టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో ‘పుష్కలం’ అనే పదానికి పర్యాయపదంగా మారాడు శ్రీవిష్ణు. ‘సామజవరగమన’, ‘సింగిల్’ అంటూ వచ్చి ప్రేక్షకుల్ని మనసారా నవ్వుకునేలా చేశాడు. అయితే మొన్న దసరాకు మాత్రం షాక్ ఇచ్చాడు. కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కల్యాణ్’ అనే సినిమాను ప్రకటించాడు. పోస్టర్ కూడా అలానే సీరియస్ లుక్‌లోనే కనిపించింది. గ్లింప్స్ వీడియో కూడా అంతే. ఈ సినిమాలో శ్రీవిష్ణు నక్సలైట్‌గా కనిపిస్తాడని ప్రచార చిత్రాలు చూస్తే తెలిసింది.
దీంతో సినిమా మొత్తం సీరియస్ మోడ్‌లో సాగబోతోందని, శ్రీవిష్ణు మరోసారి ఓల్డ్ టచ్‌లోకి వెళ్తున్నాడని అందరూ అనుకున్నారు. కానీ సినిమా వర్గాల సమాచారం ప్రకారం అదొక ట్రాప్ అట. అంటే సినిమా జోనర్ విషయంలో ఇలాంటి లుక్ ఇచ్చి.. సినిమాలో కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేస్తున్నారట. ఈ సినిమాలో శ్రీ విష్ణు పీపుల్‌స్టార్ ఆర్.నారాయణ మూర్తి అభిమానిగా కనిపిస్తాడట. నారాయణ మూర్తి సినిమాలు చూస్తూ పెరిగిన కుర్రాడు నక్సలైట్ ఎందుకు అవ్వాలని అనుకున్నాడు అనేదే ప్రధానమైన కథ అట.
అయితే ఇదంతా కామెడీగానే సాగుతుంది అని చెబుతున్నారు. 1990ల్లో ఆంధ్రా – ఒడిశా బోర్డర్‌లో ఈ సినిమాను రన్ చేస్తారట. ఇంకా చెప్పాలంటే ‘సింగిల్’ సినిమాలో పాత్రకు ఇది కాస్త కంటిన్యుటీలా ఉంటుంది అని చెబుతున్నారు. అలాగే ఈ పోస్టర్ ఐ గ్రాబింగ్ కోసం చేసిందే అని అంటున్నారు. ‘సింగిల్’లో కూడా శ్రీవిష్ణు పాత్ర.. ఆర్.నారాయణమూర్తిని బాగా అభిమానిస్తుంది. ఇప్పుడు ఈ సినిమాలో దానిని కంటిన్యూ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో టీజర్ బయటకు వస్తే ఇంకా క్లారిటీ వస్తుంది.
‘సామజవరగమన’, ‘సింగిల్’ సినిమాల విజయాలు చూశాక మళ్లీ శ్రీవిష్ణు యాక్షన్ మోడ్‌లోకి, నార్మల్ మాస్ సినిమాలవైపు చూడడు అని చెప్పేయొచ్చు. మరి ఈ ‘కామ్రేడ్ కల్యాణ్’ ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.