ఓ సినిమా అనౌన్స్‌మెంట్ అంటే ఎలా ఉండాలి? ఓ మంచి పోస్టర్, లేదంటే మోషన్ పోస్టర్ ఇంకా కొత్త ట్రెండ్‌లోకి వెళ్లాలి అంటే ఓ కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేస్తుంటారు. కానీ టాలీవుడ్‌లో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థకు చెందిన సినిమాలు వరుసగా సాదాసీదా అనౌన్స్ అయిపోతున్నాయి. పోనీ అవేమన్నా చిన్న సినిమాలా అంటే పరిశ్రమలోని అగ్ర హీరోల సినిమాలు. ఒక సినిమా అలా అనౌన్స్ అయిపోయింది అంటే ఓకే అనుకోవచ్చు. వరుసగా రెండు పెద్ద సినిమాలు అలానే అనౌన్స్ అయిపోయాయి.
ఆ హీరోల పేర్లు చెబితే.. ఆ నిర్మాణ సంస్థ పేరు మీరే చెప్పేస్తారు. మొదటి హీరో తారక్ (Jr NTR) కాగా, రెండో హీరో సూర్య (Suriya). ఇప్పుడు బ్యానర్ పేరు సితార ఎంటర్‌టైన్మెంట్స్ (Sithara Entertainment) అని మీరే చెప్పేస్తారు కూడా. ఇంత పెద్ద హీరోల సినిమాలు ఏదో ఒక సినిమా ప్రీరిలీజ్ / సక్సెస్ ఈవెంట్‌లో సాదాసీదాగా అనౌన్స్ అవ్వడం అంటే ఆ హీరోల ఫ్యాన్స్ ఏదో చిన్న వెలితిగానే ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంట వాళ్ల ఊహలు భారీగా ఉంటాయి, ఉన్నాయి కాబట్టి.
మొన్నటికి మొన్న ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) సినిమా సక్సెస్ మీట్ వేదికపై తారక్ తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ‘మ్యాడ్’ సినిమాల నిర్మాత నాగవంశీతో (Suryadevara Naga Vamsi) త్వరలో సినిమా ఉంటుంది అని చెప్పాడు. అది నెల్సన్ దిలీప్ కుమార్‌తోనే ఉంటుంది అని చెప్పకపోయినా ఆ సినిమా అదే అని తేలుతోంది. ఈ సినిమా కోసం నెల్సన్ దిలీప్ కుమార్‌తో ‘జైలర్ 2’ లాంటి అనౌన్స్‌మెంట్ వీడియో చేయిస్తారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశించారు. ఒకవేళ ఆ వీడియో ఇప్పుడు వచ్చినా అనౌన్స్‌మెంట్ మజా పోయింది.
ఇక నిన్నటికి నిన్న సూర్య తన తొలి తెలుగు స్ట్రయిట్ సినిమాను అనౌన్స్ చేసేశాడు. వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో రూపొందనున్న ఆ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainment) సంస్థ నిర్మించనున్నట్లు ‘రెట్రో’(Retro) సినిమా ప్రీరిలీజ్ వేడుకలో అధికారికంగా ప్రకటించాడు. మేలోనే చిత్రీకరణ ప్రారంభం అవుతుందని కూడా చెప్పాడు. దీంతో ఈ సినిమా హైప్ కూడా దాదాపు పోయింది. సినిమాల లీకుల విషయంలో బాధపడుతున్న నిర్మాతలు ఇలా ప్రాజెక్ట్‌ల లీకుల విషయంలో ఏమన్నా ఆలోచన చేస్తారేమో చూడాలి.