దివంగత ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubrahmanyam) ఇంటిని వేద పాఠశాల చేస్తామంటూ నాలుగేళ్ల క్రితం చెప్పారు. ఈ మేరకు నెల్లూరులోని తిప్పరాజువారి వీధిలోని బాలు నివాసంలో వేదపాఠశాల నిర్వహణకు అప్పట్లో కంచిపీఠానికి అప్పగించారు కూడా. ఫిబ్రవరి 11, 2020న జరిగిన ఈ అప్పగింత ఇప్పుడు నిరుపయోగంగా మారిందా? అక్కడి పరిస్థితులు అలానే ఉన్నాయి అని ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది. నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ‘ఇక్కడ ‘వేద – నాద’ ప్రచారం కొనసాగిస్తాం’ అని కంచి పీఠాధిపతి అప్పట్లో చెప్పారు కూడా.
ఈ నేపథ్యంలో కంచి పీఠం కోరిక మేరకు రూ.10 లక్షలకుపైగా వెచ్చించి ఎస్పీ బాలు నివాసంలో అవసరమైన వసతులు కల్పించారు. ఇప్పుడు అంటే ఐదేళ్లు పూర్తవుతున్నా ఆ ఇంటిని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. దీంతో ఎస్పీ బాలు ఇంటిని తిరిగి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలనే వాదన వినిపిస్తోంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 202లో కొవిడ్‌తో మృతిచెందిన విషయం తెలిసిందే. అప్పుడే సుమారు రూ.కోటి విలువచేసే ఆ ఇంటిని సంగీత సేవ కోసం కంచి పీఠానికి అందించారు.
కానీ ఇప్పుడు చూస్తే ఆ ఇంటిని వినియోగంలోకి తీసుకురావడంలో కంచి పీఠం విఫలమైంది. ఈ క్రమంలో బాలు కుటుంబం నివసించిన ఈ చోటును ఎవరూ పట్టించుకోకపోవడంతో అభిమానులు ఆవేదన చెందుతున్నారు. అయితే కంచి మఠం వాదన వేరేలా ఉంది. బాలు నివాసంలో తొలుత పది మంది విద్యార్థులతో వేద పాఠశాలను ప్రారంభించినా వసతులు లేకపోవడంతో నిర్వహించలేకపోయామని చెబుతుననారు.
మేడ మీద రేకుల షెడ్డులో పిల్లలు ఇబ్బంది పడ్డారని, దీంతో వేరే పాఠశాలకు పంపించామని చెబుతున్నారు. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఏమన్నా ఆలోచన చేసి తిరిగి పాఠశాలను తెరిపించే ప్రయత్నం చేస్తుందేమో చూడాలి.