59 సుదీర్ఘ ప్రయాణం ఆమెది. 1938లో గుంటూరులోని రేపల్లెలో జన్మించిన జానకి 1957లో విడుదలైన తమిళ చిత్రం “విదియిన్ విలయాట్టుతో ..” నేపథ్య గాయనిగా కెరీర్ మొదలుపెట్టారు. దేశంలోని దాదాపు అన్ని ప్రముఖ భాషల్లోనూ పాటలు పాడుతూ శ్రోతలని అలరిస్తూ వస్తున్న ఈ మహా గాయని తాజాగా ఒక మలయాళ పాటతో తన కెరీర్ కు వీడుకోలు పలికాలని నిర్ణయించారు. అనూప్ మీనన్- మీరా జాస్మిన్ లు నటిస్తున్న ’10 కాల్పనికాల్’ చిత్రంలో ‘ అమ్మ పూవిను’ అనే ట్రాక్ తో ఓ చరిత్రకు ఫుల్ స్టాప్ పెడుతున్నారు “నైటింగేల్ ఆఫ్ సౌత్” గా పిలవబడే మన పాటల తల్లి ఎస్. జానకి.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ.. ఇలా వివిధ భాషల్లో దాదాపు 48,000 పాటలను ఆలపించిన మధుర గాయని ఎస్. జానకి ఇక రిటైరవుతున్నట్లు ప్రకటించారు. 59 సంవత్సరాల తన సుదీర్ఘ కెరీర్‌కు మలయాళ పాటతో ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. ‘10 కల్పనకల్’ అనే మలయాళ చిత్రం కోసం తాను పాడే జోలపాటే చివరిదని పేర్కొన్నారు. ‘ఇక పాటలు చాలనుకుంటున్నా. చాలా భాషల్లో పాడాను. పెద్దదాన్నయిపోయాను.. ఇక ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నా. మలయాళ పాటతో మానేయాలని ప్రత్యేకంగా అనుకోలేదు.. అనుకోకుండా జరిగింది అంతే.. అది లాలి పాట.. నా మనసుకు చాలా నచ్చింది’ అని ఆమె పేర్కొన్నారు. వేడుకల్లో సైతం ఇక తన గొంతు ఏ స్వరమూ పలకదంటూ గాత్ర సన్యాసం చేపట్టారు. ఉత్తమ గాయనిగా జానకికి 4 జాతీయ పురస్కారాలు సహా వివిధ రాష్ట్రాల నుంచి అనేక అవార్డులు లభించాయి.