టాలీవుడ్‌లో ఒకప్పుడు రొమాంటిక్ హీరోగా మంచి గుర్తింపు పొందిన సిద్ధార్థ్ (Siddharth) , ప్రస్తుతం తమిళ చిత్రాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. అయితే ఆయన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. తాజాగా సిద్ధార్థ్, ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) జోడిగా నటించిన మిస్ యు (Miss You) నవంబర్ 29న తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ అయింది, మంచి స్పందన అందుకుంది.
ట్రైలర్ రిలీజ్ సందర్భంగా జరిగిన మీడియా మీట్‌లో, పుష్ప 2 (Pushpa 2 The Rule) రిలీజ్ తో పోటీగా ఉంటే మీ సినిమాకు ఎలాంటి ప్రభావం ఉంటుందని అనుకుంటున్నారు అని ఓ విలేకరి అడిగారు. దీనికి సిద్ధార్థ్ అద్భుతమైన సమాధానం ఇచ్చారు. “మొదటగా, నా కంట్రోల్‌లో ఉన్నదాని గురించి మాత్రమే మాట్లాడతాను. నా కంట్రోల్‌లో లేనివాటిని గురించి మాట్లాడటం అనవసరం. ప్రతి సినిమా కూడా దాని స్థాయిలో పెద్దదే. బడ్జెట్ బట్టి సినిమాని తక్కువగా చూడటం సరైనది కాదు. మంచి కంటెంట్ ఉంటే సినిమాకి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది,” అని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
సిద్ధార్థ్ తన సినిమా మంచి కంటెంట్‌తో ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. “సినిమా 7 రోజుల తర్వాత కూడా థియేటర్లలో నిలబడాలి అంటే, ఆ సినిమా కథ, ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. మంచి సినిమాను ఎప్పుడు అంత ఈజీగా థియేటర్ల నుంచి తీసివేయరు. 2006 ఆ టైమ్ లో అలాంటి పరిస్థితులు ఉండేవి, కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావంతో ప్రతి విషయం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ రోజుల్లో మంచి సినిమాలను ప్రేక్షకులే నిలబెడతారు,” అని తెలిపారు.
మిస్ యు సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నానని, ఆడియన్స్ మంచి సినిమాను ఎప్పుడూ ఆదరిస్తారనే విశ్వాసం తనకు ఉందని సిద్ధార్థ్ అన్నారు. పుష్ప 2 పెద్ద సినిమా అయినా, తన చిత్రానికి ఉండే ఆదరణపై దృష్టి పెట్టడం ముఖ్యం అని చెప్పుకొచ్చారు. పుష్ప 2తో పోటీపై భయపడటం లేదని, సినిమా బాగుంటే ప్రేక్షకులే ఇష్టపడతారని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఇక సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.