“బ్రహ్మోత్సవం” డిజాస్టర్ రిజల్ట్ అనంతరం కొన్నాళ్లపాటు గ్యాప్ తోపాటు చాలా జాగ్రత్తలు తీసుకొని మహేష్ బాబు సెలక్ట్ చేసుకున్న స్క్రిప్ట్ “స్పైడర్”. “కత్తి” లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కావడం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపొందడంతో.. మహేష్ బాబు హిట్ కొట్టడం ఖాయమని ఆయన అభిమానులతోపాటు తెలుగు సినిమా ట్రేడ్ పండిట్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. మరి అంత భారీ అంచనాల నడుమ విడుదలైన “స్పైడర్” ఏ రేంజ్ లో ఉందో, ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ : శివ (మహేష్ బాబు) ఇంటెలిజన్స్ బ్యూరోలో 40 వేళా రూపాయల జీతానికి పని చేసే జూనియర్ సబ్ ఆర్డినేటర్. తనకు అప్పగించిన బాధ్యతలను కాక తనకు అందుబాటులో ఉన్న వనరులను (టెక్నాలజీ)ని వినియోగించుకొని ప్రజలకు సహాయపడాలనుకొంటాడు. అందుకోసం తానే స్వయంగా ఒక సాఫ్ట్ వేర్ ను రెడీ చేసి.. అపాయంలో ఉన్నవారిని రక్షిస్తుంటాడు. అలా తన వృత్తిలో భాగంగా ఒకరోజు రాత్రి ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని భయపడుతున్నానంటూ తన స్నేహితురాలికి ఫోన్ లో చెప్పిన మాట విని.. ఆమెకు ధైర్యం చెప్పడం కోసం తన స్నేహితురాలైన ఓ లేడీ కానిస్టేబుల్ ను అక్కడికి పంపిస్తాడు. కట్ చేస్తే.. మరుసటిరోజు ఆ ఇంటర్ విద్యార్థినితోపాటు లేడీ కానిస్టేబుల్ బాడీ పార్ట్స్ ముక్కలుముక్కలుగా నరికివేయబడి నడిరోడ్డులో కనిపిస్తాయి. ఒక్కసారిగా హైదరాబాద్ మొత్తం భయంతో వణుకుతుంది.
ఈ దారుణమైన హత్యల వెనుక ఉన్న కిరాతకుడ్ని పట్టుకోవాలన్న ధ్యేయంతో ఇన్వెస్టిగేషన్ మొదలెట్టిన శివ అండ్ టీమ్ కు ఆ హత్యల వెనుక ఉన్నది భైరవుడు (ఎస్..జె.సూర్య) అనే ఓ సైకో అని తెలుసుకొంటారు. అలాగే.. అతడు ఈ వరుస హత్యలు ఎందుకు చేయడానికి వెనుక ఉన్న కారణం కూడా ఛేదించి, భైరవుడ్ని ఓ మాస్టర్ ప్లాన్ ప్రకారం పెట్టుకొంటారు. ఆ తర్వాత శివ అండ్ టీమ్ భైరవుడ్ని ఇంటరాగేట్ చేసి అతడు పూనుకొన్న ఇంకొన్ని దారుణాలను ఏ విధంగా ఆపారు? అందుకోసం వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలేమిటి? అనేది “స్పైడర్” ఇతివృత్తం.
నటీనటుల పనితీరు : మహేష్ బాబుది చాలా రెగ్యులర్ రోల్, ఇదివరకు “ఆగడు, దూకుడు” సినిమాల్లో చేసిన పోలీస్ పాత్రకే “రయీస్” సినిమాలోని నవాజుద్దీన్ సిద్దికీ క్యారెక్టరైజేషన్ ను సింక్ చేసి స్క్రీన్ పై ప్రెజంట్ చేసాడు. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం “నటుడు” అనిపించుకున్నాడు. మహేష్ బాబుని మించిన అద్భుతమైన పాత్రలో అదరహో అనిపించే నటనతో విశేషంగా ఆకట్టుకున్నాడు ఎస్.జె.సూర్య. అతడి పాత్ర “డార్క్ నైట్” సినిమాలోని జోకర్ క్యారెక్టరైజేషన్ ను తలపించినప్పటికీ.. ఎదుటివారి కష్టాన్ని-బాధని ఆస్వాదించే శాడిస్టిక్ నేచర్ ఉన్న సైకోగా ఎస్.జె.సూర్య జీవించేసాడు. ముఖ్యంగా ఇంటర్వల్ బ్లాక్ లో మెట్రో పిల్లర్ దగ్గర అందరూ ఏడుస్తూ ఉంటే వారి ఏడుపులు చూసి సంతోషించే ఎస్.జె.సూర్యను చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. అతడి క్యారెక్టర్ మాత్రమే కాదు.. అతడి వింత బిహేవియర్ కు కారణాన్ని చిన్నప్పటి ఎపిసోడ్స్ తో ఎస్టాబ్లిష్ చేసిన విధానం కూడా అదిరింది. బేసిక్ గానే కమర్షియల్ హీరోయిన్ అయిన రకుల్ ఈ సినిమాలో నటనకు గానీ అందాల కనువిందుకు గానీ ఎలాంటి స్కోప్ లేని క్యారెక్టర్ చేసింది. అమ్మడు సినిమా ప్రమోషన్స్ కు ఎందుకు కాస్త దూరంగా ఉంది అనే విషయం సినిమా చుస్తే అర్ధమవుతుంది. అత్యంత పేలవమైన, కథకు ఎలాంటి ఉపయోగం లేని పాత్ర ఆమెది. ప్రియదర్శి, ఆర్జే బాలాజీ, భరత్ వంటి ఆర్టిస్టులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు : హారిస్ జైరాజ్ ట్యూన్స్ కంటే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎలక్ట్రానిక్ మ్యూజిక్ థీమ్ అలరిస్తుంది. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ వర్క్ ను విశ్లేషించే అనుభవం లేకున్నప్పటికీ.. అప్పట్లో “దళపతి, రోజా” లాంటి విజువల్ వండర్స్ ను తెరకెక్కించిన టెక్నీషియనేనా ఈ సినిమాకి వర్క్ చేసింది అన్న అనుమానం రాకమానదు. ఎడిటింగ్ & గ్రాఫిక్స్ వర్క్ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్స్. ఉన్నట్టుండి పాట రావడం వరకు ఒకే కానీ, పాట పూర్తిగా ఎండ్ అవ్వకముందే కంటిన్యుటీ లేకుండా నెక్స్ట్ సీన్ ను ఎటాచ్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో ఎడిటర్ కె తెలియాలి. ఇక వి.ఎఫ్.ఎక్స్ వర్క్.. “అద్భుతంగా ఉంటుంది, అదరగొడుతుంది” అంటూ సినిమా టీమ్ మొత్తం చాలా గొప్పగా చెప్పుకొన్న అంత గొప్పగా లేవు.
ప్రతి సినిమాలోనూ ఒక సామాజిక సమస్యను చూపుతూ.. అందుకు తగ్గ మెసేజ్ ను కూడా అందించే మురుగదాస్ “స్పైడర్” కథ కథనాలను ఇంత పేలవంగా ఎందుకు రాసుకున్నాడు అనేది ప్రస్నార్ధకం. మురుగ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ అయిన “7th సెన్స్” కోసం చేసిన రీసెర్చ్ లో కనీసం పావు వంతు కూడా “స్పైడర్”లో హీరో క్యారెక్టరైజేషన్, ఇంటెలిజెన్స్ బ్యూరో వర్కింగ్ నేచర్ ను జనాలకు అర్ధమయ్యేలా చెప్పడం కోసం చేయలేదు. కాకపొతే.. తనకున్న అనుభవంతో రాసుకున్న “లేడీస్ స్పై ఎపిసోడ్” ఒక్కటే కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మిగతా ఎపిసోడ్స్ అన్నీ సహజత్వానికి ఏమాత్రం దగ్గరగా లేకుండా ఉంటాయి. అందువల్ల మురుగదాస్ మునుపటి సినిమాలు చూసి అదే స్థాయిలో “స్పైడర్” కూడా ఉండొచ్చేమో అనుకోని థియేటర్లకు వచ్చిన వారు మాత్రం తీవ్రంగా నిరాశ చెందుతారు.
విశ్లేషణ : చిత్రబృందం విపరీతంగా ప్రమోట్ చేసినట్లు “స్పైడర్” ఒక అద్భుతమైన స్పై థ్రిల్లర్ ఏమీ కాదు. విలన్ స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్, “లేడీస్ స్పై ఎపిసోడ్” మినహా ఆకట్టుకొనే లేదా అలరించే అంశాలు ఏవీ లేని “స్పైడర్” సినిమాను మహేష్ అభిమానుల వరకు కాస్త పర్లేదు కానీ.. సగటు సినిమా అభిమానులు 145 నిమిషాల పాటు థియేటర్లలో కూర్చొని చూడడం కష్టమేనండోయ్.