సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ప్రారంభంలో .. ఆయన తండ్రి కృష్ణ జోక్యం,జోస్యం ఎక్కువగా ఉండేవి. మహేష్ బాబు ఎంపిక చేసుకునే కథ జనాలకు ఎంత వరకు రీచ్ అవుతుంది? సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే అది ఎంత వరకు కలెక్ట్ చేస్తుంది వంటి విషయాలు ఆయన ఈజీగా అంచనా వేసేవారు. ‘టక్కరి దొంగ’ సినిమా చేయాలని జయంత్- మహేష్ ఫిక్స్ అయినప్పుడు.. ముందుగా కృష్ణ వద్దని చెప్పారట.
‘మంచి లవ్ స్టోరీ చేయండి.. ఈ కౌబాయ్ బ్యాక్ డ్రాప్ సినిమా అంటే రిస్క్ ఎక్కువ’ అని ముందుగానే హెచ్చరించారట కృష్ణ. ఈ విషయాన్ని దర్శకుడు జయంత్ సి పరాన్జీ ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు. ఆ తర్వాత ఆయన చెప్పిందే నిజం అయ్యింది. ‘టక్కరి దొంగ’ ప్లాప్ అయ్యింది. నిర్మాతకు నష్టాలు మిగిల్చింది. సరిగ్గా ఇలానే మహేష్ బాబు మరో సినిమా రిజల్ట్ ను కూడా కృష్ణ ముందుగానే అంచనా వేశారట. అదే ‘నాని’ సినిమా.
‘ఖుషి’ తర్వాత ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించిన తెలుగు సినిమా ఇది. మహేష్ సోదరి మంజుల ఈ చిత్రాన్ని నిర్మించారు. 2004 మే 14న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మొదటి షో చూసిన వెంటనే కృష్ణ.. మహేష్ తో ‘ఈ సినిమా కనుక హిట్ అయితే నువ్వు స్టార్ కాదు’ అని అన్నారట. ప్రయోగాత్మక సినిమాలు స్టార్ హీరోలు చేస్తే ఆడవు అనేది కృష్ణ కాలిక్యులేషన్. తర్వాత ఓ ఇంటర్వ్యూలో దానికి వివరణ కూడా ఇచ్చారు.’ ‘నాని’ కథ ముందుగా నేను వినలేదు. ఒకవేళ వినుంటే నేను వద్దు అని చెప్పేవాడిని. ఎందుకంటే చిన్న పిల్లాడు పెద్ద పిల్లాడుగా అవ్వడం అనేది ఇమేజ్ ఉన్న హీరో చేస్తే జనాలు చూడరు. తమిళ్ లో దర్శకుడే హీరోగా మారి చేశాడు. అందుకే అక్కడ హిట్ అయ్యింది’ అంటూ కృష్ణ చెప్పుకొచ్చారు.ఇవి ఓల్డ్ కామెంట్స్ అయినప్పటికీ సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతున్నాయి.