Sholay: ‘షోలే’ విజయం ఎవరూ ఊహించలేదు.. రికార్డులు అస్సలు ఊహించలేదు!

ఇండియన్‌ సినిమాలో ‘షోలే’ గురించి ఎన్ని ఉపమానాలు చెప్పినా తక్కువే. ఎంత పొగిడినా తక్కువే. ఆ సినిమా స్థాయి ఏంటో, సత్తా ఏంటో చెప్పాలంటే ‘‘షోలే’ వచ్చి 50 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ రోజూ ఏదో సందర్భంలో ఆ సినిమా గురించి దేశ ప్రజలు మాట్లాడుతున్నారు. సినిమాల్లోనేకాదు, రాజకీయాలు, వ్యాపారాలు, సరదాలు ఇలా చాలా వాటిల్లో ‘షోలే’ మనకు రెగ్యులర్‌ టాపిక్‌. అలాంటి సినిమా స్పెషల్‌ డేనాడు స్పెషల్‌ మాటలు కొన్ని చెప్పుకోవాలి కదా. అందుకే ఈ ప్రయత్నం. ఈ క్రమంలో సినిమా ప్రారంభం, ముగింపు కూడా చెప్పుకోవాలి.

Sholay

గోపాల్‌దాస్‌ పరమానంద్‌ సిప్పీ ఇలా అంటే ఇప్పటివాళ్లకే కాదు.. అప్పటివాళ్లకు కూడా పెద్దగా తెలియకపోవచ్చు. అందుకే జి.పి.సిప్పీ అని మాట్లాడుకుందాం. ఎన్నో వ్యాపారాలు చేసి చివరకు సినిమా నిర్మాణంలోకి వచ్చారు. తొలుత చిన్న సినిమాలు చేశారు. కొన్నాళ్ల తర్వాత కుమారుడు రమేశ్‌ సిప్పీ దర్శకత్వంలో ధర్మేంద్ర, సంజీవ్‌ కుమార్, హేమామాలినితో ‘సీతా ఔర్‌ గీతా’ అనే సినిమాను 1972లో తెరకెక్కించారు. ఆ సినిమా భారీ విజయమే ‘షోలే’కి కారణం. ఎందుకంటే ఆ లాభాలతోనే ఇంత పెద్ద సినిమా మొదలైంది.

ధర్మేంద్ర, అమితాబ్‌ బచ్చన్‌, సంజీవ్‌ కుమార్‌, హేమ మాలిని, జయ బాధురి, అంజాద్‌ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో ‘షోలే’ తెరకెక్కింది. సలీం – జావేద్‌ కథతో మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ సినిమాకు ఆ రోజుల్లోనే రూ.3 కోట్లు పెట్టారట. దానికి గాను టీమ్‌కి రూ.35 కోట్లు వసూళ్లు వచ్చాయి. నెంబర్లే విజయం అనుకుంటున్న ఈ రోజుల్లో ఈ లాభం చూస్తే అర్థమవుతుంది సినిమా విజయం. ఈ సినిమాకు రామ్‌గఢ్‌ అనే ప్రాంతం చాలా కీలకం. సినిమా ఎక్కువ శాతం అక్కడే చిత్రీకరించారు కూడా.

* బెంగళూరు సమీపంలో రామ్‌నగర గ్రామాన్ని ‘షోలే’ కోసం రామ్‌గఢ్‌గా మార్చారు. ‘గబ్బర్‌ సింగ్‌’గా మోస్ట్‌ ఫేమస్‌ అయిపోయిన అంజాద్‌ ఖాన్‌ను పరిచయ చిత్రమిదే. జపనీస్‌ సినిమా ‘సెవన్‌ సమురాయ్‌’ ఈ సినిమాకు ఓ స్ఫూర్తి.

* ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే అమితాబ్ బచ్చన్‌, జయ భాదురి వివాహం జరిగింది. ఆ తర్వాత ధర్మేంద్ర, హేమామాలిని కూడా పెళ్లి చేసుకున్నారు.

* సినిమా వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జూన్‌లో ఇటలీలోని బలోనీ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లోని ప్రఖ్యాత ఓపెన్‌ హాల్‌లో ‘షోలే’ సినిమాను ప్రదర్శించారు. ఇక సెప్టెంబరు 6న టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లోనూ ఈ సినిమాను ప్రదర్శిస్తారు.

* ఈ సినిమాకు మొదట ఫెయిల్యూర్‌ టాక్‌ వచ్చింది. దీంతో భారీ బడ్జెట్‌, భారీ కాస్టింగ్‌తో చేసినా ఇలాంటి ఫలితమా అనుకున్నారంతా. కానీ ఆ తర్వాత నెలల తరబడి హౌస్‌ఫుల్‌ బోర్డులు థియేటర్ల ముందు కనిపించాయి.

* ముంబయిలోని ప్రఖ్యాత మినర్వా థియేటర్‌లో ఈ సినిమాను వరుసగా 5 ఏళ్లు ప్రదర్శించారు. ఈ క్రమంలో 1943లో వచ్చిన అశోక్‌ కుమార్‌ ‘కిస్మత్‌’ సినిమా రికార్డును ‘షోలే’ చిత్రం అధిగమించింది. కోల్‌కతాలోని రాక్సీ థియేటరులో ‘కిస్మత్‌’ సినిమా 192 వారాలు ఆడింది.

* ఇక ఈ సినిమా ఆ రోజుల్లో 100 థియేటర్లలో 175 రోజులు ఆడింది. భారతదేశ చరిత్రలో తొలి 70 ఎంఎం స్టీరియోఫోనిక్‌ సౌండ్‌ ఫిల్మ్‌ ఇది. ఈ సినిమాలో అమితాబ్‌ నటించిన జయ్‌దేవ్‌పాత్ర తొలుత శత్రుఘ్న సిన్హాకు ఆఫర్‌ చేశారు. కానీ ఆయన చేయలేదు.

* ఫుల్‌ రన్‌లో సినిమాకు 25 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ స్థాయిలో టికెట్‌లు చెల్లిన సినిమా ఇదొక్కటే. 1995లో ఈ సినిమా దూరదర్శన్‌లో టెలీకాస్ట్‌ చేసినప్పుడు టీఆర్పీ రేటింగ్‌ 76 వచ్చింది.

* ఈ సినిమా విశేషాలు తెలియజేస్తూ ‘షోలే: ఏ కల్చరల్‌ రీడింగ్‌’, ‘షోలే: ది మేకింగ్‌ ఆఫ్ ఏ క్లాసిక్‌’ లాంటి పుస్తకాలు వచ్చాయి. ఈ సినిమాను తొలిసారి రీరిలీజ్‌ చేసినప్పుడు రూ.13 కోట్లు వసూలు చేసింది.

* ఈ సినిమాలో నటించినందుకు గాను ధర్మేంద్రకు రూ.1.5 లక్షలు. సంజీవ్‌ కుమార్‌కు రూ.1.25 లక్షలు, అమితాబ్‌ బచ్చన్‌కు రూ. లక్ష ఇచ్చారట. ఇక సినిమాను పూర్తి చేయడానికి రెండున్నరేళ్లు పట్టిందట.

తెలివి తక్కువగా మాట్లాడాను.. క్షమాపణలు కోరిన మృణాల్ ఠాకూర్

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus