‘నీ ప్రేమకై’ ‘ధమ్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనప్పటికీ… ‘7/జి బృందావన కాలనీ’ చిత్రంతోనే క్రేజీ హీరోయిన్ గా మారింది సోనియా అగర్వాల్. ఆ తరువాత ఆమెకు వరుస ఆఫర్లు దక్కాయి కానీ..ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమెను దర్శకనిర్మాతలు పెద్దగా పట్టించుకోలేదు. తరువాత ‘7/జి’ దర్శకుడు సెల్వ రాఘవన్ నే ఈమె పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల పాటు వీరిద్దరూ బాగానే కలిసున్నారు కానీ.. ఆ తరువాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అటు తరువాత కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన సోనియా.. ‘టెంపర్’ ‘విన్నర్’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది.
ఓ విధంగా ‘విన్నర్’ చిత్రంలో అయితే ఈమె సాయి తేజ్ కు తల్లి పాత్రనే పోషించిందనే చెప్పాలి. దాంతో దర్శకనిర్మాతలు ఈమెను తల్లి పాత్రల కోసం సంప్రదిస్తున్నారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనియా ఈ విషయం పై స్పందించి దర్శకనిర్మాతల పై అసహనం వ్యక్తం చేసింది. సోనియా అగర్వాల్ మాట్లాడుతూ.. “నన్ను ఎక్కువగా అమ్మ పాత్రల్లోనే నటించమని దర్శకనిర్మాతలు అడుగుతుండటం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. నేను, నయనతార, త్రిష… ముగ్గురం ఒకేసారి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాము. కానీ నన్ను మాత్రమే అమ్మ పాత్రల్లో నటించమని కోరుతున్నారు.
వాళ్లను ఎందుకు అడగడం లేదు? నేను ఇప్పటికీ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాను. హీరోయిన్ పాత్రలు చేసేంత గ్లామర్ నాలో ఉంది. రాధిక, ఖుష్బూల వంటి వారి వయసు వచ్చిన తర్వాత నన్ను అమ్మ పాత్రల్లో నటించమని అడగండి.అప్పుడు కచ్చితంగా నటిస్తాను.అంతే కానీ ఇప్పట్లో నేను అమ్మ పాత్రల్లో నటించే సమస్యే లేదు” అంటూ చెప్పుకొచ్చింది.