పవన్ కల్యాణ్ – సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘ఓజీ’. ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్‌లో టికెట్‌లకు అదనపు ధరలు, ప్రత్యేక షోలు పడతాయా లేవా అనే డౌట్ అయితే ఎవరికీ లేదు. తెలంగాణలో ఈ విషయంలో కొన్ని డౌట్స్ ఉన్నా.. ఏపీలో అయితే ఎవరికీ ఆ అనుమానం లేదు. అనుకున్నట్లుగానే సినిమాకు సంబంధించి జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. సెప్టెంబరు 25న ప్రత్యేక ప్రీమియర్‌తోపాటు.. టికెట్ ధరల పెంపు, షో పెంపునకు కూడా అనుమతిచ్చింది.
చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు ‘ఓజీ’కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెనిఫిట్ షో ఆప్షన్ ఇచ్చింది. 25న రాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షో పర్మిషన్ ఇచ్చింది. దీనికి టికెట్ ధర రూ.1000 (జీఎస్టీతో కలిపి)గా నిర్ణయించింది. ఇక సినిమా విడుదలయ్యే రోజు నుండి అక్టోబరు 4 వరకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.125 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 (జీఎస్టీ సహా) వరకు అదనంగా పెంచుకొనేందుకు వీలు కల్పించింది. అలాగే ఈ రోజుల్లో రోజుకు గరిష్ఠంగా ఐదు షోలు మాత్రమే వేసుకునే వీలు ఉంది.
ఇక టికెట్ ధరల పెంపు అనుమతిపై ‘ఓజీ’ సినిమా నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైనర్స్ సోషల్ మీడియాలో ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌కు థాంక్స్ చెప్పింది. ఈ సినిమాకు అమెరికాలో 24వ తేదీ నుండి ప్రీమియర్ షోలు షెడ్యూల్ చేశారు. ఇక తెలంగాణలో ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో చూడాలి. అయితే టికెట్ రేటు పెంపు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. బెనిఫిట్ షో విషయంలోనే చర్చలు జరుగుతున్నాయట. దీనికి కారణం ‘పుష్ప: ది రూల్’ విడుదల సమయంలో జరిగిన ఘటనే.
ఇక ఈ సినిమా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్‌ను 19న ప్రారంభిస్తారని సమాచారం. అలాగే 20వ తేదీన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో భారీ స్థాయిలో నిర్వహిస్తారని సమాచారం.