“సమ్మోహనం, నన్ను దోచుకుందువటే” లాంటి సూపర్ హిట్స్ అనంతరం “వీర భోగ వసంతరాయులు, వి” లాంటి డిజాస్టర్లతో ఢీలాపడిన యువ కథానాయకుడు సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. “పలాస” చిత్రంతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో చిత్రమిది. విడుదలైన ట్రైలర్ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయినప్పటికీ.. ప్రమోషన్స్ కారణంగా సినిమా మీద జనాల్లో కాస్త మంచి క్రేజ్ ఏర్పడింది. మరి ఆ క్రేజ్ ను చిత్రబృందం క్యాష్ చేసుకోగలిగిందో లేదో చూద్దాం..!!
కథ: గోదావరి జిల్లాలోనే పేరొందిన ఎలక్ట్రీషియన్ సూరిబాబు (సుధీర్ బాబు). అమలాపురంలో మనోడి పనితనానికి మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అదే ఊర్లోని శ్రీదేవి (ఆనంది) క్యారెక్టర్ ను ఇష్టపడి ఆమెను ప్రేమిస్తాడు సూరిబాబు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి, కాస్త ముందుకు వెళ్లే సమయానికి కులం సమస్య తలెత్తుతుంది. సూరిబాబునే కాక సూరిబాబు తండ్రిని కూడా ఈ కులం సమస్య నానా ఇబ్బందులకు గురి చేస్తుంది. చివరికి ఈ కులాన్ని జయించి సూరిబాబు-శ్రీదేవిలు కలిసారా? లేదా? అనేది సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: నటుడిగా సుధీర్ బాబు కాస్త పరిణితి చెందాడనే చెప్పాలి. ఎమోషనల్ సీన్స్ లో బాగా నటించాడు. కామెడీ టైమింగ్ లో ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. అలాగే.. సిక్స్ ప్యాక్ ను ఆడియన్స్ చూడాలని తాపత్రయం కూడా కాస్త తగ్గిస్తే ఇంకాస్త బెటర్. ప్రతి సినిమాలోనూ హీరోయిన్ కంటే ఈయనగారి ఎక్స్ పోజింగ్ ఎక్కువైపోయింది. ఎలివేషన్ తో పని లేకుండా ప్రతిసారి ఆ అర్ధ నగ్న ప్రదర్శనలు కాస్త మానుకుంటే మంచిది. తెలుగమ్మాయి అయిన ఆనంది క్యారెక్టర్ ను ప్రెజంట్ చేసిన తీరు బాగుంది.
ఆనంది కూడా తన పాత్రకు జీవం పోసింది. నేటివిటీ రోల్స్ కి తెలుగమ్మాయిలను తీసుకుంటే ఎంత ప్లస్ అవుతుంది అనేది ఈ సినిమా చూసైనా కొందరు దర్శకులు అర్ధం చేసుకుంటే బాగుండు. రఘుబాబు కెరీర్ లో మరో గుర్తుండిపోయే పాత్రలో ఆకట్టుకున్నాడు. నరేష్ పాత్రలో సరైన డెప్త్ లేకపోయినా.. ఆయన మేనరిజమ్స్ ఆకట్టుకుంటాయి. ప్రవీణ్ యండమూరి నెగిటివ్ రోల్లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసాడు. సత్యం రాజేష్, సప్తగిరి నవ్వించడానికి ప్రయత్నించారు కానీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.
సాంకేతికవర్గం పనితీరు: కెమెరామెన్ షామ్ దత్ ను ముందుగా మెచ్చుకోవాలి. గోదావరి అందాలను ఇప్పటివరకు ఎవరూ ప్రెజంట్ చేయనంత అందంగా చూపించడమే కాక.. సరికొత్త డైమెన్షన్ లో పల్లెటూర్లను ఎలివేట్ చేసాడు. షామ్ లెవల్ ఫ్రేమ్స్ & లైటింగ్ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. మణిశర్మ మరోసారి నేపధ్య సంగీతంతో మాయ చేసాడు. ఎమోషనల్ సీన్స్ లోనూ ఆయన మార్క్ కనిపించింది. ఇక యాక్షన్ బ్లాక్స్ లో ఎప్పట్లానే చించేసాడు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది.
అలాగే.. స్క్రీన్ ప్లే విషయంలో చాలా చోట్ల క్లారిటీ సన్నగిల్లింది. ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిపార్టుమెంట్ తమ బెస్ట్ ఇచ్చారు చిత్రానికి. నేటివిటీ ఎక్కడా మిస్ అవ్వలేదు, పైగా ప్రతి సన్నివేశంలో సహజత్వం కనిపించింది అంటే కారణం వీళ్ళే. ఇక దర్శకుడు కరుణ కుమార్.. తెలుగు పా.రంజిత్ అనిపించుకోవడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదని చెప్పాలి. నిజానికి ఆయన మొదటి చిత్రం “పలాస” కూడా కథనం పరంగా కాస్త వీక్ గా ఉంటుంది. అయితే.. హీరో పెర్ఫార్మెన్స్ వీక్ అవ్వడంతో ఫెయిల్యూర్ క్రెడిట్ మొత్తం అతని ఎకౌంట్ లోకి వెళ్ళిపోయింది. “శ్రీదేవి సోడా సెంటర్” చిత్రాన్ని సహజంగా తెరకెక్కించడానికి తీసుకున్న జాగ్రత్తలో కనీసం 10% ఆసక్తికరంగా రూపొందించడానికి తీసుకొని ఉంటే బాగుండేది.
అసలే కథలో కొత్తదనం లేదు, కథనంలోనూ అది లోపించడం. ఒకట్రెండు సన్నివేశాలు మినహా ఏవీ ఆశించిన స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోవడం, క్లైమాక్స్ కంపొజిషన్ బాగున్నా.. దానికి సరైన జస్టిఫికేషన్ లేకపోవడంతో కన్విన్సింగ్ గా లేకుండాపోయింది. కులం గొడవలు అనేవి తెలుగు సినిమాకి కొత్త కాదు. ఎప్పుడో బాపురమణ-బాలచందర్ గార్లే పరాకాష్టలు చూపించేసారు. అలాంటి కాన్సెప్ట్ ను నేటితరం ప్రేక్షకులకు నచ్చేలా రియలిస్టిక్ ఎమోషన్స్ తో తెరకెక్కించాలంటే కావాలసింది బోల్డ్ సీన్స్ మాత్రమే కాదు సెన్సిబుల్ డీలింగ్. ఈ విషయంలో కరుణ కుమార్ ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది.
విశ్లేషణ: నేటివిటీ ప్రధానాంశంగా తెరకెక్కిన “శ్రీదేవి సోడా సెంటర్” కథనం పరంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. సినిక్ బ్యూటీ కంటే సినిమాటిక్ ఎలివేషన్ చాలా ముఖ్యం అనేది దర్శకులు అర్ధం చేసుకోవాల్సిన విషయం. అలాగని మరీ తీసిపారేయాల్సిన సినిమా కాదు. కాకపొతే.. ఇంకాస్త జాగ్రత్తగా తీసి ఉంటే బాగుండేది. ఆనంది నటన, మణిశర్మ సంగీతం, షామ్ దత్ సినిమాటోగ్రఫీ వర్క్ కోసం ఒకసారి చూడాల్సిన సినిమా ఇది.
రేటింగ్: 2/5