈ అమ్మడు మాత్రం ఆ మహమ్మారికి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేసింది. ‘‘ కోవిడ్ 19 కారణంగా అంతా లాక్‌డౌన్ అయ్యింది. వెహికల్స్ వల్ల వచ్చే కాలుష్యం తగ్గిపోయింది. గాలి స్వచ్ఛంగా మారుతోంది.. ఆకాశం నిర్మలంగా ఉంది. ఈ అవకాశాన్ని భూగోళం పునరుజ్జీవనం కోసం వినియోగించుకుంటోంది అంటూ విద్య తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసింది.
అంతేకాకుండా ప్రజలు ప్రకృతి పట్ల చేస్తున్న పొరపాట్లు, కరోనాకు సంబంధించిన పాఠాలను ప్రస్తావించింది. అయితే దీనిని పాజిటివ్‌గా తీసుకున్న కొందరు నెటిజన్లు విద్యకు లైక్స్ కొడుతుంటే కొందరు మాత్రం ఫైర్ అవుతున్నారు. జనాల ప్రాణాల తీస్తున్న కరోనాకు కృతజ్ఞతలు చెప్పడం కరెక్ట్ కాదని కామెంట్లు పెడుతున్నారు. విలాసవంతమైన జీవితాన్ని గడిపే నీకు కరోనా ప్రభావం తెలియదని, రోజు వారి కూలీ బతుకులు గురించి ఆలోచించాలని హితవు పలుకుతున్నారు.