సమాజంలో మహిళల సమస్యల గురించి అలుపెరగని పోరాటం చేస్తున్న గాయని చిన్మయి శ్రీపాద. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలను ఆమె బలంగా వినిపిస్తుంటారు. అవకాశాల పేరుతో మహిళలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిని ఎప్పుడూ ఎక్స్‌పోజ్ చేస్తూ ఉంటారు. గతంలో చాలా సార్లు వివిధ అంశాల గురించి చిన్మయి మాట్లాడిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి చిన్మయి సోషల్ మీడియాలో మహిళల సమస్యల గురించి వరుస పోస్టులు చేస్తోంది.
కేరళ చలనచిత్ర పరిశ్రమలో భావన మేనన్ – దిలీప్ కుమార్ ఇష్యూ గురించి తెలిసిందే. అత్యాచర ఆరోపణలతో దిలీప్‌ను 2017లో పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలై ఇప్పుడు బయట ఉన్నారు. అయితే ఆ వ్యవహారంలో భావనకు సపోర్టుగా మాట్లాడిన పార్వతి తిరువోత్ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు. మహిళా సంఘాలతో కలసి అప్పుడు ఆమె పోరాటం చేశారు. అయితే ఆ పోరాటం మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఆ పోరాటం ఇప్పుడు అవకాశాలకు గండికొట్టింది అని చెబుతున్నారు పార్వతి. మంచి హిట్‌లు ఇచ్చినా తనకు అవకాశాలు కొరవడాయని చెబుతున్నారు.
ఓ వెబ్‌సైట్‌కి పార్వతి ఇచ్చిన ఇంటర్వ్యూను షేర్ చేస్తూ చిన్మయి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమాజంలో జరిగిన అన్యాయాన్ని ఎదిరిస్తూ మాట్లాడినందుకు ఓ మహిళ పరిస్థితి ఇదీ అని రాసుకొచ్చారు చిన్మయి. బాధితురాలి తరఫున మాట్లాడినందుకే పార్వతికి అవకాశాలు రాలేదు. ఆ రోజుల్లో ఈ సమస్య గురించి చాలామంది మౌనంగా ఉన్నారు. నోరెత్తినందుకు ఆమె ఇబ్బంది పడుతోంది అంటూ ట్వీట్ చేశారు చిన్మయి. అంతేకాదు ఈ సమాజానికి రేపిస్ట్‌లు అంటే మక్కువ ఎక్కువ అంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు చిన్మయి.
దీంతోపాటు దర్శకురాలు సుధ కొంగర గురించి కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. దర్శకత్వంలోకి వస్తానంటే తనకు ఎవరూ సపోర్టు చేయలేదని, తనంతంటే తానే పరిశ్రమలోకి వచ్చి పోరాడి నిలదొక్కుకున్నానని సుధ చెప్పారు. ఆ వార్తను పోస్ట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు చిన్మయి. “సినిమా దర్శకులు, నటులు, సంగీత దర్శకులు, క్రియేటర్స్, లాయర్స్, డాక్టర్స్, పొలిటిషియన్స్ భార్యలు నిజాంగానే గ్రేట్. మీరు మీ భర్తలకు పని చేసుకునే స్వేచ్ఛను, అనుమతి ఇచ్చారు” అంటూ సెటైర్ వేశారు చిన్మయి.