‘కొత్త బంగారు లోకం’ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ‘ముకుంద’ ‘బ్రహ్మోత్సవం’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్లు కూడా ఓ రొటీన్ ఫ్లేవర్ల తో కూడుకున్నవి కావు. అలాంటి దర్శకుడు తొలిసారి ఓ రీమేక్ మూవీని తెరకెక్కించాడు. అది కూడా ‘అసురన్’ వంటి వయొలెన్స్ తో కూడుకున్న ‘నారప్ప’ మూవీ. ఈరోజు అంటే జూలై 20న ఈ చిత్రం నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో రిలీజ్ అయ్యింది. ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఫిల్మీ ఫోకస్ తో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం :
ప్ర. ‘నారప్ప’ జర్నీ ఎలా మొదలైంది?
జ.’అసురన్’ మూవీ చూసినప్పుడు ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ ఆ కనెక్టివిటీ నాకు బాగా నచ్చింది.ఆ టైములో సురేష్ బాబు గారు ఈ మూవీని రీమేక్ చేస్తున్నారు అని తెలిసింది. అలాగే డైరెక్టర్ ఇంకా ఎవరూ ఫిక్స్ అవ్వలేదు అని కూడా విన్నాను. అయినప్పటికీ నేను వేరే కథ వినిపించాలని రామానాయుడు స్టూడియోస్ కి వెళ్లి సురేష్ బాబు గారిని కలిసాను. అదే టైములో ‘అసురన్’ కి ఎవరైనా ఫిక్స్ అయ్యారా అండి? అని అడిగాను. ఇంకా లేదు అని ఆయన అన్నారు. కుదిరితే నేను చేస్తాను అని ఆయనకి చెప్పాను. అందుకు వెంటనే ఆయన ఓకే చెప్పారు. అలా ఆ ప్రాజెక్టు మొదలైంది.
ప్ర.సురేష్ బాబు గారు స్క్రిప్ట్ విషయంలో ఏమైనా మార్పులు సూచించారా?
జ.ఇది రీమేక్ కాబట్టి.. ఏది కావాలో మనకి ముందే ఐడియా ఉంటుంది. కాబట్టి.. స్టోరీ గురించి దిగులు లేదు. అండ్ సురేష్ బాబు గారితో నేను చెప్పాను.. ‘ఈ రీమేక్ కి మార్పులు అనవసరం అండీ..! ఎలా ఉందో అలాగే తెలుగు ప్రేక్షకులకు చూపించడం మంచిది అని చెప్పాను. కొన్ని గొప్ప సినిమాలని మనం చెడగొట్టకూడదు అనే ఉద్దేశంతో అలా చెప్పాను. నేటివిటీ పరంగా మాత్రమే మార్పులు చేసాము.
ప్ర. ‘నారప్ప’ చూసాక ఆడియెన్స్ రెస్పాన్స్ మీకు ఎలా అనిపించింది?
జ. ‘శ్రీకాంత్ అడ్డాల ఇలాంటి సినిమా తీస్తాడు అని అనుకోలేదు రా బాబు’ అని ఎవరో ఒక నెటిజెన్ కామెంట్ పెట్టాడు. అది నాకు బాగా అనిపించింది.
ప్ర. అసురన్ మూవీలో కొన్ని కులాల గురించి ప్రస్తావన ఉంటుంది. కానీ తెలుగులో మాత్రం పేద- ధనిక అనే వైరాలు మాత్రమే చూపించారు? అది ఎందుకు మార్పు చేయాలనిపించింది.
జ.ఎక్కడైనా.. ఏ ఏరియాలో అయినా.. ఏ రంగంలో అయినా.. బలవంతుడికి,బలహీనుడికి.. డబ్బున్నోడికి,డబ్బులేనోడికి ఇలాంటి వాళ్ళ మధ్యనే క్లాష్ మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ధనవంతుడు… పేదోడిని ఎదగనివ్వకుండా, బలవంతుడు .. బలహీనుడిని గెలవనివ్వకుండా చేస్తాడు. వాళ్ళకి వీళ్ళని తొక్కడానికి అవి సరిపోవడం లేదు అనుకున్నప్పటి కులం, మతం వంటి వాటి జోలికి పోతారు. అందుకే మొదటి పాయింట్ ను మాత్రమే నేను తీసుకున్నాను.
ప్ర.’నారప్ప’ పెద్ద కొడుకు చనిపోయినప్పుడు ఆ ఎమోషనల్ సీన్ ను మీరు ఎలా హ్యాండిల్ చేశారు. ఆ డెడ్ బాడీని అలా చూస్తే చిన్నపిల్లలు భయపడతారు అనే భావన మీకు కలిగిందా?
జ. ఆ డెడ్ బాడీ సీన్ ఉండడం వలెనే.. అక్కడ ఆర్టిస్ట్ లతో పాటు సినిమా చూసే ఆడియెన్స్ కూడా కనెక్ట్ అవుతారు అనిపించింది. అందుకే ఆ సీన్ ను ఒరిజినల్ లో ఉన్నట్టే చూపించాను.
ప్ర. ప్రియమణి గారిని ఈ రీమేక్ లోకి తీసుకోవాలనే ఆలోచన మీకు వచ్చిందా.. లేక సురేష్ బాబుగారికి వచ్చిందా?
జ. నాకు వచ్చిందే అండి. అసురన్ మూవీ చూసినప్పుడే నేను ప్రియమణి గారు అయితే బాగుంటుంది అని నేను ఫిక్స్ అయ్యాను.
ప్ర. ‘బ్రహ్మోత్సవం’ ఫలితం మిమ్మల్ని ఇండస్ట్రీకి 5 ఏళ్ళు దూరం చేసేసిందని ఎప్పుడైనా ఫీలయ్యారా?
జ. ఆ మూవీ నన్ను ఇండస్ట్రీకి ఇంకా దగ్గర చేసింది. ఆ మూవీ స్క్రిప్ట్ విషయంలోనే తేడా కొట్టింది. తీస్తున్నప్పుడు ఏంటి అనేది తెలియలేదు కానీ చివరికి వచ్చేసరికి ‘అరెరే తప్పు చేసానే’ అనిపించింది. కానీ ఆ మూవీ వల్ల నాకు జాగ్రత్త అనేది పెరిగింది. తర్వాత చేయబోయే సినిమాల విషయంలో ఎంత కేరింగ్ గా ఉండాలనేది నేర్చుకున్నాను.
ప్ర. మీ మొదటి 3 సినిమాలకు మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించారు. కానీ ఈ మూవీకి మణిశర్మ గారిని పెట్టుకున్నారు కారణం?
జ. మణిశర్మ గారితో నేను ‘సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు’ మూవీకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయించుకున్నాను. అప్పటి నుండీ ఆయనతో నాకు పరిచయం ఉంది. ఇలాంటి మాస్ ఎలిమెంట్స్ ఉన్న మూవీకి ఆయనైతేనే కరెక్ట్ అనిపించింది.
ప్ర.’నారప్ప’ కి ముందు మీరు తీసిన ‘సీతమ్మ వాకిట్లో’ పక్కన పెడితే మిగిలిన 3 సినిమాల్లో హీరో ఫాదర్ చనిపోతారు.. ఎందుకు అలా?
జ. అది ప్లాన్ చేసింది కాదండీ. ‘కొత్త బంగారు లోకం’ మూవీలో హీరో ఫాథర్ చనిపోయిన తర్వాతే కథకి జడ్జిమెంట్ ఉంటుంది. అలాగే ‘బ్రహ్మోత్సవం’ లో కూడా..! కానీ ‘ముకుంద’ మూవీలో మొదట ఫాథర్ రోల్ ని చనిపోయినట్టు చూపించాలి అనుకోలేదు. కానీ హీరో పై మరింత ప్రెజర్ ఉంటే అతని ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనేది చూపించాలని.. అందులో కూడా ఫాథర్ రోల్ ని చనిపోయినట్టు చూపించడం జరిగింది.
ప్ర.కమల్ హాసన్- వెంకటేష్ గారితో మూవీ చేయబోతున్నారని 3 ఏళ్ళ క్రితం వార్తలు వచ్చాయి నిజమేనా?
జ. అది నా డ్రీం ప్రాజెక్టు అని చెప్పనండీ..! కమల్ హాసన్ గారు వెంకటేష్ గారితో మూవీ చేయాలనేది నా డ్రీం అని చెప్తే ప్రాజెక్టు ఓకే అయిపోయినట్టు ప్రచారం జరిగింది.
ప్ర.’సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లో ప్రకాష్ రాజ్ గారి పాత్ర కోసం ముందుగా రజినీ కాంత్ గారిని సంప్రదించారట నిజమేనా?
జ. ముందుగా అనుకున్నాం అండీ.. కానీ అది కుదర్లేదు..!