Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?
- April 28, 2026 / 05:26 PM ISTByFilmy Focus Desk
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆడుతున్నంతసేపే గుర్తుంటాయి. ఇంకొన్ని సినిమాలు రిలీజ్ అయ్యి ఏళ్లు కాదు దశాబ్దాలు గడుస్తున్నా గుర్తుంటాయి. టీవీలో వచ్చినా, యూట్యూబ్‌లో ఓ సీన్ కనిపించినా, ఓటీటీలో స్క్రోల్ చేస్తున్నప్పుడు కనిపించినా.. ఆటోమేటిగ్గా అలా ఉండిపోతుంటాం. కచ్చితంగా ఆ సినిమా ఆ హీరో కెరీర్లో మైలు రాయి అయి ఉంటుంది. హీరో ఇమేజ్‌ను అమాంతం మార్చేసేది అయినా అయి ఉంటుంది. లేదంటే ఇండస్ట్రీ రికార్డులను పూర్తిగా నేలమట్టం చేసి కొత్తగా నెలకొల్పింది అయి ఉంటుంది. ఈ ఇంట్రో పక్కాగా సరిపోయే సినిమాల లిస్ట్ రాస్తే వాటిలో కచ్చితంగా నిలిచే సినిమా ‘పోకిరి’.
Pokiri
మహేష్‌బాబు – పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా థియేటర్లకు వచ్చి చూసిన అందరికీ ఆనందంతో దిమ్మ తిరిగిపోయేలా చేసి 20 ఏళ్లు అయిపోయింది. అవును ‘పోకిరి’ పండుగాడికి 20 ఏళ్లు. నిజానికి ఈ సినిమా ఆ స్థాయి విజయం అందుకోవడానికి కేవలం మహేష్‌బాబు, పూరి జగన్నాథ్ మ్యాజిక్‌కు ఇలియానా అందం, మణిశర్మ మ్యూజిక్, కామెడీ ట్రాక్‌లు కూడా యాడ్ ఆన్స్ అని చెప్పొచ్చు.
* ఈ సినిమా కథను ‘బద్రి’ సినిమా టైమ్‌లోనే పవన్ కల్యాణ్‌కు చెప్పారు. కానీ ఆయన చేయలేదు. ఆ తర్వాత సినిమా కథ రవితేజ దగ్గరకు వెళ్లింది.
* ‘ఉత్తమ్ సింగ్ – సన్నాఫ్ సూర్యనారాయణ’ పేరుతో ఈ సినిమా తెరకెక్కించాలని పూరి ప్రయత్నాలు చేశారు. హీరోయిన్‌గా త్రిషను అనుకున్నారు. కానీ వివిధ కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు.

* ఈ స్టోరీ అటు తిరిగి ఇటు తిరిగి మహేష్ బాబు దగ్గరకు వెళ్లింది. కథ విన్న మహేష్ ఓకే చెప్పి డేట్స్ లాక్ చేశాడు. హీరోయిన్‌గా కంగనా రనౌత్‌ను అనుకున్నారు. బాలీవుడ్ ఆఫర్ ఉందని ఆమె వెళ్లిపోయింది. దీంతో సినిమాలోకి గోవా భామ ఇలియానా సినిమాలోకి ఎంటర్ అయింది.
* ‘పోకిరి’ సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్, పాటలు విషయంలో మణిశర్మ కెరీర్ బెస్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. మెలోడీ, మాస్, ఐటెమ్ సాంగ్ ఇలా ప్రతి సెక్షన్ టచ్ చేస్తూ వావ్ అనిపించారు.
* ‘పోకిరి’ సినిమా 200 సెంటర్లలో 100 రోజులు ఆడింది. 63 కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శించారు. కర్నూలులో 500 రోజులు కూడా ఆడింది.
* సుమారు రూ.12 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ. 66 కోట్ల గ్రాస్, రూ.44 కోట్ల షేర్ వసూలు చేసింది.
* ఐఫా ఫిల్మ్ ఫెస్టివల్ – 2006లో భాగంగా దుబాయిలో ప్రదర్శించిన 14 సినిమాల్లో ‘పోకిరి’ కూడా ఒకటి కావడం విశేషం.
* ఈ సినిమాలోనే కాదు మహేష్‌బాబు కెరీర్‌లోనే బెస్ట్ మెలోడీగా నిలిచిన ‘గల గల పారుతున్న గోదారిలా’ పాట ఆయన తండ్రి కృష్ణ 1974లో నటించిన ‘గౌరి’ సినిమాలోని పాటకు రీమిక్స్ అనే విషయం తెలిసిందే.

* ఈ సినిమా క్లైమాక్స్, రెండు పాటలను వరుసగా 38 రోజులు షూటింగ్ చేసి పూర్తి చేశారట. ఈ క్రమంలో మహేష్ వెన్నునొప్పితో బాధపడి వైద్యం కూడా తీసుకోవాల్సి వచ్చింది.
* సినిమా క్లైమాక్స్‌లో ఓ వాటర్ టబ్‌లో మహేష్ తల పెట్టే సీన్ ఉంటుంది. ఆ సీన్ చేసిన రెండు సెకన్ల తర్వాత షూటింగ్ క్రూ ఒకరు తల పెట్టారట. ఆ సమయంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మృతి చెందాడు. అలా మహేష్‌కు ప్రాణాపాయం తప్పింది.
* ఈ సినిమా ఓ సీన్‌లో ఇలియానా టీ షర్ట్ మీద I May Not Be Perfect But Parts of Me Are Pretty Awesome అని ఉంటుంది. ఆ కోట్ ఉన్న మరో టీషర్ట్ పూరి నిర్మాతగా వ్యవహరించిన ‘హలో ప్రేమిస్తారా’ సినిమాలో హీరోయిన్ వేసుకుంటుంది. ఆ సినిమాలో పూరి సోదరుడు సాయి రామ్ శంకర్ హీరో.
* ఇక అవార్డుల విషయానికొస్తే.. బెస్ట్ పాపులర్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఎడిటర్ (మార్తాండ్ కె వెంకటేశ్), బెస్ట్ ఫైట్ మాస్టర్ (విజయన్) నంది అవార్డులు అందుకున్నారు.
* బెస్ట్ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పి.రవి శంకర్, బెస్ట్ ఆడియోగ్రాఫర్‌గా రాధా కృష్ణ ఈ సినిమాతో నంది పురస్కారం దక్కించుకున్నారు.
* నంది పురస్కారాలతోపాటు ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డుల్లో బెస్ట్ డైరెక్టర్ (పూరి జగన్నాథ్), బెస్ట్ యాక్టర్ (మహేష్ బాబు) పురస్కారాలు కూడా లభించాయి.
* ఇక రీరిలీజ్ సమయంలో కూడా సినిమా భారీ విజయాల్నే అందుకుంది. నాలుగేళ్ల క్రితం తొలిసారి రీరిలీజ్ చేసినప్పుడు రూ.1.7 కోట్ల వరకు వసూలు చేసిందీ సినిమా.
* ఈ కథ ఆ తర్వాత తమిళంలోకి అదే పేరుతో విజయ్ హీరోగా రీమేక్ అయింది. బాలీవుడ్లో సల్మాన్ భాయ్ హీరోగా ‘వాంటెడ్’ పేరుతో ప్రభుదేవా తెరకెక్కించారు. కన్నడలో దర్శన్ హీరోగా ‘పొరికి’ పేరుతో రీమేక్ చేశారు. మూడు చోట్లా భారీ విజయం దక్కింది.
ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్ రియాక్షన్ వైరల్















