సినిమా మీడియాల యందు తెలుగు సినిమా మీడియా అంటుంటారు. ఒకప్పుడు ఈ మాటను తెలుగు మీడియా గొప్పతనం గురించి చెబితే.. ఇప్పుడు కొంతమంది జర్నలిస్ట్‌లు / జర్నలిస్ట్‌లు అని చెప్పుకునేవాళ్ల కొన్ని అనవసరపు ప్రశ్నలు, మాటల గురించి చెప్పడానికి వాడుతున్నారు. ఏ ప్రశ్న అడగాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి అనేది మరచిపోయి.. ఆ సమయానికి ఏది అనిపిస్తే అది మాట్లాడి మొత్తం తెలుగు మీడియాకే తలవొంపులు తీసుకొస్తున్నారు. రీసెంట్‌గా సిద్ధు జొన్నలగడ్డను ఓ మహిళా జర్నలిస్ట్ అడిగిన ఇబ్బందికర ప్రశ్నతో మరోసారి ఈ చర్చ మొదలైంది.
సెన్సేషనలిజం.. సినిమా పరిశ్రమలో ఇది చాలా పెద్ద అవకాశం. తమ సినిమా విషయంలో ఏదో ఒక వియర్డ్ కామెంట్ చేసి.. ఆ మాటతో సెన్సేషనలిజం క్రియేట్ చేసి నిత్యం మీడియాలో ఆ సినిమా ఉండేలా చూసుకునే హీరోలు మన దగ్గర చాలామంది ఉన్నారు. అందులో ఎక్కువ శాతం మంది ప్రస్తుతం అలాంటివి ఆపేసి కామ్‌గా ఉన్నారు. ఆ అత్యుత్సాహ ప్రచారం అసలుకే ఎసరు పెడుతుంది అని వాళ్లు అర్థం చేసుకోవడమే. వారిని ఆదర్శంగా తీసుకున్నారో ఏమో తెలుగు సినిమా మీడియాలో ఇలాంటి సెన్సేషనలిజం కామెంట్లు చేసి వైరల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
కొన్ని నెలల క్రితం ఓ సీనియర్ జర్నలిస్ట్, ఓ సినిమా పత్రిక అధినేత, పీఆర్‌వో, చిన్న నిర్మాత ఒకరు ఇలానే ఏదేదో మాట్లాడేసి చాలామందితో చివాట్లు తిన్నారు. ఆ తర్వాత మరో సీనియర్ జర్నలిస్ట్ ఆయన్ను రీప్లేస్ చేసినట్లుగా ప్రెస్‌మీట్లలో ఏదేదో అనేయడం, ఇంటర్వ్యూల్లో విసిగించి తనకు కావాల్సిన సమాధానం చెప్పించుకోవడం లాంటివి చేశారు. ఇటీవల అయితే ఓ నటిని ఇలానే అడిగి.. ఏకంగా నోటీసుల వరకు తెచ్చుకున్నారు. ఆ ఇద్దరినీ మరచిపోవడం కష్టంగా ఉన్న సమయంలో ఓ మహిళా జర్నలిస్ట్ మాట అదుపు తప్పారు.
‘తెలుసు కదా’ సినిమా ప్రెస్ మీట్‌లో సిద్ధు జొన్నలగడ్డను ‘మీరు ఉమనైజరా’ అని అడిగారు. దానికి ఆ రోజు కామ్‌గా ఉన్న ఆయన.. ఇప్పుడు రియాక్ట్ అయ్యారు. ఆ రోజు ఆ పదం విన్నప్పటికీ.. స్పందించకూడదని ఊరుకున్నాను. చేతిలో మైక్ ఉన్నంత మాత్రాన ఆర్టిస్టులను ఏమైనా అడిగిచేయొచ్చు అనుకోవడం తప్పు. ఒక సినిమా ట్రైలర్ చూసి అలాంటి ప్రశ్న అడగడం వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా. మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నాం కదా అని ఏది పడితే అది అడగడం మంచిది కాదు అని సిద్ధు అన్నాడు. ఇదే జర్నలిస్ట్ ప్రదీప్ రంగనాథన్‌ను కించపరిచేలా మాట్లాడారు.
ఇలా చేయడం వల్ల తెలుగు సినిమా మీద, తెలుగు సినిమా మీడియా మీద చిన్న చూపు కలుగుతుంది. అయితే మొదట చెప్పిన పీఆర్‌వో/ జర్నలిస్ట్ మీద ఆగ్రహం వ్యక్తం చేసిన సినిమా పీఆర్‌వోలు, రెండో వ్యక్తి మీద ఆ స్థాయిలో ఫైర్ చూపించలేదు. మరిప్పుడు మహిళా జర్నలిస్ట్ విషయంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి. ఇక్కడ సమస్య ఎవరు అన్నారు అనేది కాదు.. అసలు అనడమే సరికాదు అని.