సినిమా ఇండస్ట్రీలో ఫేమ్ అశాశ్వతం. ఎప్పుడు ఏ సినిమా మటాష్ అవుతుందో, ఫేమ్ పోతుందో చెప్పలేం. అలాంటి ఇండస్ట్రీలో 20 ఏళ్లుగా కథానాయికగా రాణిస్తోంది అంటే… శ్రియ టాలెంట్ ఏంటో చెప్పుకోవచ్చు. గ్లామర్ పాత్రలతోనే ఇంత దూరం వచ్చింది అని అనుకోలేం. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతోనూ తనను తాను వెండితెరపై ఆవిష్కరించుకుంది. అందుకే ఇప్పటికే ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతోంది. మరి మీ చివరి క్షణం ఎలా ఉండాలి అనుకుంటున్నారు అని అడిగితే… ఇదిగో ఇలా చెప్పుకొచ్చింది.
నేను ఇండస్ట్రీకి వచ్చి… ఇరవయ్యేళ్లు అయ్యింది. ఇంకో ఇరవయ్యేళ్లు ఇలాగే నటిస్తూనే ఉంటా అని చెప్పింది శ్రియ. అంతేకాదు కరోనా సమయంలో సినిమాతో ఆమె అనుబంధం మరింత బలపడిందట. ఆమె చేసిన చిత్రాల్ని మళ్లీ మళ్లీ చూసుకుందట. దాంతో సినిమాతో బంధం స్ట్రాంగ్ అయ్యిందట. అంతేకాదు తన చివరి క్షణం వరకు నటిస్తూనే ఉండాలనేది ఆమె కోరిక అని చెప్పింది శ్రియ. ఆమె ఇలా అనడం వెనుక అక్కినేని మాట ఉందట.
‘మనం’ చిత్రీకరణ సమయంలో ఏఎన్నార్ చివరి సన్నివేశం చేస్తున్నప్పుడు శ్రియ అక్కడే ఉన్నారట. ఒకవేళ నేను చనిపోతే, ఈ సినిమా చేసే చనిపోతా అన్నారట. అయనలా చివరి క్షణం వరకు నటిస్తూనే ఉండాలనేది తన కోరిక కూడా అని చెప్పింది శ్రియ. సినిమా అంటే ఎంతో అభిమానం ఉంటే కానీ.. ఇలాంటి ఆలోచన రాదు. ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టే… ఇన్నాళ్లు సినిమాల్లో ఉంది శ్రియ.