లాక్ డౌన్ సమయంలో నటుడు సోనూసూద్ ప్రజలకు చేసిన సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వలస కార్మికులను ఆదుకోవడం నుండి తన సేవలు మొదలుపెట్టిన సోనూసూద్ ఇప్పటికీ తన సేవ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. దీంతో జనాల్లో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సినీ తారలు, రాజకీయ నాయకులకు మించి ఇమేజ్ సంపాదించుకున్నాడు. జనాలంతా రియల్ హీరో అంటూ సోనూకి బ్రహ్మరథం పట్టారు. ఇంతలా సోనూని నెత్తిన పెట్టుకున్న జనాలు ఇప్పుడు అతడిని విలన్ లా చూస్తున్నారు. #WhoTheHellAreUSonuSood అంటూ ట్విట్టర్ లో గురువారం నుండి హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.
సోనూసూద్ పై జనాలు ఇంతగా ఎందుకు మండిపడుతున్నారంటే.. మహాశివరాత్రి సందర్భంగా సోనూ ఓ ట్వీట్ చేశాడు. కేవలం ఒక ఫోటో పెట్టి విషెష్ చెప్పడం కాకుండా ఎవరికైనా సాయం చేస్తేనే నిజమైన మహాశివరాత్రి అంటూ పోస్ట్ పెట్టాడు. ఈ ట్వీట్ కొందరు నెటిజన్లకు నచ్చలేదు. హిందువుల పండగలకు మాత్రమే సెలబ్రిటీలు ఈ విధంగా నీతులు బోధిస్తారని.. మిగతా మతాల పండుగల విషయంలో ఎలాంటి కామెంట్స్ చేయరంటూ సోనూసూద్ పై విరుచుకుపడ్డారు. అతడిని టార్గెట్ చేస్తూ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
గతంలో దీపావళి పండగ సమయంలో కూడా టపాసులు కాల్చొద్దని చెప్పిన కొన్ని సెలబ్రిటీలను ఇలాంటి ట్రోల్ చేశారు. తాజాగా సోనూసూద్ ఇటువంటి ట్రోలింగ్ బారిన పడ్డాడు. అయితే సోనూసూద్ అభిమానులు మాత్రం ఆయనికి సపోర్ట్ చేస్తూ.. ‘ISupportSonuSood’ అనే హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేసి పోస్ట్ లు పెడుతున్నారు. ఈ ట్రోలింగ్ పై స్పందించిన సోనూ.. ”నేను సామాన్యుడికి మాత్రమే జవాబుదారీగా ఉంటాను. మానవత్వంతో సాయం చేయడమే నా విధి” అంటూ పేర్కొన్నారు.