‘తెలుగు టు తెలుగు ట్రాన్స్‌లేషన్‌లో తప్పుగా అర్థం చేసుకున్నారు’ అని.. ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఆ సినిమాలో జోక్‌గా అన్నారేమో కానీ కొన్నిసార్లు నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఒక విషయం గురించి మాట్లాడినప్పుడు మరో విషయాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తే దానిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు నటుడు సిద్ధార్థ్ విషయంలోనూ ఇదే జరిగిందా? ఏమో ఆయన మాటలు, వీడియో చూస్తే అదే అనిపిస్తోంది. సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పించేలా ప్రత్యేక వీడియోలు చేయాలని నటులకు, సినిమా జనాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల సూచనలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అలాంటి వీడియోలు ఇవ్వకపోతే సినిమాలకు ప్రత్యేక టికెట్ ధరలు లాంటి సదుపాయాల్ని ఆపేద్దాం అంటూ కాస్త కఠినంగా కూడా మాట్లాడారు. ఇదే విషయం సిద్ధార్థ్ (Siddharth) దగ్గర ప్రస్తావిస్తే ఆయన చెప్పిన పోలిక ఇప్పుడు ఇబ్బంది పెట్టింది. అయితే, విషయాన్ని వెంటనే పసిగట్టిన సిద్ధార్థ్ ఓ వీడియో రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చారు. ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) ప్రెస్ మీట్‌లో ఓ ప్రశ్నకు నేనిచ్చిన సమాధానాన్ని కొందరు అపార్థం చేసుకున్నారు.
అందుకే విషయాన్ని క్లియర్ చేయాలనుకుంటున్నా. డ్రగ్స్‌పై పోరాటం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి మద్దతిస్తా అని ఆ వీడియోలో సిద్ధార్థ్ చెప్పారు. అయితే అంతకుముందు ప్రెస్ మీట్‌లో సిద్ధార్థ్ మాట్లాడుతున్నప్పుడు ‘సీఎం రేవంత్ రెడ్డి వీడియో సూచన గురించి మీరేమంటారు’ అనే ప్రశ్న వచ్చింది. 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులకు నేను తెలుసు. సురక్షిత శృంగారం గురించి గతంలో నేను అవగాహన కల్పించే ప్రయత్నం చేశా.
ఆ హోర్డింగ్స్ 2005 నుండి ఆరేళ్లు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టారు కూడా. నా బాధ్యతగా ఆ పని చేశాను. ప్రతి నటుడికీ సామాజిక బాధ్యత ఉంటుంది అని అన్నాడు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి సూచన గురించి అడిగితే సిద్ధార్థ్ వేరే విధంగా మాట్లాడారు, ఆయన ఆలోచనను పట్టించుకునేలా మాట్లాడలేదు అనే కామెంట్స్ వచ్చాయి. అందుకే ఇప్పుడు క్లారిటీ వీడియో రిలీజ్ చేశాడు సిద్ధార్థ్.