సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

అయిదుగురు అమ్మాయిలు తమ దైనందిన జీవితాల నుంచి కాస్త విరామం తీసుకొని చేసిన ఓ రోడ్ జర్నీ “సీత ఆన్ ది రోడ్”. తమను తాము తెలుసుకోవడం కోసం, తమ కోసం తాము చేసిన ప్రయాణం ఈ చిత్రం. రోడ్ ఫిలింగా తెరకెక్కిన ఈ చిత్రం నేడు (మార్చి 5) జీప్లెక్స్ లో విడుదలైంది. ఈ నవతరం సీతల ప్రయాణం ఎలా ఉందో చూద్దాం..!!

కథ: అను (కల్పిక గణేశ్) ప్రేమించిన అబ్బాయి అనుమానించడంతో, ఆ అబ్బాయి అనుమానాన్ని నిజం చేసి, అలా చేశానన్న బాధతో చెప్పులు కూడా లేకుండా తనకు ఇష్టమైన బుల్లెట్ పై ప్రయాణం మొదలెడుతుంది. మొహిని (ఖతేరా హకీమీ) ఓ హీరోయిన్, నటిగా స్థిరపడడం కోసం ఇబ్బందులు పడుతూ, క్యారెక్టర్ ను చంపుకోకూడదు అనే తాపత్రయంతో బ్రతుకుతుంటుంది. ప్రతి మగాడు తన టాలెంట్ ను కాక శరీరాన్ని మాత్రమే చూస్తున్నారనే చిరాకుతో కారులో పెట్రోల్, ఒంటికి వోడ్కా ఫుల్ గా పట్టించి రోడ్డెక్కేస్తుంది.

గాయత్రి (గాయత్రి గుప్తా) ఓ సగటు యువతి. ఇటు అత్తింట్లో, అటు అమ్మగారింట్లో తన ఇష్టానికి కనీస స్థాయి గుర్తింపు కూడా ఉండడం లేదని మదనపడుతూ, తానేం కోల్పోతున్నానో తెలుసుకోవడం కోసం జర్నీ స్టార్ట్ చేస్తుంది. సారా (నేసా ఫర్హాది) ఓ ఫారిన్ స్టూడెంట్. ఓ థీసిస్ పని మీద ఇండియా వస్తుంది. అక్కడ బాబు అనే డ్రైవర్ తో తెలియని తీరానికి ప్రయాణిస్తూ ఉంటుంది. ఉమా (ఉమా లింగయ్య), సొంత తండ్రే డబ్బు కోసం తనను అమ్మేయడంతో, ఏం చేయాలో పాలుపోక, ప్రాణాలు అరచేత పట్టుకొని అను-మొహినిల ప్రయాణంలో భాగస్వామి అవుతుంది. ఇలా రకరకాల కారణాలతో ప్రయాణం మొదలుపెట్టిన ఈ అయిదుగురు ఆడవాళ్ళు ఒకచోటకు చేరి ఒకరి నుంచి మరొకరు నేర్చుకున్న పాఠాలే “సీత ఆన్ ది రోడ్” కథాంశం.

నటీనటుల పనితీరు: ఒకరు బాగా చేశారు, మరొకరు బాగా చేయలేదు అని కాదు.. అందరూ తమ పాత్రల్లో జీవించారు. అయితే.. అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించింది మాత్రం కల్పిక గణేశ్. అను అనే ఆధునిక యువతి పాత్రలో ఒదిగిపోయింది. బుల్లెట్ గా ధైర్యంగా ఆమె సాగించే ప్రయాణం చాలామంది అమ్మాయిలకి స్పూర్తినిస్తుంది. ఓ సగటు మహిళ తన కలలను చంపుకొని నిర్జీవంగా ఎలా బ్రతికేస్తుంది ఆనేందుకు గాయత్రి గుప్తా పాత్ర ఒక చక్కని ఉదాహరణ. కళ్ళతో ఆమె పలికించిన భావాలు మనసుకు హత్తుకుంటాయి.

మొహినిగా ఖతేరా హకీమీ, ఉమాగా ఉమా లింగయ్యా అలరించారు. అయితే.. చివరిదాకా ఒక సస్పెన్స్ ను మైంటైన్ చేస్తూ కథకు, టైటిల్ కు జస్టిఫికేషన్ చేసిన అమ్మాయి నేసా ఫర్హాది. ఆమె క్యారెక్టర్ ఎలివేషన్ & డెప్త్ ను బాగా క్యారీ చేసింది.

సాంకేతికవర్గం పనితీరు: ఈ చిత్రానికి కథ-మాటలు-సంగీతం-ఒరిజినల్ బ్యాగ్రౌండ్ స్కోర్-ప్రొడక్షన్ ఎగ్జిక్యూషన్ – లొకేషన్స్ వంటి అన్నీ డిపార్ట్మెంట్స్ లో వర్క్ చేసిన దర్శకుడు ప్రణీత్ యారోన్ సినిమా మూల కథను “యాంగ్రి ఇండియన్ గాడేస్సెస్” (2015) అనే హాలీవుడ్ సినిమా నుంచి స్పూర్తి పొంది రాసుకున్నాడు. ఒక పర్ఫెక్ట్ రోడ్ ఫిలిమ్ ఎలా ఉంటుందో అలాగే తెరకెక్కించాడు. కథ రాసుకున్న విధానం బాగుంది. అయితే.. కథనంలో ఎమోషన్ మిస్ అయ్యింది. అందువల్ల ప్రేక్షకుడికి సినిమా చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆతృత కానీ, అసలే జరుతుంది అనే ఇంట్రెస్ట్ కానీ ఉండదు.

సొ బేసిగ్గా క్యారెక్టర్ ఆర్క్ అనేది మిస్ అయ్యింది పాత్రలకు. ఒక పాత్ర ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది ఆనేందుకు సరైన వివరణ ఇవ్వలేదు. క్యారెక్టర్ డెప్త్ ను ఆడియన్స్ కు అర్ధమయ్యేలా చెప్పడంలో విఫలమయ్యాడు ప్రణీత్. అన్నిటికీ మించి టెక్నికల్ గా చాలా ఇమ్మెచ్యుర్డ్ గా ఉంటుంది సినిమా. కాస్త మంచి కెమెరాతో సినిమా తీసి ఉంటే బాగుండేది. చాలా ఫ్రేమ్స్ లో క్లారిటీ ఉండదు. కొన్నిట్లో భావం ఉన్నా.. ఎమోషన్ కనిపించదు. బడ్జెట్ పరిమితులు కావచ్చు, కాన్సెప్ట్ కి తగ్గట్లుగా తీసి ఉండొచ్చు.. కానీ ప్రేక్షకులకు కావాల్సింది థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్. అది ఇవ్వడంలో విఫలమయ్యాడు ప్రణీత్.

విశ్లేషణ: ఒక మంచి కథను చెప్పాలంటే.. కథకు తగ్గ కథనం, ఆ కథనాన్ని అందంగా తెరకెక్కించగల కెమెరా వర్క్, సినిమాలో ప్రేక్షకుడ్ని లీనం చేయగల సంగీతం-నేపధ్య సంగీతం ఇలా చాలా ఉండాలి. “సీత ఆన్ ది రోడ్” కచ్చితంగా ఆలోజింపసేనే సినిమా. అయితే.. అర్ధవంతగా తీసి ఉంటే ఇంకాస్త ఇంపాక్ట్ ఫుల్ గా ఉండేది. ఒటీటీ రిలీజ్ కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు.

రేటింగ్: 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus