‘హరి హర వీరమల్లు’ సినిమా ఫలితానికి అందులోని కొన్ని సీన్స్ కూడా ఓ కారణమని చెప్పొచ్చు. కొన్ని మితిమీరిన లిబర్టీలు, కొన్ని అసాధ్యమైన సన్నివేశాలు, కొన్ని ఇబ్బందికర గ్రాఫిక్స్ ఉన్న సీన్స్ సినిమా మీద భారీగా ప్రభావం చూపించాయి అని సినిమా రిలీజ్ సమయంలో విశ్లేషకులు, నెటిజన్లు చెప్పారు. ఇప్పుడు సినిమా ఓటటీలోకి వచ్చేసరికి వాటిని తొలగించేశారు అని సమాచారం. సినిమాను మరోసారి ఎడిట్ చేసి సుమారు 15 నిమిషాలు లేపేశారు అని తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ – క్రిష్ – జ్యోతి కృష్ణ – నిధి అగర్వాల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమా ఈ రోజు నుండి ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పవన్ కల్యాణ్ గుర్రపు స్వారీ సన్నివేశం, బాణం గురిపెట్టే సన్నివేశాల విషయంలో విమర్శలు రావడంతో చిన్నపాటి మార్పులు చేసి థియేటర్లలో చూపించారు. ఇప్పుడు ఓటీటీలో ఆ సన్నివేశాలను పూర్తిగా తీసేశారని తెలుస్తోంది. అలాగే క్లైమాక్స్‌లోనూ కొన్ని మార్పులు చేసినట్లు భోగట్టా. ‘అసుర హననం..’ పాట తర్వాత సినిమా సీక్వెల్ అనౌన్స్ చేసేశారట.
ఇక క్లైమాక్స్‌లో వచ్చే బాబీ డియోల్ డైలాగ్‌లు, యాక్షన్ సన్నివేశాలను కూడా తీసేశారని అంటున్నారు. అలా మొత్తంగా 15 నిమిషాల సినిమా కోతకు గురైందట. తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లో సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. 16వ శతాబ్దంలో మొదలయ్యే కథ ‘హరి హర వీరమల్లు’. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు (బాబీ డియోల్) ఢిల్లీ పీఠంపై కూర్చొని దురాగతాల పాలన కొనసాగిస్తుంటాడు. మత మార్పిడి కోసం ప్రజలని బలవంతం చేస్తుంటాడు. దానికి ఒప్పుకోకుండా హిందువులుగానే జీవించేవాళ్ల నుంచి జిజియా పన్ను వసూలు చేస్తుంటాడు. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా పట్టించుకోకుండా దేశ సంపదని ఆంగ్లేయులు దోచుకెళ్తుంటారు. వాళ్లకు అనుకూలంగా రాజులు పనిచేస్తూ ఉంటారు. వాళ్లందరికీ వీరమల్లు (పవన్ కల్యాణ్) అంటే హడల్. ఆ వీరమల్లు కథనే ఈ సినిమా.